ఎమోషనల్‌గా తింటున్నారా... అయితే ఆపేయండి

సమయానికి తగినట్లుగా ఆకలి వేస్తే అప్పుడు తినే ఆహారం ఆరోగ్యాన్నిస్తుంది. అలాకాకుండా ఏమీ తోచనప్పుడు లేదా మానసిక భావోద్వేగాలతో కుంగుబాటుకు గురైనప్పుడు తీసుకునే ఆహారానికి అదుపు

Published : 20 Jun 2021 01:40 IST

సమయానికి తగినట్లుగా ఆకలి వేస్తే అప్పుడు తినే ఆహారం ఆరోగ్యాన్నిస్తుంది. అలాకాకుండా ఏమీ తోచనప్పుడు లేదా మానసిక భావోద్వేగాలతో కుంగుబాటుకు గురైనప్పుడు తీసుకునే ఆహారానికి అదుపు ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పద్ధతిని అరికట్టలేకపోతే అధికబరువుతోపాటు అనేక అనారోగ్యాలు దరిచేరతాయని పేర్కొంటున్నారు. ఇటువంటి ఎమోషనల్‌ ఈటింగ్‌ను ఎలా కట్టడి చేసుకోవాలో కూడా సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

కారణాన్ని గుర్తించాలి...
ఇంట్లో లేదా కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండి, ఆ ప్రభావమే ఈతరహా తిండికి దారి తీస్తుందా అనేది ముందుగా తెలుసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు, ప్రేమలో వైఫల్యం, స్నేహితులతో తగాదాలు ఇవన్నీ అధికంగా ఆహారం తీసుకునేలా చేస్తాయి. ఇటువంటి కారణాలతో పలు రకాల అనారోగ్యాలు, ఒత్తిడి ఏర్పడి  ఎక్కువగా తిండివైపు దృష్టి మళ్లుతుంది.

ఆహారం వైపు..
ప్రతికూల ఆలోచనలు, ఆందోళన వంటివి మనసును శూన్యంగా మార్చేస్తాయి. ఈ కారణంగా ఆ సమయంలో ఏదైనా ఆహారం తీసుకోవాలనిపిస్తుంది. అలా తిన్న తర్వాత తాత్కాలికంగా కడుపునిండిన భావం కలుగుతుంది. దాంతో ఆ భావోద్వేగాల నుంచి దూరం అవుతున్నామనే భావన మనసులో అనిపిస్తుంది. అయితే అటువంటి సమయంలో ఆహారం తీసుకోవడం సరైన పద్ధతి కాదు. మనసు కుదుటపడిందని అనుకోవడం కూడా అపోహే.

ఆకలి లేకపోయినా
బాధపెట్టే వార్తలను విన్నప్పుడు, చూసినప్పుడు తెలియని ఆందోళన మొదలవుతుంది. ఆ సమయంలో ఆకలి వేయకపోయినా ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది. అటువంటప్పుడు తినే ఫ్రెంచ్‌ఫ్రైస్‌, చిప్స్‌, బేకరీ ఐటమ్స్‌ వంటివి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఒత్తిడితో పాటు అధికబరువు, అనారోగ్యాలు చుట్టుముడతాయి.

అదుపు కోసం...
భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి యోగా, ధ్యానం, వ్యాయామాలు వంటివి అలవరుచుకోవాలి. వేదనకు కారణం తెలుసుకుని దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. జంక్‌ఫుడ్‌, వేపుళ్లకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. అలాగే రోజూ క్రమం తప్పకుండా కాసేపు నడవడం, తోటపని, పుస్తకపఠనం, స్నేహితులతో మాట్లాడటం, సంగీతం వినడం వంటివి అలవరుచుకుంటే ఒత్తిడిని జయించొచ్చు. అలా ఎమోషనల్‌ ఈటింగ్‌కు దూరం కావొచ్చు. నిండైన ఆరోగ్యాన్ని పొందొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్