మూడడుగుల ఈ అమ్మాయి.. కొడుకు కంటే ఎక్కువ!

శారీరక, మానసిక లోపాలున్న వారిని.. తమ లోపాల కంటే సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలే ఎక్కువ బాధపెడుతుంటాయి. నాసిక్‌కు చెందిన పూజా ఘోడ్కే కూడా మరుగుజ్జుతనం కారణంగా తన చుట్టూ ఉన్న వారి నుంచి ఇలాంటి ఎన్నో విమర్శలు భరించింది. అలాగని వాటినే తలచుకొని....

Published : 30 Apr 2023 13:55 IST

శారీరక, మానసిక లోపాలున్న వారిని.. తమ లోపాల కంటే సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలే ఎక్కువ బాధపెడుతుంటాయి. నాసిక్‌కు చెందిన పూజా ఘోడ్కే కూడా మరుగుజ్జుతనం కారణంగా తన చుట్టూ ఉన్న వారి నుంచి ఇలాంటి ఎన్నో విమర్శలు భరించింది. అలాగని వాటినే తలచుకొని అక్కడే ఆగిపోవాలనుకోలేదామె. తనలోని ప్రత్యేకతను చాటుకోవాలనుకుంది. ఈ ఆత్మవిశ్వాసమే ఆమెను వ్యాపారవేత్తగా మలిచింది. ‘గుడిలో విగ్రహం చిన్నదే కావచ్చు.. కానీ ఎంతో మహిమ గలది.. అదేవిధంగా ఎత్తు తక్కువైతేనేం.. తెలివితేటలతో రాణించచ్చు..’ అని నిరూపిస్తోన్న పూజ.. కూతురైనా కొడుకుగా తన కుటుంబ బాధ్యతల్ని మోస్తోంది. మరోవైపు తోటి మహిళలకూ ఉపాధి కల్పిస్తోంది. మూడడుగుల ఎత్తుతో ఎన్నో విమర్శల పాలై.. ఇప్పుడు వ్యాపారవేత్తగా రాణిస్తోన్న పూజ స్ఫూర్తి గాథ మీకోసం..!

నాసిక్‌లోని సిడ్కో ప్రాంతంలో నివసిస్తోంది పూజా ఘోడ్కే. మూడడుగులే పెరిగి ఆగిపోయిన ఆమె.. తన మరుగుజ్జుతనం కారణంగా చిన్నతనం నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. స్కూల్లో తోటి పిల్లలతోనూ అవహేళనలు తప్పలేదామెకు. అయితే ఇలాంటి మాటలతో ఒత్తిడికి గురైన ఆమెకు తన తల్లిదండ్రులే అండగా నిలిచారు. చదువు, బుద్ధి బలంతోనే ఇలాంటి విమర్శలకు చెక్‌ పెట్టచ్చని, తనలోని ప్రత్యేకతల్ని నిరూపించుకునే అవకాశమివ్వచ్చని నమ్మిన ఆమె తల్లిదండ్రులు.. పూజకు ఉన్నత విద్యనందించాలని నిర్ణయించుకున్నారు.

అమ్మానాన్నల అండతో..!

‘చిన్నతనం నుంచి నేను నా వయసుకు తగ్గ ఎత్తు పెరగలేకపోయా. మూడడుగులు మాత్రమే పెరిగి ఆగిపోయా. దీంతో మా అమ్మానాన్నలు తొలుత కంగారు పడ్డారు. ఇక ఎత్తు తక్కువగా ఉన్న కారణంగా.. నా కెరీర్‌, పెళ్లి విషయాల్లో చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. అయినా నా తెలివితేటలు గుర్తించిన మా అమ్మానాన్నలు నన్ను ఉన్నత చదువులు చదివించాలనుకున్నారు. దాంతో అమ్మ నన్ను బాలికల కళాశాలలో చేర్పించింది. అక్కడా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నా. ఎం.కామ్‌ పూర్తిచేశాక బ్యాంక్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమయ్యా. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఈ సమయంలోనే మా నాన్న చేస్తోన్న అప్పడాల వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్న ఆలోచన వచ్చింది. ఇదే విషయం అమ్మానాన్నలతో పంచుకోగా వాళ్లూ అందుకు వెన్నుతట్టారు. అయితే వ్యాపారమంటే డబ్బు కావాలి. కాబట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా. అప్పడాలు తయారుచేసే మెషీన్స్‌ విక్రయించా. తద్వారా క్రమంగా ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించా. ప్రస్తుతం బిజినెస్‌ లాభదాయకంగా సాగుతోంది. ఓవైపు నా కుటుంబాన్ని పోషిస్తూనే.. మరోవైపు పలువురు స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తున్నానన్న సంతృప్తి ఎనలేని సంతోషాన్నిస్తోంది..’ అంటూ చెప్పుకొచ్చింది పూజ.

ప్రత్యేకతల్ని గుర్తించాలి!

ఈ సృష్టిలో ఏ ఒక్కరూ వంద శాతం పర్‌ఫెక్ట్‌ కాదు.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉన్నట్లే.. ఓ ప్రత్యేకత కూడా దాగుంటుంది.. దాన్ని గుర్తించాలంటోంది పూజ.
‘ఎత్తు తక్కువ కారణంగా చాలామంది అనే మాటలు నన్ను నిరుత్సాహపరిచేవి. అదే సమయంలో నాలాంటి లోపాలున్న వ్యక్తుల్ని చూసినప్పుడు ఆత్మవిశ్వాసం రెట్టించేది. నిజానికి లోపమనేది మన శరీరంలో కాదు.. అవతలి వారి ఆలోచనల్లో ఉంటుంది. కాబట్టి శారీరకంగా, మానసికంగా ఎలాంటి లోపాలున్న వారైనా ఈ విషయం గుర్తెరిగి.. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటే మనల్ని మనం నిరూపించుకోవచ్చు. అలాగే కొంతమంది ఇతరుల మాటలు పట్టించుకొని.. తమను తాము తక్కువ చేసి చూసుకుంటారు.. ఆత్మహత్యల దాకా వెళ్లే వారూ లేకపోలేదు. ఎవరో ఏదో అన్నారని జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తే నష్టపోయేది మీరు, మీ కుటుంబ సభ్యులే! కాబట్టి అవతలి వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. తమ ప్రత్యేకతలు, అభిరుచులపై దృష్టి పెట్టాలి.. తమ కాళ్లపై తాము నిలబడేదాకా తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులే వారికి అండగా నిలవాలి..’ అంటోంది 28 ఏళ్ల పూజ.

మొండితనంతో గెలిచింది!

పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులకు అంతకంటే సంతోషం ఇంకేముంటుంది? పూజ తల్లి నీతా కూడా ప్రస్తుతం అంతటి ఆనందాన్నే వ్యక్తం చేస్తున్నారు.
‘చిన్న వయసులోనే పూజ ఎత్తు గురించి డాక్టర్లు తేల్చి చెప్పేశారు. దాంతో మొదట్లో కాస్త బాధపడ్డాం. తక్కువ ఎత్తు కారణంగా స్కూల్‌ బస్సు కూడా ఎక్కలేకపోయేది.. పది పూర్తయ్యాక మూడేళ్ల పాటు కాలేజీకి దగ్గర్లో ఉన్న మా బంధువులింట్లో ఉంచి తనను చదివించాం. ఎం.కామ్‌ పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అప్పటికే మేం చేస్తోన్న అప్పడాల వ్యాపారంలోకి అడుగుపెట్టాలని, దాన్ని పెద్ద ఎత్తున విస్తరించాలని నిర్ణయించుకుంది. మొండి పట్టుదలతో దాన్ని తాను అనుకున్నట్లుగా లాభాల బాట పట్టిస్తోంది. కూతురే అయినా మా కుటుంబ బాధ్యతల్ని కొడుకులా భుజాన వేసుకుంది..’ అంటూ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతోందా తల్లి హృదయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని