రైలు ప్రమాదం.. అయినా ఆగని ఆమె కలల ప్రయాణం!

ప్రమాదవశాత్తూ రైలులోంచి కింద పడిపోయిన ఆమె పైనుంచి చూస్తుండగానే మూడు బోగీలు వెళ్లిపోయాయి. బైపాస్‌ సర్జరీతో పాటు 14 ఆపరేషన్లు చేశాక కానీ ప్రాణాలతో బయటపడలేదు. దాదాపు ఏడాది పాటు మంచానికే పరిమితమైంది. ఇలా తన దీన పరిస్థితిని చూసి భర్త, అత్తమామాలు నిర్దాక్షిణ్యంగా ఆమెను వదిలి వెళ్లిపోయారు.

Published : 27 Sep 2021 20:12 IST

(Image for Representation)

ప్రమాదవశాత్తూ రైలులోంచి కింద పడిపోయిన ఆమె పైనుంచి చూస్తుండగానే మూడు బోగీలు వెళ్లిపోయాయి. బైపాస్‌ సర్జరీతో పాటు 14 ఆపరేషన్లు చేశాక కానీ ప్రాణాలతో బయటపడలేదు. దాదాపు ఏడాది పాటు మంచానికే పరిమితమైంది. ఇలా తన దీన పరిస్థితిని చూసి భర్త, అత్తమామాలు నిర్దాక్షిణ్యంగా ఆమెను వదిలి వెళ్లిపోయారు. అయినా ఆ బాధను పంటిబిగువన భరిస్తూ గుండె రాయి చేసుకుంది. దెబ్బ తగిలింది తన శరీరానికే కానీ తన సంకల్పానికి కాదని నిరూపించాలనుకుంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో సివిల్స్‌కు సన్నద్ధమైంది. రెండుసార్లు విఫలమైనా ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకుంది.

ఐఏఎస్‌ కలను సాకారం చేసుకుంది!

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ లాంటి దేశ అత్యున్నత ఉద్యోగాల కోసం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ -2020 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అబ్బాయిలతో పోటీగా ఎందరో అమ్మాయిలు ఆలిండియా ర్యాంకులు సాధించి స్ఫూర్తిగా నిలిచారు. అందులో హరియాణాలోని కర్నాల్‌ జిల్లా దుపెడా గ్రామానికి చెందిన ప్రీతి బెనివాల్‌ కూడా ఒకరు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలని కలలు కన్న ఆమె.. సివిల్స్‌-2020 ఫలితాల్లో 754వ ర్యాంకును సొంతం చేసుకుంది.

ప్రీతి తండ్రి సురేష్‌కుమార్‌ ఓ ప్రభుత్వ ఇంజినీరు. తల్లి బబిత అంగన్‌వాడీ టీచర్‌. ఆమెకు పంకజ్‌ బెనివాల్‌ అనే సోదరుడు ఉన్నాడు. ఐఏఎస్‌ లక్ష్యంతోనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ప్రీతి.. 2011లో ఎలక్ర్టానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. 2013లో ఎంటెక్‌ పూర్తి చేసి వెంటనే గ్రామీణ బ్యాంకులో క్లర్క్‌గా చేరింది. 2013 నుంచి మూడేళ్ల పాటు బహదూర్‌గఢ్‌లో విధులు నిర్వర్తించాక ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(FCI)లో అసిస్టెంట్‌ జనరల్‌ గ్రేడ్‌-2 ఉద్యోగం సంపాదించింది. 2016లో మట్లౌడా బ్లాక్‌కు చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె ఎన్నో కలలతో అత్తారింట్లోకి అడుగుపెట్టింది.

రైలులో నుంచి కింద పడి!

ఇలా అంచెలంచెలుగా ఎదుగుతోన్న ప్రీతిని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో! ఓ భయంకరమైన ప్రమాదం రూపంలో ఆమెను ఆస్పత్రి పాల్జేసింది. 2016లో ఎఫ్‌సీఐ డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష కోసం రైలులో ఘజియాబాద్‌కు బయలుదేరిన ప్రీతి ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోయింది. చూస్తుండగానే మూడు రైల్వే బోగీలు ఆమె శరీరం పైనుంచి వెళ్లిపోయాయి. తీవ్రంగా గాయపడిన ప్రీతిని బతికించడానికి డాక్టర్లు బైపాస్‌ సర్జరీతో పాటు 14 ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. ఎన్ని శస్త్రచికిత్సలు చేసినా ఏడాది పాటు బెడ్‌పైనే ఉండాలని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ సమయంలో తన దగ్గరుండి మనోధైర్యం నింపాల్సిన భర్త నిర్దాక్షిణ్యంగా ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఇక ఇలాంటి కోడలు తమకు వద్దంటూ అత్తమామలు కూడా అదే దారిలో నడిచారు.

16 గంటలు చదివాను!

రైలు ప్రమాదం శారీరకంగా ఆమెను ఇబ్బంది పెడితే... భర్త, అత్తమామల తీరు తనను మరింత మానసిక క్షోభకు గురిచేసింది. దీంతో మళ్లీ అమ్మానాన్నలే తనను అక్కున చేర్చుకున్నారు. ఇదే క్రమంలో తన లక్ష్యం వైపు మళ్లీ మెల్లగా అడుగులేయడం ప్రారంభించింది ప్రీతి. ఉద్యోగం చేస్తున్నప్పుడు పుస్తకాలు పట్టుకునేందుకు సరైన సమయం దొరక్కపోవడంతో బెడ్‌ రెస్ట్‌ సమయాన్ని సివిల్స్‌ సన్నద్ధతకు ఉపయోగించుకుందామె. మొదటిసారి సివిల్స్‌ పరీక్ష రాసినప్పుడు ప్రిలిమ్స్‌ను దాటలేకపోయాను. రెండో ప్రయత్నంలో ప్రిలిమ్స్ పాసైనా మెయిన్స్‌లో ఫెయిల్‌ అయ్యాను. అయితే నేను నిరాశపడలేదు. ఎక్కడ తప్పులు చేస్తున్నానో తెలుసుకున్నాను. నా ప్రిపరేషన్‌ సమయాన్ని మరింత పొడిగించాను. రోజుకు కనీసం 14-16 గంటల పాటు చదివాను. నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. మూడో ప్రయత్నంలో నా లక్ష్యం నెరవేరింది.’

‘రైలు ప్రమాదం జరిగినప్పుడు నాన్న నాతో పాటే ఉన్నారు. నన్ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇక ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు నాన్నతో పాటు అమ్మ నన్ను దగ్గరుండి చూసుకుంది. నా సోదరుడు పంకజ్‌ ప్రతి విషయంలోనూ నాకు  సహకరించాడు. వీరి సహకారంతోనే ఐఏఎస్‌ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాను.’ అని అంటోంది ప్రీతి.

ఎన్ని కష్టాలెదురైనా పట్టుదలతో ముందుకు సాగింది ప్రీతి. తన చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఆమెను అభినందిస్తున్నారు. ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రశంసిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్