లక్షమంది మహిళా‘శక్తి’ మాది!

ఇల్లు కట్టుకోవాలన్నా, బాగు చేయించుకోవాలన్నా వాళ్లు రుణాలిస్తారు. కానీ మహిళలకు మాత్రమే! ఇంకా చెప్పాలంటే ఆ రుణాలు ఇచ్చేది, ఇప్పించేది కూడా మహిళలే! ఆశ్చర్యంగా ఉంది కదా?  లక్షమంది ‘మహిళాశక్తి’తో... దేశమంతా విస్తరించిన ఏవియోమ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ విజయగాథ ఇది.

Updated : 09 Feb 2024 07:20 IST

ఇల్లు కట్టుకోవాలన్నా,  బాగు చేయించుకోవాలన్నా వాళ్లు రుణాలిస్తారు. కానీ మహిళలకు మాత్రమే! ఇంకా చెప్పాలంటే ఆ రుణాలు ఇచ్చేది, ఇప్పించేది కూడా మహిళలే! ఆశ్చర్యంగా ఉంది కదా?  లక్షమంది ‘మహిళాశక్తి’తో... దేశమంతా విస్తరించిన ఏవియోమ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ విజయగాథ ఇది...

‘ఇల్లాలు, గృహిణి, హౌస్‌వైఫ్‌... అంటూ ఇంటితో ముడిపెట్టి ఆడవాళ్లని పిలుస్తారు. కానీ ఆ ఇంటిపై ఎంతమంది మహిళలకు హక్కుంది? ఆర్థికంగా ప్రతి చిన్న అవసరానికీ భర్తపై ఆధారపడాలి. వాళ్లు కాదంటే ఆ నీడా ఉండదు. అదే ఆ ఇల్లు వాళ్ల పేరనే ఉంటే? దేశ ఆర్థిక ప్రగతిలో స్త్రీలకో గుర్తింపుతోపాటు... వాళ్ల జీవితాలకు భద్రత, భరోసా ఉంటాయి. అందుకే ఏవియోమ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఆడవాళ్లకు మాత్రమే ఇంటి రుణాలిస్తుంది..’ అంటారు ఆ సంస్థ సీఈవో కాజల్‌ ఇల్మీ. రెండు దశాబ్దాలపాటు... లింగవివక్షపై లోతుగా అధ్యయనం చేసిన కాజల్‌ ఆడవాళ్ల సమస్యలకు ఇల్లు ఓ పరిష్కారం ఇస్తుందని భావించి 2016లో ‘ఏవియోమ్‌కి శ్రీకారం చుట్టారు. కాజల్‌ తండ్రి దౌత్యవేత్త కావడంతో చైనా, డెన్మార్క్‌, ఒమన్‌, బహ్రెయిన్‌, మంగోలియా వంటి చోట్ల విద్య అభ్యసించారు. ఇండియాకొచ్చాక రిలయన్స్‌, పీవీఆర్‌, డీఎల్‌ఎఫ్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలతో పనిచేసిన అనుభవమూ ఉంది. ఆపై రెండు దశాబ్దాలు... మానవహక్కుల సంఘాలతో కలిసి లైంగిక వివక్షని తగ్గించే దిశగా పనిచేశారు. ‘నగరాలతో పోలిస్తే... గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలపై వివక్ష ఎక్కువ. అందుకే మహిళలకు రుణాలివ్వడం అక్కడి నుంచే ప్రారంభించాం. ఇల్లు నిర్మించుకోవాలన్నా, మరమ్మతు చేయించుకోవాలన్నా రూ. 5వేల నుంచి రూ.5లక్షల వరకూ రుణాలిస్తాం. టాయిలెట్‌ మాత్రమే నిర్మించుకోవాలన్నా రుణం ఇస్తాం. మనదేశంలో ఎంతోమంది మహిళలు... ఇప్పటికీ బహిరంగ విసర్జననే ఆశ్రయిస్తున్నారు. దాంతో వారిపై అఘాయిత్యాలూ జరుగుతున్నాయి. అంతేకాదు పాఠశాలల్లోనూ మరుగుదొడ్ల నిర్మాణ అవసరం చాలా ఉంది. అవి లేకనే టీనేజీ అమ్మాయిలు బడి మానేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికే టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇంతవరకూ 45,000 మరుగుదొడ్లని నిర్మించాం. అలాగే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎక్కువగా బలయ్యేదీ మహిళలే! దానిని దృష్టిలో పెట్టుకుని రుణంతోపాటు.. బీమా సదుపాయమూ కల్పిస్తున్నాం’ అంటున్నారు కాజల్‌.

లక్షమంది మహిళాశక్తితో...  

ఏవియోమ్‌ తమ ఉద్యోగుల విషయంలోనూ భిన్నంగా అడుగులు వేసింది. ఇంట్లో ఉండే గృహిణులు, అంగన్‌వాడీ వర్కర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చి ‘శక్తి’ పేరుతో వాళ్లని సిబ్బందిగా నియమించుకుంది. వీళ్లే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా సాధికారతపై అవగాహన తీసుకొస్తారు. ఇంటి రుణాలకు సంబంధించిన రిపోర్టులూ తయారుచేస్తారు. వాళ్ల పనితీరుని బట్టి రూ.నలభైవేల నుంచి యాభైవేల వరకూ ఆదాయం పొందుతారు. ‘పేద మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులు ఉండవు. కాబట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందడం అంత తేలికైన పనికాదు. అందుకే శక్తి పేరుతో స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చి వారి సాయంతో క్షేత్ర స్థాయికి చేరుకుని మహిళలకు రుణాలు అందేట్టు చేస్తున్నాం. ఇప్పటివరకూ 75వేలమందికి రుణాలిస్తే అందులో సగం మంది శక్తిమహిళల ద్వారా రుణాలు పొందిన వాళ్లే. ప్రస్తుతం లక్షమంది మహిళలు ‘శక్తి’ శిక్షణ పొందారు. ఏటా ఐదువేలమంది కొత్తగా ఈ శిక్షణ అందిపుచ్చుకుని ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారు’ అని అంటున్నారు సంస్థ జీఎమ్‌ ఫౌజియా. పన్నెండు రాష్ట్రాల్లో... 250 శాఖలతో విస్తరించిన ఏవియోమ్‌ ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, టాటా క్యాపిటల్‌, యూఎస్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలతో కలిసి రూ. 155 కోట్ల వ్యాపారం చేస్తోంది. ఇంతకూ ఏవియోమ్‌ అంటే అర్థం తెలుసా? పేదలకోసం అంకితమైన సంస్థ అని!


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్