సిరితిళ్లతో.. అమ్మల విజయం!
ఎంత ప్రయత్నించినా పిల్లలతో పోషకాహారాన్ని తినిపించడం తల్లులకు సవాలే! మార్కెట్‌లో దొరికే చిరుతిళ్లలా అవి వాళ్లని మెప్పించలేవు మరి. ఎంతోమంది తల్లులకు సమస్యగా మారిన దీనికి పరిష్కారం చూపాలనుకున్నారీ అమ్మలు.
ఎంత ప్రయత్నించినా పిల్లలతో పోషకాహారాన్ని తినిపించడం తల్లులకు సవాలే! మార్కెట్‌లో దొరికే చిరుతిళ్లలా అవి వాళ్లని మెప్పించలేవు మరి. ఎంతోమంది తల్లులకు సమస్యగా మారిన దీనికి పరిష్కారం చూపాలనుకున్నారీ అమ్మలు. ‘రిగ్దమ్ ఫుడ్స్’ పేరుతో సిరిధాన్యాలతో చిరుతిళ్లు తయారుచేస్తూ లాభాల బాట పట్టడమే కాదు.. ప్రభుత్వాల గుర్తింపూ పొందారు దిభ్యజ్యోతి, మాధవి. ఆ విజయగాథను వసుంధరతో పంచుకున్నారు.
దిభ్యజ్యోతిది అసోం.. భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పిల్లల కోసం టీచర్ వృత్తిని వదులుకుని సొంతంగా ఏదైనా ప్రయత్నిద్దామని ‘ఆంత్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’లో చేరారు. అక్కడే న్యూట్రిషనిస్ట్ మాధవి పోమర్ పరిచయమయ్యారు. ఈమెది తిరుపతి. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈవిడా పిల్లల కోసమని కెరియర్‌ని పక్కనపెట్టారు. వీళ్లిద్దరూ ఎప్పుడు కలిసినా చిన్నారుల్లో అనారోగ్య ఆహారపుటలవాట్ల గురించే చర్చ! తమలాగే ఎంతోమంది అమ్మలదీ ఇదే సమస్యని గుర్తించాక ‘సిరిధాన్యాలతో చిరుతిళ్లు చేస్తే’ అన్న ఆలోచన వచ్చింది. అలా ‘రిగ్దమ్ ఫుడ్స్’ ప్రారంభమైంది.
రెడీ టు ఈట్ ఉత్పత్తులతో..
‘సంస్థ 2014లోనే ప్రారంభించినా రెండేళ్లు పరిశోధనకే కేటాయించాం. ఐఐఎమ్‌ఆర్, ఇక్రిశాట్ సంస్థలతో సంప్రదింపులు జరిపాం. స్పష్టత వచ్చాక మొదట రెడీమేడ్ ఉత్పత్తులు తయారుచేసి వారాంతాల్లో స్టాల్స్ పెట్టి అమ్మేవాళ్లం. అప్పుడే వండటం తెలీక జొన్న, రాగి వంటివాటిని ఎక్కువమంది ఇష్టపడకపోవడం గమనించాం. దీంతో ‘రెడీ టు ఈట్’ ఉత్పత్తులపై దృష్టిపెట్టాం. రాగి చాకోబార్‌లు, బిస్కెట్లు, చాకో బాల్స్, బిస్కట్లు, బ్రేక్‌ఫాస్ట్ బార్స్, న్యూట్రీబార్స్ వంటివి తయారు చేయించి, ఆన్‌లైన్‌లో అమ్మకాలు ప్రారంభించాం’ అంటారు మాధవి. ‘సరకు తీసుకొని డబ్బులు త్వరగా ఇచ్చేవారు కాదు. పూర్తిగా ఎగ్గొట్టినవాళ్లూ ఉన్నారు. ఓసారి సరకు అహ్మదాబాద్ పంపిస్తే అమ్ముడుపోవటం లేదని డబ్బు, సరకు రెండూ ఇవ్వలేదు. రూ.2లక్షల దాకా పోయింది. ఇంకా సంస్థల్లో, ప్రాజెక్టుల్లో ఆడాళ్లమని అవకాశాలిచ్చేవారు కాదు. తెల్లవారు జామున 2గం.కి ఇంటికెళ్లి.. తిరిగి 6గం.లకు నిద్రలేచి పిల్లలకు వండిపెట్టిన సందర్భాలెన్నో. ఎన్ని ఎదురైనా నిరుత్సాహపడలేదు. ఓపికగా ప్రయత్నించాం. కాబట్టే రూ.10 లక్షలు పెట్టుబడితో ప్రారంభిస్తే 2019 నాటికే రూ.40లక్షల టర్నోవర్‌కు చేర్చగలిగాం. కరోనా సమయంలో వ్యాపారం తగ్గినా ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నా’మని చెబుతారు మాధవి.
జీ-20 సదస్సుకు..
వారి శ్రమకు గుర్తింపుగా అసోం ప్రభుత్వం నుంచి పిలుపొచ్చింది. 2023ని ‘అంతర్జాతీయ సిరిధాన్యాల సంవత్సరం’గా గుర్తించిన సందర్భంగా జీ-20 ప్రతినిధులకు మిల్లెట్ బుట్టలను అందించాలనుకుంది. వీరి గురించి తెలిసి 1000 బుట్టలు ఆర్డరిచ్చి.. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు బహూకరించింది. దిభ్య, మాధవి.. సిరిధాన్యాలకు ప్రచారం కల్పించడానికి దిస్పూర్‌లో అసోం సెక్రటేరియట్ ‘మిల్లెట్ కెఫే’ ప్రారంభించారు. కిచిడీ, పాస్తా, మిల్లెట్ లడ్డు, నూడిల్స్ వంటివి తయారు చేస్తున్నారు. గువాహటిలోనూ మరో శాఖ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్రిశాట్ ఆదిలాబాద్‌లో ‘మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రాం’ చేపట్టింది. అక్కడి గిరిజన పిల్లలు, మహిళల్లో రక్తహీనతను పోగొట్టడానికి సిరిధాన్యాలతో చేసిన ఉత్పత్తులు అందిస్తున్నారు. రిగ్దమ్ కూడా వాటిని అందించే వాటిల్లో ఒకటి. ‘సంస్థలో ఉద్యోగులు పదిమందిలోపే. నెలకు 300 కేజీల సరకు అందించాలి. ఒక్కోసారి రాత్రి 3గం. అయ్యేది. కానీ అవి తిన్నాక పిల్లల్లో చాలా మార్పు వచ్చిందన్న ప్రశంసలొచ్చినపుడు కష్టమంతా మర్చిపోయా’మంటారీ ద్వయం. మహిళల వ్యాపారాన్ని చాలామంది సీరియస్‌గా తీసుకోరు. అయినా ధైర్యం, ఓపికతో కొనసాగగలిగితేనే విజయం దక్కుతుందంటారు. రిగ్దమ్ 2016లో ఎలీప్ (అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంత్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా) నుంచి ‘బెస్ట్ మిల్లెట్ ఫుడ్ స్టార్టప్’ పురస్కారాన్నీ అందుకుంది.
మన్నెం రమాదేవి, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.