లెక్చరర్‌ని.. అయినా రంగు తక్కువని పెళ్లి సంబంధాలు కుదరడం లేదు..!

నాకు 28 ఏళ్లు. పీజీ చేసి లెక్చరర్‌గా పనిచేస్తున్నా. ఒకవైపు పాఠాలు బోధిస్తూనే మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. అమ్మానాన్నలు మూడేళ్లుగా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే నేను కాస్త రంగు తక్కువగా ఉండడం వల్ల సంబంధాలు కుదరడం లేదు. దీనివల్ల అమ్మానాన్నలు బాధపడుతున్నారు.

Published : 11 Mar 2024 15:40 IST

(Representational Image)

నాకు 28 ఏళ్లు. పీజీ చేసి లెక్చరర్‌గా పనిచేస్తున్నా. ఒకవైపు పాఠాలు బోధిస్తూనే మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. అమ్మానాన్నలు మూడేళ్లుగా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే నేను కాస్త రంగు తక్కువగా ఉండడం వల్ల సంబంధాలు కుదరడం లేదు. దీనివల్ల అమ్మానాన్నలు బాధపడుతున్నారు. దీనికి తోడు ఇటీవలే ఒక విషయం తెలిసింది. నేను కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. కానీ, చదువు పూర్తైన తర్వాత ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. అప్పటినుంచి అతని కాంటాక్ట్‌ కోసం ఎంత ప్రయత్నించినా లభించలేదు. ఇటీవలే ఒక కామన్‌ ఫ్రెండ్‌ కలిస్తే ఆరా తీశాను. అతను ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. నన్ను కేవలం టైంపాస్‌ కోసమే ప్రేమించాడని, నా రంగు గురించి వారితో మాట్లాడేవాడని తెలిసింది. దాంతో నాలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. దానికి తోడు పెళ్లి సంబంధాలు కుదరకపోవడం వల్ల అది రెట్టింపైంది. దీన్నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ ప్రశ్న చదివిన తర్వాత మీ పరిధిలో లేని రంగు గురించి ఎంత బాధ అనుభవిస్తున్నారో అర్థమవుతోంది. దురదృష్టవశాత్తు ఇలాంటి ధోరణులను మన సమాజంలో సాధారణంగానే పరిగణిస్తుంటారు. కానీ, ఇవి వ్యక్తిలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచేలా ప్రేరేపిస్తాయి. అయితే దాని ప్రభావం కేవలం ఆ వ్యక్తి మీదే కాకుండా కుటుంబంపై కూడా పడుతుంది. మీరు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని అర్థమవుతోంది.

మొదటగా మీరు గతాన్ని తలచుకోవడం మానేయండి. మిమ్మల్ని గౌరవించని వ్యక్తుల గురించి ఆలోచించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జీవితంలో ముందుకు సాగాలంటే ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందులో చర్మం రంగుకి ఎటువంటి ప్రాధాన్యం లేదన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ క్రమంలో మీ రంగు గురించి వచ్చే మాటలను మనసులోకి తీసుకోకుండా జాగ్రత్తపడండి. అలాగే మిమ్మల్ని మీరుగా అంగీకరించే శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి.

మీరు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి లెక్చరర్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. అంటే మీరు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా జీవించే స్థాయిలో ఉన్నారు. అలాగే కెరీర్‌ ఉన్నతికై పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఇవన్నీ మీలోని సానుకూలాంశాలు. మీరు ఎప్పుడైతే వీటిపై మరింత దృష్టి కేంద్రీకరిస్తారో వ్యతిరేక భావనలు మీ దరి చేరవు. కాబట్టి, ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ బలాలపై దృష్టి సారించండి. ఇక పెళ్లి విషయానికొస్తే.. రంగు గురించి కాకుండా మిమ్మల్ని మీరుగా గౌరవించే వ్యక్తి కచ్చితంగా తారసపడతారు. అప్పటివరకు వేచి ఉంటూనే లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్