వెండితెరపై.. కవిత జీవితం!

డబ్ల్యూడబ్ల్యూఈ.. ఈ పేరు చెప్పగానే కండలు తిరిగిన మల్లయోధులే గుర్తొస్తారు. రింగులో రక్తం చిందించేలా వారు కుస్తీ పడే విధానం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంటుంది. అయితే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) నిర్వహించే ఈ పోటీల్లో....

Published : 08 Jun 2023 12:45 IST

(Photos: Instagram)

డబ్ల్యూడబ్ల్యూఈ.. ఈ పేరు చెప్పగానే కండలు తిరిగిన మల్లయోధులే గుర్తొస్తారు. రింగులో రక్తం చిందించేలా వారు కుస్తీ పడే విధానం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంటుంది. అయితే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) నిర్వహించే ఈ పోటీల్లో గెలుపొందిన వారికే కాదు.. పాల్గొనే వారికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులుంటారు. మరి, ఇలాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది హరియాణాకు చెందిన కవితా దేవి. డబ్ల్యూడబ్ల్యూఈ సంస్థతో నాలుగేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకొని.. తన కుస్తీ నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆదరాభిమానాల్ని సంపాదించుకున్న ఈ రెజ్లింగ్‌ క్వీన్‌ జీవితం త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఇందుకు సన్నద్ధమైన చిత్ర నిర్మాతలు ప్రెట్టీ అగర్వాల్‌, జీషన్‌ అహ్మద్‌ ఇటీవలే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ మహిళా రెజ్లర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

‘చదువెందుకని’ అన్నా!

ఆడపిల్లలపై అడుగడుగునా ఆంక్షలుండే హరియాణా రాష్ట్రంలోని మాల్వి అనే గ్రామంలో పుట్టి పెరిగింది కవితా దేవి. ఆమె అసలు పేరు కవితా దలాల్‌. ఆ గ్రామంలో అమ్మాయిలు పదో తరగతి వరకు చదువుకోవడమే గొప్ప అనుకుంటే.. పైచదువులు చదవాలని కోరుకుందామె. ‘చదువెందుకు? పెళ్లి చేసి అత్తారింటికి పంపక!’ అని ఇరుగుపొరుగు వాళ్లు అన్నా.. ఆ మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేది కవిత. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య బీఏ పూర్తి చేయడం తన అన్నయ్య సందీప్ దలాల్ చలవేనని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందామె. ఇక బీఏ పూర్తయ్యాక స్పోర్ట్స్‌ కోటాలో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ)లో కానిస్టేబుల్‌గా చేరింది కవిత. ఆపై ఇందులో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆమె.. అదే పోస్ట్‌లో ఉండగానే ఈ ఉద్యోగాన్ని వదులుకుంది.

జాతీయ ఛాంపియన్!

కవితకు చిన్నతనం నుంచి ఆటలంటే మక్కువ. ముఖ్యంగా వెయిట్‌లిఫ్టింగ్‌, వుషు, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టేది. ఆయా క్రీడల్లో జాతీయ స్థాయిలో జరిగిన పలు పోటీల్లోనూ గెలుపొందిందామె. ఇక 2002లో లక్నో, ఉత్తరప్రదేశ్‌లలో వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకున్న ఆమె.. పలుమార్లు ‘జాతీయ సీనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌’గా నిలిచింది. అయితే ఎస్‌ఎస్‌బీలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సమయంలో ఆమె పలు పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించింది ప్రభుత్వం. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి.. క్రీడలనే తన పూర్తి స్థాయి కెరీర్‌గా మలచుకోవాలని నిర్ణయించుకుంది. ఆపై అర్హత ఉన్నా.. ప్రభుత్వ సహకారం లేక ఎన్నో పోటీల్లో పాల్గొనలేకపోయింది కవిత. అయితే 2016లో గువాహటిలో జరిగిన ‘సౌత్ ఏషియన్ గేమ్స్‌’ ఆమె క్రీడా కెరీర్‌నే మలుపు తిప్పాయని చెప్పచ్చు.

‘పసిడి’తో బోణీ!

ఈ పోటీల్లో పాల్గొన్న కవిత 75 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఇందులో మొత్తంగా 210 కిలోల బరువు (స్నాచ్ విభాగంలో - 92 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో - 118 కిలోలు) ఎత్తింది. ఆ సమయంలో.. ఒక టోర్నమెంట్‌లో స్త్రీలు ఎత్తిన అత్యధిక బరువుగా ఇది రికార్డులకెక్కింది. అంతేకాదు.. తన తర్వాత స్థానంలో నిలిచిన వ్యక్తి కంటే ఆమె 50 కేజీల అధిక బరువు ఎత్తడం, స్వర్ణ-రజత పతక విజేతలు ఎత్తిన బరువుల మధ్య ఇంత వ్యత్యాసం నమోదవడం మరో విశేషం. ఇలా తొలి విజయంతోనే తిరుగులేని రికార్డులు తన పేరిట నమోదు చేసుకుంది కవిత.

రెజ్లింగ్‌లోకి అడుగు..

