ఆ కమిటీలో ‘ఆమె’ ఒక్కర్తే!

మహిళల సమస్యలు సాటి మహిళలకే అర్థమవుతాయంటారు. మరి, వాటి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, చక్కటి పరిష్కారం వెతకాలన్నా.. ఎక్కువ మంది స్త్రీలు కలిసి గళమెత్తితేనే అది సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు సుస్మితా దేవ్‌.

Published : 03 Jan 2022 19:58 IST

(Photo: Instagram)

మహిళల సమస్యలు సాటి మహిళలకే అర్థమవుతాయంటారు. మరి, వాటి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, చక్కటి పరిష్కారం వెతకాలన్నా.. ఎక్కువ మంది స్త్రీలు కలిసి గళమెత్తితేనే అది సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు సుస్మితా దేవ్‌. ప్రస్తుతం అమ్మాయిల చట్టబద్ధమైన వివాహ వయసును పెంచడానికి ఉద్దేశించిన బిల్లును పరిశీలించే కమిటీలో ఆమె ఒక్కరే మహిళ కావడం గమనార్హం. ఈ క్రమంలో- ఈ సమాజంలో మహిళల సమస్యలకు చరమగీతం పాడాలంటే.. చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగడమే కీలకమంటోన్న ఈ లేడీ ఎంపీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

అమ్మాయిల వివాహ వయసును 21 కి పెంచడమే ధ్యేయంగా ‘బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు’ను ప్రభుత్వం ఇటీవలే ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే! అయితే ఈ బిల్లు పైన అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దీనిని మరింత లోతుగా అధ్యయనం చేసే బాధ్యతను పార్లమెంటరీ స్థాయీ సంఘానికి అప్పగించారు. 31 మందితో కూడిన ఈ కమిటీలో సుస్మితా దేవ్‌ ఒక్కరే మహిళ కావడం గమనార్హం.

అమ్మానాన్న బాటలో నడిచి..!

సుస్మిత అసోంలోని సిల్చర్‌లో పుట్టారు. ఆమె తండ్రి సంతోష్‌ మోహన్‌ దేవ్ కేంద్ర మంత్రిగా, ఎంపీగా సేవలందించారు. ఆమె తల్లి బితికా దేవికి కూడా రాజకీయాల్లో ప్రవేశం ఉంది. అసోం అసెంబ్లీలో సిల్చర్‌ శాసనసభ్యురాలిగా కొంత కాలం పాటు పనిచేశారామె. ఇలా రాజకీయాల్లో రాణించిన తన తల్లిదండ్రుల స్ఫూర్తితో సుస్మిత కూడా వాళ్ల బాటలోనే నడిచారు.

రాజకీయాల్లో పాగా!

బీఏ ఆనర్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్న సుస్మిత.. దిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్య అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం లండన్‌, యూకే వెళ్లారు. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఆమె.. సిల్చర్‌ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కొన్నేళ్ల పాటు ‘ఆలిండియా మహిళా కాంగ్రెస్‌’ అధ్యక్షురాలిగా పనిచేసిన సుస్మిత.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఇక గతేడాది తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆమె.. పశ్చిమ బంగ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్‌ అయ్యారు.

మహిళల ప్రాతినిథ్యం పెరగాలి!

ఇక ఇప్పుడు ‘బాల్య వివాహ నిషేధ (సవరణ) బిల్లు’ను పరిశీలించే పార్లమెంటరీ స్థాయి కమిటీలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళ సుస్మితే కావడం గమనార్హం. ప్రస్తుతం సమాజంలో ఎన్నో మహిళా సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాలంటే చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగడమే కీలకమంటున్నారామె. ‘మహిళల వివాహ వయసును పెంచే దిశగా ప్రవేశపెట్టిన బిల్లును అధ్యయనం చేస్తోంది మా కమిటీ. వాస్తవానికి ఈ కమిటీలో  వివిధ పార్టీల నుంచి మరింతమంది మహిళల ప్రాతినిథ్యం ఉంటే బాగుండేది. ఏదిఏమైనప్పటికీ అన్ని వర్గాల వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడానికి మా కమిటీ కృషి చేస్తుంది. నేను కోరుకునేదొక్కటే.. ఈ ఒక్క కమిటీ అనే కాదు.. ఎక్కువమంది మహిళలు రాజకీయాల్లోకి రావాలి. తద్వారా చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలి. అప్పుడే ఈ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు/అసమానతలకు తగిన పరిష్కార మార్గం దొరుకుతుంది..’ అంటారు సుస్మిత.

మహిళల వివాహ వయసును పెంచే దిశగా ప్రవేశపెట్టిన బిల్లును అధ్యయనం చేసే కమిటీలో మహిళల ప్రాతినిథ్యం తక్కువగా ఉండడాన్ని విమర్శిస్తూ జయా జైట్లీ వంటి ప్రముఖులు గతంలోనే తమ గళాన్ని వినిపించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్