Madhu Chopra: అలాంటి సీన్లు చేయనంది.. అందుకే ఎన్నో అవకాశాలు కోల్పోయింది!

జీవితంలో ఎదగాలంటే ఎన్నో ఎత్తుపల్లాలు దాటాలి. ఒకానొక దశలో వెనక్కి తగ్గాలనిపించినా.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగిన వారే నిర్దేశించుకున్న లక్ష్యాల్ని చేరుకోగలుగుతారు. తన కూతురు ప్రియాంక చోప్రానే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు ఆమె తల్లి....

Published : 08 Apr 2023 14:49 IST

(Photos: Instagram)

జీవితంలో ఎదగాలంటే ఎన్నో ఎత్తుపల్లాలు దాటాలి. ఒకానొక దశలో వెనక్కి తగ్గాలనిపించినా.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగిన వారే నిర్దేశించుకున్న లక్ష్యాల్ని చేరుకోగలుగుతారు. తన కూతురు ప్రియాంక చోప్రానే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు ఆమె తల్లి మధు చోప్రా. వృత్తిరీత్యా డాక్టర్‌, వ్యాపారవేత్త అయిన ఆమె.. ఓ అమ్మగా తన కూతురికి జీవితం విలువలు నేర్పడమే కాదు.. గురువుగా మార్గనిర్దేశనం కూడా చేశారు.. తద్వారా ఆమె విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఒకానొక దశలో తనకు అసౌకర్యంగా అనిపించిన సన్నివేశాల్లో నటించడానికి ఒప్పుకోకపోవడం వల్ల ఎన్నో సినిమా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందంటూ ఇటీవలే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు మధు. ఇప్పుడే కాదు.. గతంలోనూ పలుమార్లు ప్రియాంక వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారామె. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కెరీర్‌ విజయాల్లో తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో! అయితే ఒకానొక సందర్భంలో బిజీ షెడ్యూల్‌ కారణంగా పలు మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొన్న తన కూతురు.. సినీ ఇండస్ట్రీని వదిలి వేరే కెరీర్‌ను ఎంచుకోమన్నా పట్టుదలతో ఇందులోనే కొనసాగిందని ఇటీవలే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఆమె తల్లి మధు చోప్రా. ఈ అంకితభావమే ఇప్పుడు ఆమెను ఈ స్థాయికి చేర్చిందని తన ముద్దుల కూతురిని ఆకాశానికెత్తేశారు.

గురువుగా.. గైడ్‌ చేశా!

‘నా కూతురు ప్రియాంక సినీ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలోనే.. నేనూ బ్యూటీ వ్యాపారంలోకి అడుగుపెట్టా. మా ఇద్దరికీ ఈ రంగాలు కొత్తే! అయితే నాకున్న పూర్వ అనుభవంతో తనకు కొన్ని విషయాల్లో అండగా నిలిచాను. నేను లా చదివాను. ఆర్థిక విషయాల్లో నాకు అవగాహన ఉంది. కాబట్టి తనకు సంబంధించిన న్యాయపరమైన, ఆర్థిక విషయాలు నేనే చూసుకునేదాన్ని. తను ఎక్కడికి వెళ్లినా తన వెంటే ఉండేదాన్ని. ఆపై కొన్నాళ్లకు తన మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, తనతో చర్చించి.. తన సమ్మతితోనే కొన్ని పరిధులు నిర్దేశించుకున్నాం. సాయంత్రం 7.30 తర్వాత ఎలాంటి మీటింగ్స్‌ పెట్టుకోకపోవడం, బయటికి వెళ్లకపోవడం, అసౌకర్యంగా అనిపించిన సన్నివేశాల్లో నటించకపోవడం, అనవసరం అనిపించిన సీన్లు చేయనని నియమం పెట్టుకోవడం.. వంటివి అందులో కొన్ని! నిజానికి దీంతో తను చాలా సినిమా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. తాను నిరాశపడినప్పుడల్లా ఒక్కటే చెప్పేదాన్ని.. ‘ఇదే నీ జీవితం కాదు.. కావాలంటే దీన్ని వదిలేసి చదువుపై దృష్టి పెట్టు. మరో కెరీర్‌ను ఎంచుకో! నీ ముందు చాలా అవకాశాలున్నాయి. అంతేకానీ నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకోకుండా.. ఉన్నతంగా ఆలోచించు..’ అని! అయినా తను సినిమాను వదల్లేదు. తనలో ఉన్న ఈ పట్టుదల, అంకితభావమే ఇప్పుడు తనను ఇంత ఉన్నత స్థాయికి చేర్చాయి..’ అంటూ ఓ తల్లిగా తన కూతురి విజయాల్ని చూసి మురిసిపోతున్నారు మధు.

