Alaknanda Dasgupta: నృత్యమే ప్రాణం పోస్తుంది...

చుట్టూ వేలమంది చప్పట్లు... ఆమె ఏం చేయబోతోందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు... నృత్యం చేస్తూ తలపై ఉన్న విగ్గును తీసేశారు అలకనందా దాస్‌... ఆమెవరు? ఎందుకు అలా చేశారు?

Published : 06 Apr 2023 00:19 IST

చుట్టూ వేలమంది చప్పట్లు... ఆమె ఏం చేయబోతోందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు... నృత్యం చేస్తూ తలపై ఉన్న విగ్గును తీసేశారు అలకనందా దాస్‌... ఆమెవరు? ఎందుకు అలా చేశారు? అసలేం చెప్పాలనుకుంటున్నారు? తెలియాలంటే చదివేయండి...

‘జీవితాన్ని ప్రతిక్షణం ఆస్వాదించాలి. ఏదనుకుంటే అది చేసేయాలి. ఎవరికి తెలుసు! రేపంటూ ఒకరోజు ఉందో లేదో...’ అంటున్నారు అలకనందా దాస్‌ గుప్తా. ఆమె కథక్‌ కళాకారిణి. దిల్లీలో నివాసం. నాలుగేళ్ల వయసు నుంచి డాన్స్‌ అంటే ఇష్టం. తండ్రి సంగీత దర్శకుడు కావడంతో ఆయన చేసిన ట్యూన్స్‌కు పాదం కదిపేవారు. కానీ అలకనందా అమ్మనాన్నలకు అది ఇష్టం లేదు. వాళ్లు తనని ఉన్నత ఉద్యోగంలో చూడాలనుకున్నారు. 6 ఏళ్ల వయసులోనే బిర్జూ మహరాజ్‌ డాన్స్‌ అకాడమీలో శాస్త్రీయ నృత్యంలో చేరారు. చిన్నతనం మొత్తం అక్కడే గడిచిపోయింది. అయినా ఆమె అనుకున్నది సాధించినందుకు సంతోషపడ్డారు. తరువాత పెళ్లి. తన అభిరుచిని ప్రోత్సహించే భర్త. ఒక కొడుకు. ప్రాణం కంటే ముఖ్యంగా భావించే నృత్యం. ఆమె హావభావాలను మెచ్చని వారు లేరు. ఇలా సంతోషంగా సాగిపోతున్న జీవితంలోకి క్యాన్సర్‌ అడుగుపెట్టింది. ‘ఈ విషయం తెలిసి నేను భయపడలేదు, బాధపడ్డాను. ఇక ప్రదర్శన ఇవ్వలేనేమో అని’ అంటారు అలకనంద.

డాక్టర్‌కి కోపం వచ్చింది...

‘జీవితంలో కొన్ని గడిచిపోయాక బాధపడతాం. నేను కూడా ఆ కోవకు చెందిన దాన్నే. మొదటిసారి నాకు అండాశయంలో కణతి ఉందని చెప్పినప్పుడు పట్టించుకోలేదు. సర్జరీ చేయాలన్నప్పుడు కాస్త సమయం అడిగా. ముఖ్యమైన ప్రదర్శన ఉందని ఆపరేషన్‌ను వాయిదా వేశా. అదే సమయానికి జరిగి ఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదు. సర్జరీ చేశాక కణతిని వైద్యపరిక్షలకోసం పంపించారు. అప్పుడే తెలిసింది. అది సాధారణమైనది కాదు... క్యాన్సరని. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం ఉందన్నారు. వెంటనే వైద్యం చేయించు కోవాలన్నారు. అప్పుడు కూడా 15 రోజుల సమయం కావాలని అడిగాను. డాక్టర్‌కి కోపం వచ్చింది. ‘నువ్వున్న పరిస్థితి ఏంటో నీకు తెలుసా’ అని అడిగారు. బతిమాలిన తరువాత ఒప్పుకొన్నారు. మొదటి కీమో తరువాత జుట్టు రాలడం మొదలైంది. ఒక కళాకారిణికి జుట్టు ఎంత ముఖ్యమో చెప్పనక్కర్లేదు. అందుకే పూర్తిగా షేవ్‌ చేయించుకున్నా. రాలుతున్న జుట్టును చూసి అధైర్య పడటం కాదు.. నాలాంటివారికి మార్గదర్శకురాలిని అవ్వాలనుకున్నా. అందుకే కీమో తరువాత ఇచ్చిన ప్రదర్శనలో వేదికపైనే విగ్గు తీసేశా’ అంటారామె.

సందేశాత్మకంగా...

అలకనందా దాస్‌ ఇచ్చే ప్రదర్శనల్లో చాలా రకాల సందేశాలుంటాయి. పురాణాల నుంచి కథలను తీసుకుని సమకాలీనా సమస్యలకు జోడిస్తూ నృత్య రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. ఇటీవలే తన నృత్యంతో వీక్షకులకు ఓటు ప్రాధాన్యతను వివరించారు. విదేశాల్లో మనదేశ గొప్పతనాన్ని వివరిస్తూ అనేక స్టేజీ షోలు చేశారు. జీవితం ఒక యుద్ధమని, ప్రతి ఒక్కరు సైనికుల్లా పోరాడాలనే స్ఫూర్తిని ప్రచారం చేస్తున్నారామె.


కీమోల మధ్య ప్రదర్శనలు

‘32 సంవత్సరాలుగా వేల ప్రదర్శనలు ఇచ్చాను. అలకనందా డాన్స్‌ అకాడమీ పేరుతో దిల్లీలో ఒక సంస్థను నడుపుతున్నా. స్వచ్ఛభారత్‌ అభియాన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ని. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నాకు ఇంత గుర్తింపు తెచ్చిపెట్టింది డాన్స్‌. అందుకే తుది శ్వాస వరకు కొనసాగించా లనుకుంటున్నా. ఎలాంటి కష్టమొచ్చినా సత్తువ ఉన్నంత వరకు నృత్యం చేస్తా. కీమోలు జరుగుతున్న సమయంలోనూ 12 ప్రదర్శనలు ఇచ్చాను’.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని