Sarikonda saritha: ఆ అమ్మల బెంగ తీరుస్తున్నా!

వయసు పెరుగుతుంది.. మనసు మాత్రం పసితనంలోనే ఆగిపోతుంది. ఏం చేస్తున్నారో వాళ్లకీ.. వాళ్లతో ఎలా ప్రవర్తించాలో కన్నవాళ్లకీ తెలియదు.

Published : 19 May 2023 00:39 IST

వయసు పెరుగుతుంది.. మనసు మాత్రం పసితనంలోనే ఆగిపోతుంది. ఏం చేస్తున్నారో వాళ్లకీ.. వాళ్లతో ఎలా ప్రవర్తించాలో కన్నవాళ్లకీ తెలియదు. అతిథులు ఇంటికి రావడానికి ఆలోచిస్తారు. అద్దెకు ఇల్లు ఇవ్వడానికి యజమానులు సంకోచిస్తారు. అమ్మగా మానసిక సమస్యలున్న పిల్లాడితో పడే ఇలాంటి ఇబ్బందులు సరికొండ సరితకీ అనుభవమే. అందుకే ఓ స్కూలు ప్రారంభించి అలాంటి పిల్లలకో దారి చూపిస్తున్నారు. ఆ ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారు..

ఎంఏ బీఈడీ చదివా. పెళ్లయిన కొత్తలో మావారు రాజు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు చదవమన్నారు. ఆయన చిన్నతనంలో మానసిక దివ్యాంగురాలైన ఓ పాపని చూసి చలించిపోయారు. వారికి సాయపడాలని హియరింగ్‌ ఇంపెయిరింగ్‌, మెంటల్‌ రిటార్డేషన్‌ కోర్సులు చేశారు. అది విన్నాక నేనూ చేయాలనుకున్నా. గర్భవతిని అవ్వడంతో ఆగి పోయా. కానీ అదే సమస్య మా జీవితంలో ఎదురవుతుందని ఊహించలేదు. మాది మిర్యాలగూడ. బాబు ఏడాదివరకూ బాగానే ఉన్నాడు. అమ్మావాళ్ల దగ్గర కొన్నిరోజులుంచాం. మాటలు రాలేదు.. పైగా హైపరాక్టివ్‌. వాడిలో ఏదో సమస్య ఉందని అర్థమైంది. వైద్యులేమో.. ‘కొత్త వాతావరణంలో ఇమడలేక అలా చేస్తున్నా’డన్నారు. పరీక్షల తర్వాత ఆటిజమనే తేలింది. హైదరాబాద్‌లో చికిత్సకి చాలా ఖర్చైంది, ఎన్నో ఇబ్బందులూ పడ్డాం. అప్పుడే ఇలాంటి పిల్లలకోసం ఏదైనా చేయాలనుకున్నాం. సంగారెడ్డిలో మావారు మొదట చూసిన ఆ పాప పేరు మీదుగా 2002లో ‘సబిత దివ్యాంగుల పాఠశాల’ ప్రారంభించాం.

ఆరుగురు పిల్లలతో మొదలైంది. పిల్లల సంఖ్య పెరిగే కొద్దీ కొందరికి శిక్షణిచ్చి ఉద్యోగులుగా తీసుకున్నాం. ఉచిత బోధన. శిక్షకులకు జీతాలు, అద్దె, కొన్ని పరికరాలు.. నెలకు రూ.25వేలు ఖర్చయ్యేది. మధ్యతరగతి కుటుంబం.. ఆయన సంపాదనా దీనికే పెట్టే వాళ్లం. ఒక దశలో మూసేద్దామనుకున్నాం. తెలిసినవారి సాయం, పిల్లలకు పుస్తకాల బైండింగ్‌, క్యాండిల్స్‌ తయారీ వంటివి నేర్పి, వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో నెట్టుకొచ్చాం. 2005లో ప్రభుత్వం భవనం, నిధులు మంజూరు చేయడంతో 2006లో హాస్టల్‌నీ ప్రారంభించాం. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా, బీఎడ్‌నీ చేశా. పిల్లలకే కాదు.. వాళ్లతో మెలిగే పద్ధతిపై అమ్మానాన్నలకూ కౌన్సెలింగ్‌ ఇస్తా. పిల్లాడి మానసిక స్థితినిబట్టి కరిక్యులం నిర్ణయిస్తాం. మెరుగైన వారితో దూరవిద్య ద్వారా పది పరీక్షలూ రాయిస్తాం. ఇప్పటివరకూ 500-600 మందికి శిక్షణిచ్చాం. ప్రస్తుతం 80 మంది స్కూల్లో ఉన్నారు. స్కూలుకి రాలేని వాళ్లకి ఇంటికెళ్లి కౌన్సెలింగ్‌ ఇస్తుంటా.

ఇరవయ్యేళ్ల ప్రయాణం.. స్కూలుకే కాదు.. ఉండటానికీ ఇల్లు అద్దెకిచ్చేవారు కాదు. ‘వాళ్లను చూసి మా పిల్లలూ అలానే తయారవు తార’నేవారు. రెండు మూడు నెలలకో ఇల్లు మారిన సందర్భాలెన్నో. నిధులు ఆలస్యమై అప్పులు తెచ్చేవాళ్లం. ఎన్ని సమస్యలున్నా చిన్నారుల్లో కనిపించే మార్పే మమ్మల్ని ముందుకు నడుపుతోంది. ఇలాంటి పిల్లలకు నేర్పేటప్పుడు చాలా ఓపిక ఉండాలి. నలుగురితో మెలగడం, సొంతగా పనులు చేసుకోవడం, నగదు లావాదేవీలు.. వంటివి నేర్పుతున్నాం. అమ్మాయిలకు నెలసరి, మంచి- చెడు స్పర్శ వంటివీ చెబుతాం. ఒక బాబు స్కూలయ్యాక షాపులో చేసేవాడు. ఓరోజు వాడి జేబులో సిగరెట్‌ దొరికింది. వీళ్లకి అరిచో, నీదే తప్పు అన్నట్లు చెబితే తీసుకోలేరు. చెడు అలవాట్లకు ఆకర్షితులైతే ఎలా ఉంటుందో వాళ్లకి అర్థమయ్యే భాషలో చెప్పేదాన్ని. వాళ్ల జీవితాల్ని పూర్తిగా మార్చేయలేం.. కానీ ‘రేపు మేము పోయాక వీడెలాగ’ని కంగారుపడే అమ్మల బెంగ తీరుస్తున్నాం. మాబాబు గతేడాది చనిపోయాడు. వాడున్నప్పుడు నాదీ అదే పరిస్థితి. వాళ్ల బాధ నాకు తెలుసు. ఇప్పుడు మా అబ్బాయి లేకపోయినా ఈ పిల్లల్లో వాడిని చూసుకుంటూ జీవిస్తున్నా. నేనున్నంత కాలం నాలాంటి అమ్మల బెంగ తీర్చాలన్నది నా ఆశ. 

  - కమ్మరి శివకుమార్‌, సంగారెడ్డి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్