Updated : 23/11/2021 15:21 IST

నన్నిలా చూసి ఆయనెక్కడున్నా సంతోషిస్తారు! 

(Photo: Twitter)

దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడతారు వీర సైనికులు. ఆ వీరుల్ని కట్టుకున్న భార్యలు కూడా అంతే గుండె ధైర్యాన్ని, నిండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. అందుకే భర్త యుద్ధంలో అమరుడైనా ‘నేను సైతం’ అంటూ అటు భర్త అడుగుజాడల్లో నడవడానికి, ఇటు దేశ రక్షణ బాధ్యతల్ని చేపట్టడానికి సిద్ధపడతారు. మూడేళ్ల క్రితం ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో అమరుడైన నాయక్‌ దీపక్‌ నైన్వాల్‌ సతీమణి జ్యోతీ నైన్వాల్‌ కూడా ఆ కోవలోకే చెందుతారు.

భార్యాభర్తలంటే ప్రతి అడుగులోనూ ఒకరికొకరు తోడుండాలి.. ఇద్దరూ ఒకరి నుంచి మరొకరు పాఠాలు నేర్చుకోవాలి. అలా తన భర్త నుంచి ధైర్యం అనే పాఠం నేర్చుకున్నారు జ్యోతి. అందుకే దేశ సేవలో అమరుడైన తన భర్త ఆశయాన్ని తాను భుజాలపైకెత్తుకున్నారు. ఇండియన్‌ ఆర్మీలో చేరేందుకు తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వచ్చే నెల 11న లెఫ్టినెంట్‌గా బాధ్యతలు అందుకోబోతోన్న ఈ వీర సతీమణి గురించి పలు విషయాలు తెలుసుకుందాం..

స్వాతంత్ర్య సమరయోధుడైన తాత, ఆర్మీలో సేవలందించిన తండ్రి.. వీరిద్దరినీ చూసి తానూ దేశ సేవలో తరించాలని నిర్ణయించుకున్నాడు దీపక్‌ నైన్వాల్‌. ఈ క్రమంలోనే ఇండియన్‌ ఆర్మీలో చేరాడు. ఇక దీపక్‌ని భర్తగా ఎంచుకునే క్రమంలో ఆయన ఉద్యోగం గురించి ఏమాత్రం దిగులు చెందలేదు జ్యోతి. దేశ రక్షణలో ఉన్న ఓ సైనికుడికి కాబోయే భార్యగా ఎంతో గర్వంతో ఉప్పొంగిపోయింది. అలా 2011లో దీపక్‌-జ్యోతిల వివాహమైంది. ఈ జంటకు లావణ్య, రేయాంశ్‌ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు.

40 రోజుల పాటు పోరాడి..!

ఇలా ఆనందంగా, హాయిగా సాగిపోతోన్న వారి జీవితంలో ఒక్కసారిగా పెద్ద కుదుపు ఏర్పడింది. 2018, ఏప్రిల్‌ 10న కశ్మీర్‌లోని కుల్గామ్‌ ప్రాంతంలో దారి కాచి ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో విధుల్లో ఉన్న దీపక్‌ తీవ్ర గాయాల పాలయ్యాడు. వెన్నెముకకు తూటా తగలడంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఆస్పత్రిలో చేరిన 40 రోజులకు కన్నుమూశారు దీపక్‌. ఇలా తన భర్త మరణంతో జ్యోతి జీవితంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. ఓవైపు తన ఆరోప్రాణం తనకు దూరమవడం, మరోవైపు తన ఇద్దరు పిల్లల బాధ్యత.. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ‘నేను పోయినా ధైర్యంగా ఉండు.. బిడ్డలకు ఏలోటూ రాకుండా పెంచు’ అని కన్నుమూసే ముందు భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అవే తనలో గుండె ధైర్యాన్ని, నిండైన ఆత్మవిశ్వాసాన్ని నింపాయని చెబుతోంది జ్యోతి.

ఆయన ఆశయమే నా ఊపిరైంది!

‘ఆయన పోయినప్పుడు నా ఆరోప్రాణం నా నుంచి దూరమైందనిపించింది. కానీ నేను ఇలా బాధపడుతూ కూర్చోవాలని నా భర్త ఎప్పుడూ కోరుకోలేదు.. ఈ ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయనెప్పుడూ నాతో చెబుతుండేవారు. ప్రతి క్షణం దేశం గురించి ఆయన మాట్లాడుతుంటే గర్వంతో ఉప్పొంగిపోయేదాన్ని. ఆయన స్ఫూర్తితోనే ఆయన ఆశయాన్ని నిర్వర్తించాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే ఇండియన్‌ ఆర్మీలో చేరానుకున్నా. నన్నిలా చూసి ఆయనెక్కడున్నా సంతోషిస్తారు. ఆర్మీలో చేరి దేశ సేవ చేసే సత్తా నాలో ఉందని ఆయనెప్పుడూ అంటుండేవారు. ఆయన ఆఖరి కోరిక కూడా ఇదే! నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మా అత్తమామలు, అమ్మానాన్నలు, నా సోదరులు.. ఇలా అందరూ ఎంతో సంతోషించారు.. అడుగడుగునా నా తోడై నన్ను ముందుకు నడిపించారు..’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకుంది జ్యోతి.

దాని వెనుక ఎంతో కఠోర పరిశ్రమ!

ఎకనామిక్స్‌ విభాగంలో పీజీ చేసిన జ్యోతి.. ఇండియన్‌ ఆర్మీలో చేరే క్రమంలో ఎస్‌ఎస్‌బీ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. ఈ క్రమంలో తొలుత మూడుసార్లు విఫలమైనా.. నాలుగోసారి తన ఆశయాన్ని సాధించింది జ్యోతి. ఓవైపు అమ్మగా తన ఇద్దరు పిల్లల బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు పరీక్షల కోసం తీవ్ర పరిశ్రమ చేసింది. అంతేకాదు.. శారీరక దృఢత్వాన్ని సొంతం చేసుకోవడం కోసం రోజూ ఉదయాన్నే 3.30 గంటలకు నిద్రలేవడం, జాగింగ్‌కి వెళ్లడంతో పాటు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యాలు కూడా నేర్చుకుంది.

‘నిజానికి నేనూ మా అమ్మలాగే గృహిణిగా స్థిరపడదామనుకున్నా. కానీ నా భర్త దూరమయ్యాక నా లక్ష్యం పూర్తిగా మారిపోయింది. మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది.. ‘నీ పిల్లలకు ఎవరో కాదు.. నువ్వే స్ఫూర్తిగా మారాలని!’ అదే ఫీలింగ్‌ ఇప్పుడు నా పిల్లల కళ్లల్లో కనిపిస్తోంది..’ అంటూ ఓ తల్లిగా, వీర సైనికుడి భార్యగా ఉప్పొంగిపోతోంది జ్యోతి.

ఈ ఏడాది జనవరిలో చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణ కోసం చేరింది జ్యోతి. 11 నెలల కఠోర శిక్షణను తాజాగా పూర్తి చేసుకున్న ఆమె.. డిసెంబర్‌ 11న ఇండియన్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టనుంది.

ఇలా అర్ధాంగిగా తన భర్త జీవితంలో సగ భాగమవడమే కాదు.. ఆయన బాధ్యతల్నీ పంచుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న ఈ వీర సతీమణికి సెల్యూట్‌ చేద్దాం..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని