Holi: మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందించే ‘హోలీ’!

పండగంటేనే సరదా, సంబరం. ఇక హోలీకి ఇవి మరింత రెట్టింపవుతాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్‌ చేసే ఈ పండగలో చిన్నా పెద్దా ఉత్సాహంగా గడుపుతారు. అయితే ఈ హోలీ కేళిలో భాగంగా మనం వాడే ముదురు రంగులు, ఆడే సరదా ఆటలు మన మనసులోని ఒత్తిళ్లు, ఆందోళనల్ని దూరం చేసి మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయంటున్నారు నిపుణులు.

Published : 25 Mar 2024 12:48 IST

పండగంటేనే సరదా, సంబరం. ఇక హోలీకి ఇవి మరింత రెట్టింపవుతాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్‌ చేసే ఈ పండగలో చిన్నా పెద్దా ఉత్సాహంగా గడుపుతారు. అయితే ఈ హోలీ కేళిలో భాగంగా మనం వాడే ముదురు రంగులు, ఆడే సరదా ఆటలు మన మనసులోని ఒత్తిళ్లు, ఆందోళనల్ని దూరం చేసి మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయంటున్నారు నిపుణులు. తద్వారా మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

‘కలర్‌ థెరపీ’తో మేలు!

హోలీలో రంగులే ప్రధానం. అయితే ఈ రంగుల ప్రభావం మనసు పైనా ఉంటుందంటున్నారు నిపుణులు. సాధారణంగా కొన్ని రంగుల్ని చూడగానే మనలో ఒక ప్రశాంతమైన భావన కలుగుతుంది. అదే విధంగా హోలీలో ఉపయోగించే ముదురు రంగులు కూడా మనసుపై సానుకూల ప్రభావం చూపుతాయట! ముఖ్యంగా ఎరుపు, పసుపు.. వంటి రంగులు మనలో సానుకూల ఆలోచనల్ని రేకెత్తిస్తాయని; నీలం, గులాబీ.. వంటి రంగులు మనసులోని ఒత్తిళ్లను దూరం చేసి ప్రశాంతతను అందిస్తాయని పలు అధ్యయనాలు కూడా రుజువు చేశాయి. కాబట్టి హోలీ క్రీడలో భాగంగా మనం ఉపయోగించే విభిన్న రకాల రంగులు మన భావోద్వేగాల్ని నియంత్రించి మనసుకు సంతోషాన్ని అందించడంతో పాటు శరీరంలో కొత్త శక్తి జనించేలా చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

సరదాగా.. కలివిడిగా..!

సాధారణంగా పండగంటేనే అందరూ కలిసి జరుపుకొనేది. ఇక హోలీలో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. ఈ ఆటలో కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వాళ్లు, ఆ వీధికి చెందిన వారు, బంధువులు, స్నేహితులు.. ఇలా పెద్ద ఎత్తున ఒక చోట పోగవుతారు. హోలీకి ముందస్తు పరిచయాలతో పనిలేదు. ఒకరి వెంట మరొకరు పరిగెడుతూ, రంగులు చల్లుతూనే స్నేహితులైపోతారు.. పరిచయాలు పెంచుకుంటారు. ఇలా ఈ పండగ కలుపుగోలుతనాన్ని పెంచుతుంది. ఒంటరితనాన్ని దూరం చేసి స్నేహాలను విస్తరిస్తుంది. ముఖ్యంగా పిల్లల సామాజిక అనుబంధాలను రెట్టింపు చేసేందుకు ఈ పండగను ప్రధాన వారధిగా చెప్పుకోవచ్చు. ఇక ఆటిజం.. వంటి ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల్లో సామాజిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ పండగ ఓ ప్రధాన వేదికవుతుందని చెప్పడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు. ఇలా అంతిమంగా ఈ సరదా, సంబరం.. ప్రతి ఒక్కరికీ మానసికోల్లాసాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు.

ఆ ‘హార్మోన్ల’తో చురుగ్గా!

మనసుకు నచ్చిన పనులు చేసినా, చేసే పనుల్లో సత్ఫలితాలొచ్చినా ఆ రోజంతా హ్యాపీగా గడిపేస్తాం. ఇందుకు శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవడమే కారణం. హోలీతోనూ ఈ సంతోషాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందరితో కలిసి రంగుల కేళీలో భాగమవడం, ముదురు రంగుల ప్రభావం, ఊపొచ్చే డీజే సంగీతానికి అనువుగా స్టెప్పులేయడం.. ఇలా ఇవన్నీ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపేవే! ఈ క్రమంలో మన శరీరంలో సెరటోనిన్‌, డోపమైన్‌, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్‌.. అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. తద్వారా మనసులోని ప్రతికూల ఆలోచనలు, యాంగ్జైటీ.. వంటివి దూరమవుతాయి. ఇలా మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడం వల్ల సృజనాత్మక ఆలోచనలు రెట్టింపవుతాయి.. ఏకాగ్రత పెరుగుతుంది. ఎంత కష్టమైన పనైనా సునాయాసంగా పూర్తి చేయగలుగుతాం.

‘హోలీ’ వంటకాలతో ఆరోగ్యం-ఆహ్లాదం!

ప్రతి పండక్కి కొన్ని ప్రత్యేకమైన వంటకాలు చేసుకోవడం మన సంప్రదాయంలో భాగం. అయితే ఈ సంప్రదాయ వంటకాల్లో ఎన్నో పోషక విలువలు కూడా దాగుంటాయి. అవి శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. హోలీ వంటకాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ముఖ్యంగా ఈ పండగలో భాగంగా.. కజ్జికాయలు, క్వినోవా పఫ్స్‌, మాల్‌పువా, రస్‌మలై, నట్స్‌-గింజలతో తయారుచేసే స్నాక్స్‌తో పాటు ఠండాయి.. వంటి పానీయాలు తయారుచేస్తారు. ఇవి రుచికరంగా ఉండడంతో పాటు ఇందులోని పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా మనకు నచ్చిన పదార్థాల్ని తినడం, అతిథులకు వడ్డించడం వల్ల మానసిక సంతృప్తి పొందుతాం. తద్వారా అటు శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతత కూడా దక్కుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్