First Woman : ఆమే తొలి మహిళా న్యూస్‌ రీడర్‌!

ఆకట్టుకునే రూపం, శ్రావ్యమైన కంఠస్వరం, చుట్టూ జరుగుతున్న విషయాలపై కనీస పరిజ్ఞానం.. న్యూస్ రీడర్లు కావాలనుకునే వారికి ఉండాల్సిన కనీస అర్హతలివి. ఇలాంటి విషయాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే రెండాకులు ఎక్కువ చదివారని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ఏ ఛానల్‌లో చూసినా వార్తలు చదివే వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా....

Updated : 03 Mar 2022 19:14 IST

ఆకట్టుకునే రూపం, శ్రావ్యమైన కంఠస్వరం, చుట్టూ జరుగుతున్న విషయాలపై కనీస పరిజ్ఞానం.. న్యూస్ రీడర్లు కావాలనుకునే వారికి ఉండాల్సిన కనీస అర్హతలివి. ఇలాంటి విషయాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే రెండాకులు ఎక్కువ చదివారని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ఏ ఛానల్‌లో చూసినా వార్తలు చదివే వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా కనిపిస్తుంటారు. అలా భారతీయ టీవీ చరిత్రలో మొదటిసారిగా వార్తలు చదివింది కూడా ఒక స్త్రీ కావడం స్ఫూర్తిదాయకమైన విషయం. ఆమె ఎవరో, తన ప్రస్థానం ఎలా ప్రారంభమైందో ఈ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం', 'విమెన్ హిస్టరీ మంత్' సందర్భంగా తెలుసుకుందాం రండి..

అలా వారి దృష్టిని ఆకర్షించింది!

వార్తలు చదవడానికి శ్రావ్యమైన కంఠస్వరం, ఆకట్టుకునే రూపం ఉన్న వారిని ఎంచుకోవడం సహజం. 1965లో ఆల్ఇండియా రేడియోలో భాగమైన దూరదర్శన్ వార్తా ఛానల్‌ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. టీవీ ద్వారా ప్రతిరోజూ వార్తలు అందించాలని ఐదు నిమిషాల న్యూస్ బులెటిన్‌ను డిజైన్ చేసింది. ఈ క్రమంలో సిమ్లాలో పుట్టిపెరిగి.. అక్కడి ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేస్తున్న ప్రతిమా పూరీ వారి దృష్టిని ఆకర్షించింది. మధురమైన ఆమె స్వరం, అందమైన రూపం వారిని కట్టిపడేసింది. అంతే.. అప్పటికప్పుడు ఆమెతో ఆ ఐదు నిమిషాల న్యూస్ బులెటిన్‌ను చదివించారు ఆ ఛానల్‌ నిర్వాహకులు. అలా దేశంలోనే తొట్టతొలి న్యూస్ రీడర్‌గా ప్రారంభమైన ప్రతిమ వార్తల ప్రస్థానం 1967 వరకు నిర్విరామంగా కొనసాగింది. ఆరోజుల్లో టీవీ ఉన్న కుటుంబాలను వేళ్లమీద లెక్కించవచ్చు. 1972 వరకూ దిల్లీలో తప్ప భారతదేశంలో మరెక్కడా టీవీలు లేవు. అయితేనేం నెహ్రూ వంటి ప్రముఖులు ఆమె న్యూస్ బులెటిన్‌ని క్రమం తప్పకుండా చూసేవారు. మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో కాలుమోపిన యూరీ గగారిన్‌ను ఆమె ఇంటర్వ్యూ చేయడం దూరదర్శన్ చరిత్రలో ఓ అపురూపమైన ఘట్టం. అంతేకాదు.. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖుల్ని సైతం ఆమె ఇంటర్వ్యూ చేశారు.

ట్రైనర్‌గానూ..!

రెండేళ్ల తర్వాత దూరదర్శన్‌కి మరింతమంది న్యూస్ రీడర్‌లు అవసరమయ్యారు. ఈ క్రమంలోనే.. కేవలం న్యూస్ రీడర్‌గానే కాదు.. వార్తలు చదవడంలో కొత్త వారికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యతను కూడా తమ మొదటి న్యూస్ రీడరైన ప్రతిమా పూరీకి అప్పగించింది దూరదర్శన్ యాజమాన్యం. 1967లో సల్మా సుల్తాన్ ప్రతిమ స్థానాన్ని భర్తీ చేసింది. 2007 వరకు దూరదర్శన్‌కు ప్రతిమ తన సేవలను అందించారు. ప్రతిమగానే పాపులర్ అయిన ఆమె అసలు పేరు విద్యా రావత్. 2007లో తుది శ్వాస విడిచిన ప్రతిమ.. మహిళలు మీడియా రంగంలోకి ప్రవేశించడానికి, న్యూస్ రీడర్లుగా పైచేయి సాధించడానికి ఆదిగా నిలిచారని చెప్పడంలో సందేహం లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్