అంగారక ప్రపంచంలోకి.. ఆమె!

అంగారకుడిపై జీవుల మనుగడ సాధ్యమా అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2030లోగా ఆ గ్రహంపైకి మనుషుల్ని పంపే ప్రయత్నాలూ జరుగుతున్నాయి.

Updated : 01 Jun 2023 00:23 IST

అంగారకుడిపై జీవుల మనుగడ సాధ్యమా అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2030లోగా ఆ గ్రహంపైకి మనుషుల్ని పంపే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఈక్రమంలో అక్కడి వాతావరణాన్ని మానవులు ఎంతవరకూ తట్టుకోగలరో పరీక్షించాలనుకున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి వాతావరణాన్నే భూమిపై సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల నుంచి ఎన్నో వడపోతల ద్వారా నలుగురిని ఎంపిక చేసి, ఏడాదిపాటు ఆ వాతావరణంలో నివసించే ఏర్పాట్లు చేశారు. వారిలో ఇద్దరు మహిళలే!


ఆతృతగా ఎదురు చూస్తున్నా
కెల్లీ హాస్టన్‌

నాసా చేపట్టిన ఈ ప్రయోగానికి కెల్లీనే నాయకురాలు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి, పలు జీవ సాంకేతిక సంస్థల్లో శాస్త్రవేత్తగా సేవలందించారు. మానవ వ్యాధులపై ప్రయోగాలు, వాటికి సంబంధించిన నమూనాలు రూపొం దించడం ఆమె విధి. నాడీ- కాలేయ సంబంధిత సమస్యలు/ వ్యాధులు, సంతానలేమి.. వంటి సమస్యలకు స్టెమ్‌ సెల్‌ ఆధారిత చికిత్స పద్ధతుల్ని కనుగొనడంలో కీలక పాత్ర పోషించారామె. ‘కృత్రిమ వాతావరణం లోనే ఉన్నా.. బయటి ప్రపంచంతో ఏడాదికిపైగా సంబంధాలు తెగిపోతాయి. ఇంట్లోవాళ్లతో మాట్లాడాలన్నా ఈమెయిల్‌ లేదా వీడియో రికార్డింగే గతి. ఇన్నిరోజులు కుటుంబానికి దూరంగా ఉండటం సవాలే. అయినా ప్రపంచం గర్వించే ప్రయోగంలో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. నిర్ణీత వ్యవధుల్లో స్పేస్‌ సూట్‌ ధరించి, స్పేస్‌వాక్‌ చేయాలి. చిన్నప్పట్నుంచీ అంతరిక్షం, సంబంధిత ప్రయోగాలంటే ఆసక్తి. ఎప్పుడెప్పుడు ప్రారంభమ వుతుందా అని ఆతృతగానూ ఎదురు చూస్తున్నా’ అంటున్నారు 52 ఏళ్ల కెల్లీ.


చిన్నప్పటి కల
అలీసా షానన్‌

సైన్స్‌ ఆఫీసర్‌గా విధులు అందించనున్న అలీసా.. మార్స్‌ పరిశోధన గురించి తెలిసి, ఆసక్తిగా గమనించారట. అర్హతలకు తను సరిగా సరిపోతానని తెలిశాక రాదనుకుంటూనే ప్రయత్నించారు. ‘ఓ సారి కారు నడుపుతూ వెళుతుండగా రేడియోలో విషయం తెలిసింది. వెంటనే వెబ్‌సైట్‌లో వెదికి.. దరఖాస్తు చేసేశా. చిన్నప్పుడు గ్రహాలు, అక్కడి జీవులు నన్ను బాగా ఆకర్షించేవి. స్పేస్‌ సూట్‌ వేసుకొని అక్కడికి వెళ్లినట్టు కలలూ కనేదాన్ని. ఆ సరదా ఆలోచనే ప్రయత్నించేలా చేసింది. కానీ ఎంపికవుతా అనుకోలేదు. ఇప్పుడు కృత్రిమ వాతావరణంలోకే వెళుతున్నా. ఈ ప్రయోగం సఫలమైతే ప్రపంచవ్యాప్తంగా ఎందరికో మార్గదర్శిని అవ్వడమే కాదు.. కొన్నేళ్ల తర్వాత నేరుగా మార్స్‌ మీదకి వెళ్లే వారికి నావంతు సాయం చేశానన్న ఆలోచనే కొత్తగా ఉంది’ అంటోన్న అలీసాది అమెరికా. ఎంఎస్‌సీ చేసి ఈమె డావిస్‌ మెడికల్‌ సెంటర్‌లో కార్డియోవాస్కులార్‌ క్లినికల్‌ నర్స్‌ స్పెషలిస్ట్‌. జెనెటిక్స్‌లో మైనర్‌ కూడా చేశారు. డేటా విజువలైజేషన్‌పై ఆసక్తి, ఏళ్ల అనుభవం, రోగులను కాపాడే విషయంలో అత్యంత కీలకమైన డేటా సేకరణలో కచ్చితత్వమే తన ఎంపికకు కారణమయ్యాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని