Diwali: పాత ప్రమిదలు, కుందులకు కొత్త మెరుపు!

దీపావళి అంటేనే దీపాల పండగ. ఈ పండక్కి ఇంటిని దీపాలతో శోభాయమానంగా అలంకరించడం మనకు కొత్త కాదు. అయితే ఇంట్లో దీపాలు వెలిగించడానికి వివిధ రకాల కుందుల్ని ఉపయోగిస్తుంటాం.

Published : 10 Nov 2023 18:55 IST

దీపావళి అంటేనే దీపాల పండగ. ఈ పండక్కి ఇంటిని దీపాలతో శోభాయమానంగా అలంకరించడం మనకు కొత్త కాదు. అయితే ఇంట్లో దీపాలు వెలిగించడానికి వివిధ రకాల కుందుల్ని ఉపయోగిస్తుంటాం. ఇంట్లో పూజ కోసం ఇత్తడి, వెండి దీపపు కుందుల్ని ఎంచుకుంటే.. ఆరుబయట వెలిగించడానికి మట్టి, టెర్రకోటాతో తయారుచేసిన ప్రమిదలు, కుందులు ఉపయోగిస్తుంటాం. ఈ క్రమంలో పూజ కోసం రోజూ ఉపయోగించే కుందులైనా, ఏడాదికోసారి వాడే మట్టి దీపాలైనా.. ఈ పండక్కి వాటిని కొత్త వాటిలా మెరిపించాలని ఆరాటపడుతుంటాం. అందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉపకరిస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

రోజూ పూజ కోసం ఉపయోగించే ఇత్తడి, వెండి లోహపు దీపాలు తరచూ శుభ్రం చేసినా.. కొన్నాళ్లకు నల్లగా మారడం గమనిస్తుంటాం. అలాగే నూనె పూర్తిగా తొలగిపోకపోవడం వల్ల వాటిపై జిడ్డు పేరుకుపోతుంది. ఇక ఏటా దీపావళి కోసం వాడి పక్కన పెట్టే మట్టి/టెర్రకోటా దీపపు కుందులూ జాగ్రత్తగా భద్రపరిచినా ఏడాది తిరిగే సరికి వాటిపై దుమ్ము పేరుకుపోతుంది. ఇలా వీటిపై చేరిన దుమ్ము, జిడ్డు, నలుపుదనాన్ని తొలగించి.. తిరిగి వాటిని మెరిపించాలంటే వంటింట్లో లభించే కొన్ని పదార్థాలు ఉపయోగపడతాయి.

ఇత్తడి పుత్తడిలా..!

దీపాలు వెలిగించడానికి వాడే నూనె, వాతావరణంలోని ఆక్సిజన్ కారణంగా.. నల్లగా, జిడ్డుగా మారిన ఇత్తడి దీపపు కుందుల్ని శుభ్రం చేయడానికి వెనిగర్‌ చక్కగా పనిచేస్తుంది. ఈ క్రమంలో మూడు టేబుల్‌స్పూన్ల వెనిగర్‌కు టేబుల్‌స్పూన్‌ ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని కుందులకు పట్టించి కాసేపు అలాగే వదిలేయాలి. ఆపై స్క్రబ్బర్‌తో నెమ్మదిగా, మృదువుగా రుద్దుతూ కుళాయి నీటి కింద శుభ్రం చేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి. చివరగా వీటిని పొడి వస్త్రంతో తుడిచి ఆరబెట్టాలి.

వెనిగర్‌, నిమ్మరసం కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని కుందులపై పూసి రుద్దుతూ శుభ్రం చేయాలి. ఫలితంగా వీటిలోని ఆమ్ల గుణాలు జిడ్డుదనం, నల్ల మరకల్ని తొలగిస్తాయి.

ముందుగా ఇత్తడి కుందుల్ని సబ్బు/డిటర్జెంట్‌తో శుభ్రం చేయాలి. ఆపై కొద్దిగా టూత్‌పేస్ట్‌ తీసుకొని దాన్ని కుందులపై పరచుకునేలా అప్లై చేయాలి. కాసేపు పక్కన పెట్టి.. పొడి వస్త్రంతో రుద్దుతూ తుడిచేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి.

బియ్యప్పిండి లేదా శెనగపిండి, నీళ్లు, వెనిగర్‌.. ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. కుందులపై మరకలు/జిడ్డుదనం కాస్త ఎక్కువగా ఉన్న చోట ఈ పేస్ట్‌ని మందపాటి లేయర్‌లా పూయాలి. పూర్తిగా ఆరిపోయాక సబ్బు లేదా డిటర్జెంట్‌తో కడిగి పొడి వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది.

ఒక కాటన్‌ బాల్‌ని నిమ్మరసంలో ముంచి ఇత్తడి కుందులపై లేయర్‌లా పూసి కాసేపు రుద్దాలి. ఆపై గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేస్తే వాటికి పూర్వపు మెరుపు వస్తుంది.

టొమాటో కెచప్‌ని ఇత్తడి కుందులపై లేయర్‌లా పూసి మృదువైన టూత్‌బ్రష్‌తో గుండ్రంగా రుద్దుతూ శుభ్రం చేయాలి. తద్వారా ఇందులోని ఆమ్ల గుణాలు వాటిపై పేరుకున్న జిడ్డుదనం, నల్లటి మరకల్ని తొలగిస్తాయి. ఆపై నీటితో కడిగి పొడి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.

వెండి వెలుగులు!

వెండి దీపాలు రోజూ వాడినా, పక్కన పెట్టినా.. గాలి, వెలుతురు కారణంగా కొన్నాళ్లకు అవి రంగు మారడం, నల్లబడడం చూస్తుంటాం. అయితే వాటిని తిరిగి మెరిపించడంలో బేకింగ్‌ సోడా చక్కగా పనిచేస్తుంది. అల్యూమినియం ఫాయిల్‌పై కాస్త బేకింగ్‌ సోడా వేసి.. వెండి కుందులపై రుద్దాలి. ఆపై చల్లటి నీటితో కడిగేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి.

అరకప్పు వెనిగర్‌, అరకప్పు గోరువెచ్చటి నీళ్లు, రెండు టేబుల్‌స్పూన్ల బేకింగ్‌ సోడా.. ఈ మూడింటినీ ఒక బౌల్‌లో కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో వెండి కుందుల్ని వేసి మూడు గంటల పాటు అలాగే వదిలేయాలి. దీంతో వాటిపై నల్లటి మరకలు, జిడ్డుదనం తొలగిపోతాయి. ఆపై డిటర్జెంట్‌తో మరోసారి కడిగేస్తే ఫలితం ఉంటుంది.

టొమాటో కెచప్‌ లేదా టూత్‌పేస్ట్‌ని వెండి కుందులపై పూసి.. అరగంట పాటు వదిలేయాలి. ఆపై పొడి వస్త్రంతో రుద్దుతూ తుడిచేస్తే అవి తళతళా మెరిసిపోతాయి.

కొద్దిగా హ్యాండ్‌ శానిటైజర్‌ని ఒక క్లాత్‌పై వేసి.. దాంతో వెండి కుందుల్ని పాలిష్‌ చేసినట్లుగా రుద్దాలి. ఇందులోని ఆల్కహాల్‌ వాటిపై ఉన్న మరకలు, జిడ్డుదనాన్ని తొలగించి తిరిగి కొత్తవాటిలా మెరిపిస్తుంది.

వేడినీళ్లలో కొద్దిగా డిటర్జెంట్‌ పౌడర్‌ వేసి కలపాలి. ఈ ద్రావణంలో వెండి కుందుల్ని పది నిమిషాల పాటు ఉంచి.. ఆపై టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా రుద్దుతూ శుభ్రం చేస్తే సరిపోతుంది.

మట్టివీ మెరుస్తాయిలా!

మట్టి/టెర్రకోటా దీపపు కుందులపై పేరుకున్న దుమ్ము, జిడ్డు అంత త్వరగా పోవు. ఈ క్రమంలో అరకప్పు నీటిలో టీస్పూన్‌ డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌, కొన్ని చుక్కల వెనిగర్‌ వేసి.. ఈ మిశ్రమాన్ని కుందులపై పోసి టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా రుద్దడం వల్ల జిడ్డు పోతుంది.

పెయింట్‌, రాళ్లు, బీడ్స్‌తో అలంకరించిన మట్టి/టెర్రకోటా కుందులు కూడా కొంతమంది శుభ్రం చేయాలనుకుంటారు. కానీ వీటిని నీళ్లు, ఇతర ద్రావణాలతో శుభ్రం చేస్తే అవి డ్యామేజ్‌ అయ్యే ఆస్కారం ఉంటుంది. అందుకే మినీ వ్యాక్యూమ్ క్లీనర్‌కు చిన్న బ్రష్‌ని అటాచ్‌ చేసి.. దాంతో క్లీన్‌ చేస్తే సందుల్లో ఇరుక్కున్న దుమ్ము వదిలిపోతుంది. ఇక జిడ్డు పోవాలంటే గోరువెచ్చటి డిటర్జెంట్‌ నీటిలో ముంచిన క్లాత్‌తో నెమ్మదిగా తుడిచేస్తే సరిపోతుంది. కావాలంటే వీటిపై నుంచి మరో కోట్‌ పెయింట్‌ వేస్తే అవి కొత్తవాటిలా మారతాయి.

టీస్పూన్‌ గళ్లుప్పు, మూడు టీస్పూన్ల వెనిగర్‌.. ఈ రెండింటినీ పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుందులకు పూసి కాసేపు వదిలేయాలి. ఆపై మెత్తటి క్లాత్‌తో రుద్దుతూ చల్లటి నీటితో కడిగేస్తే మట్టి/టెర్రకోటా దీపపు కుందులూ కొత్త వాటిలా మారతాయి.

చిన్న బౌల్‌లో నీళ్లు తీసుకొని అందులో రెండుమూడు టీస్పూన్ల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో దీపపు కుందుల్ని వేసి పది నిమిషాలు నానబెట్టాలి. కావాలంటే ఈ మిశ్రమంలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఆపై ఈ కుందుల్ని మృదువైన బ్రష్‌తో రుద్దుతూ శుభ్రం చేస్తే వాటిపై ఉన్న మురికి, జిడ్డు తొలగిపోతాయి.

ఇలా మట్టి/టెర్రకోటా దీపాల్ని/కుందుల్ని శుభ్రం చేశాక ఎండలో ఆరబెట్టి వాడుకోవాలి.. అలాగే తిరిగి భద్రపరచుకునే ముందు మరోసారి శుభ్రం చేసి.. బబుల్‌ ర్యాప్‌ కవర్‌లో చుట్టి కాటన్‌ బాక్స్‌లో పెట్టి భద్రపరచుకోవాలి. ఇక లోహపు కుందుల్ని మస్లిన్‌ క్లాత్‌లో చుట్టి భద్రపరిస్తే.. తేమ, గాలి తగలకుండా.. తద్వారా అవి రంగు మారకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్