ఆ పోటీ నుంచి తప్పుకుంటానంది.. కానీ!

ప్రియాంక 2000లో ‘ప్రపంచ సుందరి’ కిరీటం గెలిచిన విషయం తెలిసిందే! అయితే పోటీ ప్రారంభంలో తీవ్ర నిరాశకు గురైన తాను.. ఒక దశలో పోటీ నుంచి బయటికి వచ్చేస్తానందని, ఆ సమయంలో తన మాటలే తన కూతురిలో పోటీ పట్ల ఆసక్తిని పెంచాయని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు మధు. ‘ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా వెళ్లింది ప్రియాంక. అయితే కొన్ని చిన్న చిన్న పోటీల్లో తాను అనుకున్న ప్రదర్శన చేయలేకపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైంది.. పోటీల నుంచి తప్పుకుంటానని ఏడ్చింది. కానీ తన నిర్ణయాన్ని నేను అంగీకరించలేదు. ఎందుకంటే ఎంతో కష్టపడి తాను ఈ పోటీలకు సిద్ధమైంది.. దాంతో చిన్న చిన్న కారణాలతో మధ్యలో తప్పుకోవడం సరికాదనిపించింది. అందుకే తనను దగ్గర కూర్చోబెట్టుకొని ఒక మాట చెప్పా.. ‘నువ్వు చాలా స్మార్ట్‌.. తెలివైనదానివి.. అలాగని కచ్చితంగా కిరీటం గెలవాలని ఎవరూ నీపై ఒత్తిడి పెట్టట్లేదు. సరదాగానే ఈ పోటీలో పాల్గొని చూడు.. ఎంజాయ్ చెయ్యి..’ అన్నా. అంతే తనలో ఆత్మవిశ్వాసం రెట్టించింది.. ప్రశాంతంగా ఒక్కో దశ నెగ్గుతూ వెళ్లింది.. తాను అనుకున్నది సాధించింది..’ అంటూ తన కూతురి కల నెరవేరిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారీ సూపర్‌ మామ్.

మనసు మాట వినమన్నా!

సినీ తారలకు బాడీ షేమింగ్‌ కొత్త కాదు.. శరీరాకృతిలో కాస్త తేడాలొచ్చినా, వేసుకున్న దుస్తులు నచ్చకపోయినా.. నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తుంటారు. అయితే ఈ విషయంలోనూ తన కూతురిని తాను సానుకూల దృక్పథంతోనే ముందుకు నడిపించానంటున్నారు మధు. ‘ప్రియాంక ముందు నుంచి శరీరాకృతి, అందంపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టేది. దీంతో ఈ విషయాల్లో తనను ఎవరైనా విమర్శించినా బాధపడకూడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా తనతో కొన్ని మాటలు చెప్పా. ‘నీలో ఉన్న ప్రత్యేకతలపై దృష్టి పెట్టు.. నీ మనసుకు ఏది నచ్చితే అది చెయ్యి. గిట్టక ఇతరులు ఏమైనా అన్నా, శరీరాకృతి విషయంలో కామెంట్లు చేసినా పట్టించుకోకు. నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు!’ అని తనలో పాజిటివిటీ నింపా. అప్పట్నుంచి తాను ప్రతి సందర్భంలోనూ ఇదే సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 2020 గ్రామీ వేడుకల్లో తాను ధరించిన డ్రస్‌పై చాలా విమర్శలొచ్చాయి. కానీ తన మనసుకు నచ్చిన పని చేసినందుకు నేనైతే హ్యాపీగా ఫీలయ్యా. నిజానికి అంతకుముందే తను ఈ డ్రస్‌ను నాకు చూపించింది. కాస్త రిస్కీగానే అనిపించినా.. ఒప్పుకున్నా. నాకు తెలిసి ఇతరులకు హాని జరగనంత వరకు మనకు నచ్చినట్లుగా జీవించే హక్కు మనకుంది..’ అంటూ తన కూతురిలోనే కాదు.. ఎంతోమంది బాడీ షేమింగ్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపారీ డాక్టర్‌ మామ్.

ముందు వాళ్లనే మాట్లాడనిచ్చేదాన్ని!

చాలామంది తల్లిదండ్రులు తాము చెప్పిందే పిల్లలు వినాలనుకుంటారు.. ఈ క్రమంలో పిల్లల నోరు కట్టేస్తుంటారు. కానీ తాను మాత్రం తన పిల్లలకే ముందు మాట్లాడే స్వేచ్ఛనిచ్చానంటున్నారు మధు. ‘చిన్నవయసులో నా పిల్లలు స్కూల్‌ నుంచి రాగానే.. అక్కడ జరిగిన విషయాలన్నీ అడిగి తెలుసుకునేదాన్ని. ఇదనే కాదు.. ప్రతి విషయంలోనూ వాళ్లకే ముందుగా మాట్లాడే అవకాశమిచ్చేదాన్ని. చర్చ పూర్తయ్యాక అవసరమైన సలహాలు, సూచనలు అందించేదాన్ని. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. తల్లిదండ్రులతో స్నేహం పెరుగుతుంది. తద్వారా ఏ విషయాన్నైనా వారు నిర్మొహమాటంగా, నిర్భయంగా పంచుకోగలుగుతారు. ఇంత పెద్దవాళ్లైనా ఇప్పటికీ నేను నా పిల్లల విషయంలో ఇదే సూత్రాన్ని పాటిస్తున్నా..’ అంటూ మరో సందర్భంలో చెప్పుకొచ్చారామె.


తనే నా గర్ల్‌ హీరో!

ఇలా మధు మాత్రమే కాదు.. ప్రియాంక కూడా సందర్భమొచ్చినప్పుడల్లా తన తల్లి గొప్పతనం, ఆమె నేర్పిన విలువల గురించి పంచుకుంటుంటుంది. ‘మా అమ్మే నా గర్ల్‌ హీరో. తనకు ధైర్యం ఎక్కువ. ఆర్మీలో డాక్టర్‌గా పనిచేయాలన్న మక్కువతో తన కలల ఉద్యోగాన్ని సాధించడానికి ఇంటి నుంచి బయటికొచ్చేసింది. ఆపై అనుకున్నది సాధించింది. అంతేకాదు.. తన ప్రతిభతో 8 రకాల వైద్య సర్టిఫికేషన్స్‌ సంపాదించింది.. తను సర్టిఫైడ్‌ పైలట్‌ కూడా! 9 భాషల్ని అనర్గళంగా మాట్లాడగలదు. అంతేకాదు.. తనో గొప్ప అమ్మ, కూతురు, సోదరి, భార్య, వ్యాపార భాగస్వామి. జీవితంలో మనం అనుకున్నది ఏదైనా సాధించచ్చన్న విషయం తన విజయాలతో నిరూపించి చూపించింది. అందుకే వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా తనే నాకు ప్రేరణ..’ అంటూ తన తల్లిని ఆకాశానికెత్తేస్తూ ఓ సందర్భంలో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది పీసీ. తన కోరిక మేరకు గతంలో కొన్నేళ్ల పాటు ఆర్మీలో వైద్య సేవలందించిన మధు.. ప్రస్తుతం డాక్టర్‌గా, చిత్ర నిర్మాతగా, వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని