నడిపెయ్యడానికి మేం రెడీ!

‘అమ్మాయిలకు వాహనాలు నడపడం రాదు.. రోడ్డు మీదకి వస్తే ప్రమాదం ఖాయం’.. ఈ కామెంట్లు ఎన్నిసార్లు వినుంటాం? వాళ్లకు సరిగా నేర్పేవారే లేరు. ఎలాగోలా నేర్చుకున్నా ఇలాంటి మాటలు.. ఈ తీరునే మార్చాలనుకున్నారు వీళ్లు. ఈ నిర్ణయం ఎంతోమంది మహిళలకి ఉపాధినీ చూపిస్తోంది. ఓరోజు రోడ్డు మీద వెళ్తున్న అమృతని ఓ సంఘటన ఆకర్షించింది. భర్త.. భార్యకి బండి నేర్పుతున్నాడు. నేర్పేది తక్కువ, రావడం లేదంటూ కోప్పడటం ఎక్కువ. భయంతో మరింత బిగుసుకుపోతోందామె.

Updated : 09 Jan 2024 12:12 IST

‘అమ్మాయిలకు వాహనాలు నడపడం రాదు.. రోడ్డు మీదకి వస్తే ప్రమాదం ఖాయం’.. ఈ కామెంట్లు ఎన్నిసార్లు వినుంటాం? వాళ్లకు సరిగా నేర్పేవారే లేరు. ఎలాగోలా నేర్చుకున్నా ఇలాంటి మాటలు.. ఈ తీరునే మార్చాలనుకున్నారు వీళ్లు. ఈ నిర్ణయం ఎంతోమంది మహిళలకి ఉపాధినీ చూపిస్తోంది.

రోజు రోడ్డు మీద వెళ్తున్న అమృతని ఓ సంఘటన ఆకర్షించింది. భర్త.. భార్యకి బండి నేర్పుతున్నాడు. నేర్పేది తక్కువ, రావడం లేదంటూ కోప్పడటం ఎక్కువ. భయంతో మరింత బిగుసుకుపోతోందామె. అది ఈ ముంబయి అమ్మాయిని ఆలోచనలో పడేసింది. ‘అబ్బాయిలతో పోటీపడి ఆడటం.. అన్నయ్య ప్రభావం వల్ల వాహనాలంటే పిచ్చి ఏర్పడింది. తన సాయంతోనే నేర్చుకున్నా. సాహసయాత్రలూ చేస్తుంటా. సినిమాలు, సీరియళ్లకు ‘బైకర్‌ యాక్షన్‌ ఆర్టిస్ట్‌’గానూ చేశా. బీఎస్‌సీ పూర్తయ్యాక ఏదైనా సొంతంగా చేయాలనుకున్నా. ఈ సంఘటనతో డ్రైవింగ్‌ స్కూలు ఆలోచన వచ్చింది. బండ్లు, ముఖ్యంగా ఆడవాళ్లకు ప్రత్యేకంగా నేర్పించేవే లేవు. అందుకే ఆసక్తి ఉన్నా కొందరు భద్రత దృష్ట్యా వెనకడుగేయడం చూశా. 21ఏళ్ల వయసులో 2018లో ‘విమెన్‌ ఆన్‌ వీల్స్‌’ ప్రారంభించా. నేర్పేదీ ఆడవాళ్లే’ అనే అమృత ఎన్నో సవాళ్లూ ఎదుర్కొంది. ‘అమ్మాయి నేర్పడం సురక్షితం కాదనేవారు. తట్టుకొని నిరూపించుకున్నా. ఇంతలో కొవిడ్‌. నా దగ్గర నేర్చుకున్నవారే చాలామంది ఇన్‌స్ట్రక్టర్లుగా చేరారు. ఒక్కసారిగా ఉపాధి పోయింది. చేతిలో డబ్బు లేదు.. కొన్న బండ్లూ వృథాగా పడి ఉన్నాయి. అప్పుడు కొందరు వృద్ధులు కావాల్సినవి తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడటం చూశా. కొన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని 2021లో ‘వావ్‌ డెలివరీస్‌’ ప్రారంభించా. మా దగ్గర నేర్చుకుని ఆసక్తి ఉన్నవారికి దీనిలో అవకాశమిస్తున్నా. మూడేళ్లలో పెద్దగా ఫిర్యాదులేం లేకుండా సాగుతున్నాం. సరిగా నడపలేరన్న  పేరును చెరిపేస్తూ... సకాలంలో అందిస్తున్నారన్న గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉంది’ అంటోన్న అమృత వేలమందికి నేర్పింది. ‘షీ కెన్‌ రైడ్‌’ పేరుతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 2022లో ‘ఇన్‌స్పైరింగ్‌ ఉమన్‌’ సహా పలు పురస్కారాలు అందుకున్న తను మోటివేషనల్‌ స్పీకర్‌ కూడా. ఈ సేవలను దేశవ్యాప్తం చేయాలన్నది ఆమె కల అట!

