శాలువాలు అమ్మి సాయంగా నిలిచి..
ఆ ప్రాంతానికి ప్రత్యేక సంప్రదాయ కళ ఉంది. అయితే షీలా పవల్ చొరవ తీసుకొనేవరకు అక్కడివారికి అది చేయూతకాలేకపోయింది. వారిలోని సృజనాత్మకత అందరికీ తెలిసేలా చేయగలిగారామె.
ఆ ప్రాంతానికి ప్రత్యేక సంప్రదాయ కళ ఉంది. అయితే షీలా పవల్ చొరవ తీసుకొనేవరకు అక్కడివారికి అది చేయూతకాలేకపోయింది. వారిలోని సృజనాత్మకత అందరికీ తెలిసేలా చేయగలిగారామె. వారికే పరిమితం చేసుకొన్న ఆ ఎంబ్రాయిడరీ కళను ఆమె దేశవ్యాప్తం చేశారు. మహిళాసాధికారత కోసం కృషి చేస్తున్న షీలా పవల్ స్ఫూర్తి కథనమిది.
మిథిపూవ్ 70 ఏళ్ల వయసులోనూ.. తమిళనాడు నీలగిరిలోని పోర్తిమండు నుంచి వారానికొకసారి ఊటీ వస్తారు. ముప్పావుగంట ప్రయాణం చేసి మరీ అక్కడికి చేరుకొనే ఆమె తనతోపాటు తెచ్చిన ఎంబ్రాయిడరీ వస్త్రాలను షీలాకు అందించి తగిన ధరను తీసుకొని వెనుదిరుగుతారు. ఇలా మిథిపూవ్ ఒక్కరే కాదు.. వందలమంది తోడా గిరిజన మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చేశారు షీలా. గతంలో తమ దుస్తులకు మాత్రమే వినియోగించే ఎంబ్రాయిడరీ కళను అందరికీ తెలిసేలా చేయాలనే ఆలోచనను షీలా చెప్పేవరకు వీరికి రాలేదు.
కలిసి పని చేసి..
ఊటీలో పుట్టిపెరిగిన షీలా తోడా గిరిజనులకు చదువు చెప్పేవారు. ‘ఇక్కడి వారికి దుస్తులపై ఎంబ్రాయిడరీ చేసుకోవడం అలవాటు. దీన్ని తోడా ఎంబ్రాయిడరీ అని పిలిచేవారు. ఎంతో కష్టమైన ఈ పనిని ఇక్కడివారు అతి సునాయాసంగా అల్లేస్తారు. దాదాపు 20 రకాల మోటిఫ్‌లుండే ఈ కళ వీరికి మాత్రమే ప్రత్యేకం. నేనూ నేర్చుకోవాలనుకున్నా.. కానీ, ఇద్దరు పిల్లల పనులతో సమయం దొరికేది కాదు. వారు పెద్దయ్యే కొద్దీ ఇంటి అవసరాలు పెరగడంతో నేను కూడా ఏదైనా చేయాలనుకున్నా. కుషన్ కవర్లు, బ్యాగులు, టేబుల్‌క్లాత్‌లు సొంతంగా తయారుచేసి విక్రయించేదాన్ని. నన్ను చూసి కొందరు గిరిజన మహిళలు తాము కూడా కవర్లు, బ్యాగులు తయారుచేసి ఇస్తామని, వాటిని విక్రయించి పెట్టమని అడిగారు. అది వారిని ఆర్థికంగా నిలబెట్టేలా ఉండాలని 20మందితో ఒక స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటుచేశానంటా’రు షీలా.
రూ.20వేలు...
ఆ మహిళాబృందం తయారుచేసిన ఉత్పత్తులను షీలా మార్కెట్‌లో విక్రయించేవారు. కొన్నాళ్లకు సమీప గ్రామాల నుంచి మరికొందరు మహిళలు ఈ బృందంలో చేరడానికి ఆసక్తి చూపించారు. ‘తాము ఎంబ్రాయిడరీ చేసిన శాలువాలను నావద్దకు తీసుకొచ్చారు. వాటిని పర్యాటకులకు అమ్మిపెట్టమని లేదా నన్ను కొనుగోలు చేయమని అడిగారు. ఎంతో కష్టపడి అల్లే షాల్స్‌కు వెంటనే నగదును ఇవ్వగలిగితే తమకు సాయంగా ఉంటుందన్నారు. దాంతో ‘శాలోం ఊటీ’ పేరుతో సంస్థను ప్రారంభించి వారి ఉత్పత్తులను కొనడం మొదలుపెట్టా. ఆ తర్వాత వాటిని మార్కెట్‌లో విక్రయించేదాన్ని. దాదాపు 250మందిపైగా గిరిజన మహిళలు నాతో కలిసి పనిచేస్తూ నేను చెప్పే ఉత్పత్తులను తయారు చేసేవారు. మరో 200 మంది తాము సొంతంగా ఎంబ్రాయిడరీ చేసిన శాలువాలను మాకు విక్రయించి వెళతారు. ఇప్పుడు వీరందరికీ ముడిసరకును ఇవ్వడం ప్రారంభించా. ప్రస్తుతం ఈ మహిళలంతా వారానికి తలా రూ.5వేలు ఆదాయాన్ని అందుకుంటున్నారు. శాలువాలు సహా బ్యాగులు, దిండు కవర్లు వంటి 20రకాలకుపైగా ఉత్పత్తులు ఆన్‌లైన్, ఎగ్జిబిషన్ల ద్వారా హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, తమిళనాడు తదితర ప్రాంతాలన్నింటిలోనూ అమ్ముడవుతున్నాయి’ అంటోన్న షీలా గత రెండు దశాబ్దాలుగా అందిస్తున్న ఈ ప్రోత్సాహం... ఇప్పుడు వందలమంది గిరిజన మహిళలను ఆర్థికంగా నిలబెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.