చదువే మానేద్దామనుకుంది.. లాయరైంది!

ఉన్నత లక్ష్యాలను చేరుకునే క్రమంలో అన్నీ అనుకూలంగా ఉన్న వారికే ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతుంటాయి. అలాంటిది శారీరక లోపాలుండే వారికైతే అడుగడుగునా ప్రతికూలతలే పలకరిస్తుంటాయి. దీనికి తోడు సమాజం దెప్పి పొడుపులు వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి.

Updated : 26 Nov 2021 21:11 IST

(Photo: Instagram)

ఉన్నత లక్ష్యాలను చేరుకునే క్రమంలో అన్నీ అనుకూలంగా ఉన్న వారికే ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతుంటాయి. అలాంటిది శారీరక లోపాలుండే వారికైతే అడుగడుగునా ప్రతికూలతలే పలకరిస్తుంటాయి. దీనికి తోడు సమాజం దెప్పి పొడుపులు వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. పంజాబ్‌కు చెందిన హర్వీందర్‌ కౌర్‌ కూడా ఇలాంటి అవమానాల్నే ఎదుర్కొంది. నాలుగడుగుల ఎత్తు మాత్రమే ఉందన్న నెపంతో సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాల్ని భరించింది. దీంతో ఒకదశలో చదువే మానేద్దామనుకున్న ఆమె.. ఇప్పుడు లాయరైంది. మరోవైపు తన స్ఫూర్తిదాయక మాటలతో ఇన్‌స్టాగ్రామ్‌లోనూ లక్షలాది మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం దేశంలోనే తక్కువ ఎత్తున్న లాయర్‌గా ఘనత సాధించిన ఆమె గురించి ఈ ‘నేషనల్‌ లా డే’ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం..

ఎయిర్‌ హోస్టెస్‌ కావాలనుకొని..

హర్వీందర్‌ కౌర్‌ పంజాబ్‌ గర్షంకర్‌లోని రాంపూర్‌ గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి షంషీర్‌ సింగ్‌.. ట్రాఫిక్ ఏఎస్‌ఐగా పని చేస్తున్నారు. తల్లి సుఖ్‌దీప్‌ కౌర్‌ గృహిణి. హర్వీందర్‌కు ఒక సోదరుడున్నాడు. అయితే చిన్నతనం నుంచి చదువుతో పాటు ఇతర విషయాల్లోనూ చురుగ్గా ఉండే ఆమె.. వయసుకు తగ్గ ఎత్తు పెరగలేదు. ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు.. అసలు కారణమేంటో తెలుసుకోవడానికి ఎంతోమంది డాక్టర్లకు చూపించారు. అయితే ఇకపై ఆమె ఎత్తు పెరగదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో నిరాశ చెందారు. దీంతో భవిష్యత్తులో ఎయిర్‌ హోస్టెస్‌ కావాలన్న హర్వీందర్‌ ఆశలు ఆవిరయ్యాయి. దీనికి తోడు.. పాఠశాలలోనూ తన ఎత్తు గురించి తోటి స్నేహితులు మాట్లాడుకునే మాటలు, వేసే జోకులు ఆమె మనసును ఎంతో గాయపర్చేవి. అయినా అవేవీ పట్టించుకోకుండా తన చదువుపై దృష్టి పెట్టేది హర్వీందర్‌.

కాలేజీకి వెళ్లడానికి భయపడ్డా!

‘పాఠశాలలో ఉన్నప్పుడు నా ఎత్తు (3’11’’) గురించి కొంతమంది విద్యార్థులు కామెంట్‌ చేసేవారు. అందని వస్తువు తీసుకురమ్మనే వారు. తోటి విద్యార్థులతో కాకుండా నాకోసం ప్రత్యేకంగా ముందు వరుసలో ఓ కుర్చీ-టేబుల్‌ ఏర్పాటు చేశారు. ఇది చూసి కూడా కొంతమంది హేళన చేసేవారు. ఒక్కోసారి ఇవన్నీ భరించలేక తరగతి గదిలోనే ఏడ్చేదాన్ని. కాలేజీలో కూడా మళ్లీ ఇలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న భయం నా మనసులో బలంగా గూడుకట్టుకుపోయింది. అందుకే పది పూర్తి కాగానే చదువు ఆపేద్దామనుకున్నా.. కానీ ఇలా నేను అర్ధాంతరంగా చదువు మానేయడం అమ్మానాన్నలకు ఇష్టం లేదు. నన్ను ఏడిపించిన వారికి సరైన సమాధానం చెప్పాలంటే అది ఉన్నత విద్య వల్లే సాధ్యమవుతుందని వాళ్లు నాతో పదే పదే చెప్పేవారు. అందుకే ఎన్ని అవాంతరాలు ఎదురైనా చదువు కొనసాగించాలన్న బలమైన నిర్ణయం తీసుకున్నా. ఈ క్రమంలోనే జలంధర్‌లోని ఓ కాలేజీలో బీఏ కోర్సు, ఆపై ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశా..’ అంటోంది హర్వీందర్‌.

అదే నా లక్ష్యం!

గతేడాది నవంబర్‌ 23న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ నుంచి ‘లైసెన్స్‌, ఎన్‌రోల్‌మెంట్‌ క్లైంట్‌ సర్టిఫికెట్‌’ను అందుకున్న ఆమె.. దేశంలోనే అతి తక్కువ ఎత్తున్న లాయర్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం లాయర్‌గా తన ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోన్న హర్వీందర్‌.. ఇప్పటికీ కొంతమంది చూపులు తనను ఇబ్బంది పెట్టినా వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడానికే ఇష్టపడతానంటోంది. మరి, లాయర్‌గా మీ ముందున్న లక్ష్యమేంటని అడిగితే.. ‘మన సమాజంలో మహిళలు, పిల్లలకు రక్షణ తక్కువగా ఉంది. ఈ క్రమంలో వారికి న్యాయపరంగా ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.. అలాగే భవిష్యత్తులో జడ్జిగా ఎదగాలనుకుంటున్నా..’ అంటోందీ ప్లీడర్‌.

ఇలా ఓవైపు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూనే.. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ స్ఫూర్తిదాయక పోస్టులు, కొటేషన్లు పోస్ట్‌ చేస్తుంటుంది హర్వీందర్‌. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా ఖాతాను 2.75 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది.. నిజానికి అవి మనం కోరి తెచ్చుకున్నవి కావు. అలాంటప్పుడు ఎవరో ఏదో అన్నారని వాటి గురించి బాధపడడం మాని.. భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి సారిస్తే.. ఈ సమాజానికి మనమేంటో నిరూపించుకోవచ్చు.. హర్వీందర్‌ స్ఫూర్తిదాయక కథ కూడా ఇందుకు మినహాయింపు కాదు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్