బైకర్నీగా బండి మీద దూసుకెళ్లడం తనకు సాధారణ విషయమే! కానీ చాలామంది అమ్మాయిలకు కాదని గ్రహించారు జయభారతి. నేర్చుకోవాలనుండీ వీలు లేనివారికి సాయం చేయాలనుకున్నారీ హైదరాబాదీ. ‘బైకు మీద దేశవిదేశాలు ప్రయాణించా. ఓసారి వియత్నాం వెళ్లినప్పుడు ఇద్దరు మహిళా బైక్‌ ట్యాక్సీ డ్రైవర్లను చూశా. మన దగ్గర నలభయ్యేళ్ల మహిళలు ఇలాంటి వృత్తులను చేయడం ఊహిస్తామా? ఇక్కడా అలా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే 2019లో ‘మోవో’ (మూవింగ్‌ విమెన్‌) ప్రారంభించా. వాహనాలు మావే, ఉచితంగా నేర్పిస్తాం. అయితే లైసెన్స్‌ తీసుకోవాలి. ఇన్‌స్ట్రక్టర్లను నియమించుకొని ఏడాదిలోనే 1200 మందికి నేర్పా. ఇంతలో కొవిడ్‌ రావడంతో శిక్షణ ఆపాల్సొచ్చింది. లాక్‌డౌన్‌ సడలించాక అమ్మాయిలు వాహనాలు నడపడంపై ప్రచారం కల్పించాలనుకున్నా. దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ 40రోజుల్లో 11000 కి.మీ. రైడ్‌ ప్లాన్‌ చేశా. ఆ విశేషాలన్నీ సోషల్‌ మీడియాలో పంచుకుని చాలామందికి చేరువయ్యాం. కొన్ని సంస్థలూ వాహనాలిచ్చాయి. ఈసారి నేర్పడమే కాదు.. తమ కాళ్లపై తాము నిలవాలనుకునే మహిళలకు ఉపాధిని చూపించాలని ‘మోవో ఫ్లీట్‌’ ప్రారంభించా. బ్లూడార్ట్‌, ఈటీవో మోటార్స్‌ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకొన్నాం. పరిశోధన చేసి, అంతా బాగున్నాకే సంస్థను సిఫారసు చేస్తాం. అలా 200 మందికి పైగా ఉపాధి చూపించాం. ప్రస్తుతం కూకట్‌పల్లి మహిళా శిశువికాస కేంద్రం ప్రాంగణంలో శిక్షణిస్తున్నాం. క్యాంపులూ నిర్వహిస్తుంటాం. ఎలక్ట్రిక్‌ ఆటోలు నడపడమూ నేర్పుతున్నాం. ఇప్పటివరకూ 3వేల మందికిపైగా మెలకువలు అందించాం. హైదరాబాద్‌ బిట్స్‌లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, చిరు ఉద్యోగులతోపాటు, దిల్లీలోని ఓ యూనివర్సిటీలోనూ నేర్పాం. చార్మినార్‌లో మావద్ద శిక్షణ తీసుకున్న కొందరు మహిళలు ఎలక్ట్రిక్‌ ఆటోలను నడుపుతున్నారు. ఇన్‌స్ట్రక్టర్లూ అయ్యారు. 2030కల్లా పది లక్షల మంది మహిళలను డ్రైవర్లుగా చూడాలన్నది కోరిక’ అంటారీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్