ఆయనకు తెలిస్తే...

కాలేజీ రోజుల్లో స్నేహితురాలి అన్నయ్య, నేను స్నేహంగా ఉండేవాళ్లం. నా పెళ్లయిన పదేళ్ల తర్వాత మేం మళ్లీ కలిశాం. ఈమధ్య తరచూ ఫోనుల్లో మాట్లాడుకుంటున్నాం. మావారికి అనుమానం ఎక్కువని తెలిసినా.. అతనితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా..

Updated : 19 Jun 2023 14:31 IST

కాలేజీ రోజుల్లో స్నేహితురాలి అన్నయ్య, నేను స్నేహంగా ఉండేవాళ్లం. నా పెళ్లయిన పదేళ్ల తర్వాత మేం మళ్లీ కలిశాం. ఈమధ్య తరచూ ఫోనుల్లో మాట్లాడుకుంటున్నాం. మావారికి అనుమానం ఎక్కువని తెలిసినా.. అతనితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా..

- ఓ సోదరి

స్నేహం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందే అయినా.. అది మనకి, ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించకూడదు. అదే ఆదర్శమైన మంచి మైత్రి అనిపించుకుంటుంది. అలాంటివాటినే కొనసాగించాలి. మీరు చెప్పిన ప్రకారం పెళ్లికి ముందు మీ స్నేహితురాలి అన్నయ్యతో దగ్గరగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు పెళ్లయ్యింది. కుటుంబపరంగా, వ్యక్తిగతంగా బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధం, దృఢంగా ఉండాలి. మీ భర్తలో అనుమానం ఉందంటే- మీరు ఇతరులతో.. అందునా మునుపు ఆత్మీయంగా మెలిగిన వ్యక్తితో మాట్లాడటం వల్ల అతనిలో కోపం, అభద్రతాభావం పెరిగే అవకాశం ఉంది. ఇది సమస్యలను కొనితెచ్చుకోవడమే. ఈ అనుబంధం, మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయనంతవరకూ పరవాలేదు. అలాంటి అవకాశం ఉందనుకుంటే మాత్రం ప్రమాదమే. మీరు అతనివైపు ఆకర్షితులు అవుతుండొచ్చు. మీలో మరో ఉద్దేశం లేకున్నా మీ స్నేహాన్ని ఒక తీపిగుర్తులా మనసులో పదిలపరచుకుని, అతడితో కూడా చెప్పి ఇక దూరంగా ఉండటం మంచిది. లేకుంటే కలహాల కాపురంగా మారే పరిస్థితి రావచ్చు. లేదా మీ స్నేహితురాలి అన్నయ్యని ఇంట్లో పరిచయం చేయండి. మీ భర్తకు అతడి పట్ల నమ్మకం కలిగితే అవధులు దాటకుండా మైత్రి కొనసాగించవచ్చు. అనుమానం మెదిలిందంటే మట్టుకు మీరు చాలా కోల్పోవాల్సివస్తుంది. కుటుంబ బాధ్యత, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, అతడికి దూరంగా ఉండండి. మీకు భర్తే ముఖ్యం. మీరిద్దరే ఎప్పటికీ కలిసుంటారు. మీ మధ్య అపార్థాలు చోటుచేసుకోకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్