వెయిట్‌లిఫ్టర్‌గా జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పతకాలు సాధించిన ఆమె ఆ తర్వాత తన కెరీర్‌ని రెజ్లింగ్ వైపు మళ్లించింది. ఈ క్రమంలోనే ‘డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్‌ హెవీవెయిట్‌ ఛాంపియన్‌’గా పేరు గాంచిన దిలీప్‌ సింగ్‌ రానా (రింగ్‌ పేరు - ది గ్రేట్‌ ఖలీ) నిర్వహిస్తోన్న ‘కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌’లో చేరింది. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న ఈ అకాడమీ దేశంలోనే అత్యుత్తమ రెజ్లింగ్‌ అకాడమీగా పేరు గాంచింది. ఇందులో శిక్షణ పొంది ప్రొఫెషనల్‌ రెజ్లర్‌గా ఎదిగింది కవిత. ఆపై ఈ అకాడమీలో జరిగే వివిధ పోటీలు, ఈవెంట్ల ద్వారా రెజ్లర్‌గా ఆమె ప్రపంచానికి పరిచయమైంది. ‘కవితా దేవి’, ‘హార్డ్ కేడీ’ వంటి రింగ్‌ పేర్లతోనే మరింతగా పాపులరైందీ రెజ్లింగ్‌ క్వీన్. ఇందులో భాగంగా ఓ పోటీలో చుడీదార్‌తోనే బరిలోకి దిగి.. అద్భుత ప్రదర్శన చేసిందామె. తద్వారా క్రీడలకు డ్రస్‌కోడ్‌తో సంబంధం లేదని చెప్పకనే చెప్పింది కవిత. ఇలా తాను ప్రొఫెషనల్ రెజ్లర్‌గా మారడానికి ప్రేరణ, స్ఫూర్తి, మార్గదర్శి.. అన్నీ ‘ది గ్రేట్‌ ఖలీ’నే అంటోందీ హరియాణా రెజ్లర్.

డబ్ల్యూడబ్ల్యూఈ వేదికపై..!

ఖలీ శిక్షణలో రాటుదేలిన కవిత సీడబ్ల్యూఈ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్‌ పోటీలోనూ పాల్గొంది. 2017లో మహిళల కోసం డబ్ల్యూడబ్ల్యూఈ మొదటిసారిగా ప్రారంభించిన ‘మే యంగ్ క్లాసిక్’ అనే మహిళల పోటీలో.. ప్రపంచవ్యాప్తంగా 32 మంది పాల్గొనగా.. వీరిలో కవిత ఒక్కర్తే భారతీయురాలు కావడం విశేషం. ఇలా డబ్ల్యూడబ్ల్యూఈలో పాల్గొన్న తొలి భారతీయ మహిళగానూ చరిత్ర సృష్టించిందామె. అయితే దీనికోసం దుబాయ్‌లో జరిగిన ట్రై అవుట్‌లో పాల్గొని నెగ్గినప్పటికీ.. తొలి రౌండ్‌లోనే ఆమె వెనుతిరగాల్సి వచ్చింది. ఆపై డబ్ల్యూడబ్ల్యూఈతో నాలుగేళ్ల కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన కవిత.. ఈ సంస్థలో శిక్షణ తీసుకోవడంతో పాటు పలు పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటింది. ఇలా ఈ అంతర్జాతీయ వేదికపై జరిగే పోటీల్లో పాల్గొన్న ప్రతిసారీ నిండుగా ఉండే భారతీయ సంప్రదాయ వస్త్రధారణకు ప్రాధాన్యమిస్తూ, నుదుట బొట్టుతోనే కనిపించేదామె. ఇలా ఓవైపు తన ప్రదర్శన, మరోవైపు తన డ్రస్సింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుందీ రెజ్లింగ్‌ క్వీన్‌. 2021లో ఒప్పందం పూర్తవడంతో ఈ సంస్థ నుంచి బయటికొచ్చేసింది కవిత.

ఆలిగా, అమ్మగా..!

వాలీబాల్ క్రీడాకారుడు గౌరవ్ తోమర్‌తో ప్రేమలో పడిన కవిత.. అతన్నే పెళ్లాడింది. ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పూర్‌కి చెందిన గౌరవ్ ఎస్ఎస్‌బీలో పనిచేసే సమయంలో కవితకు పరిచయమయ్యాడు. ఇద్దరూ క్రీడాకారులే కావడంతో వారి పరిచయం పెళ్లికి దారి తీసింది. ఈ జంటకు అభిజీత్ అనే కొడుకున్నాడు. అయితే కొడుకు పుట్టాక తన క్రీడా కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్న తరుణంలోనూ తన భర్త వెన్నంటే ఉన్నాడని, ఆయన ప్రోత్సాహం వల్లే తానీ స్థాయికి చేరుకోగలిగానని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది కవిత.

ఇలా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా జీవితం అనే పుస్తకంలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న ఈ రెజ్లర్‌ జీవితం.. త్వరలోనే వెండితెరపై సినిమాగా రాబో తోంది. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రకటన చేశారు చిత్ర నిర్మాతలు ప్రెట్టీ అగర్వాల్‌, జీషన్‌ అహ్మద్‌. ప్రస్తుతం కథకు మెరుగులు దిద్దుతోన్న వీరు.. ఈ బయోపిక్‌తో ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపే ముఖ్యోద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని