భుజంలోని నరాలు దెబ్బతిన్నాయి... కుస్తీ మర్చిపోవాలన్నారు!

కుస్తీ పోటీలంటే భారతదేశంలో అందరికీ గుర్తుకు వచ్చేది హరియాణాకు చెందిన ‘ఫోగట్‌ కుటుంబమే’. గీత, బబిత, వినేశ్‌, ప్రియాంక, రితూ.. ఇలా ఈ ఐదుగురు ఫోగల్‌ సిస్టర్స్‌తో పాటు ఆ రాష్ట్రం నుంచి మరికొంతమంది రెజ్ల్లర్లు కూడా ఉన్నారు. అయితే ఇదే రాష్ట్రానికి చెందిన ఓ యంగ్‌ రెజ్లర్‌ కొద్దిరోజుల క్రితం రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ను ఓడించి సంచలనం సృష్టించింది.

Updated : 18 Jul 2021 15:06 IST

Photo: Twitter

కుస్తీ పోటీలంటే భారతదేశంలో అందరికీ గుర్తుకు వచ్చేది హరియాణాకు చెందిన ‘ఫోగట్‌ కుటుంబమే’. గీత, బబిత, వినేశ్‌, ప్రియాంక, రితూ.. ఇలా ఈ ఐదుగురు ఫోగల్‌ సిస్టర్స్‌తో పాటు ఆ రాష్ట్రం నుంచి మరికొంతమంది రెజ్ల్లర్లు కూడా ఉన్నారు. అయితే ఇదే రాష్ట్రానికి చెందిన ఓ యంగ్‌ రెజ్లర్‌ కొద్దిరోజుల క్రితం రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు చేసుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమే 19 ఏళ్ల సోనమ్‌ మలిక్‌.

నేలపైనే శిక్షణ!

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో అదృష్టం పరీక్షించుకోనున్న నలుగురు మహిళా రెజ్లర్లలో సోనమ్‌ కూడా ఒకరు. 62 కిలోల విభాగంలో ఆమె పోటీ పడనుంది. ఈ నేపథ్యంలోనే అతిపిన్న వయసులో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించిందీ యంగ్‌ సెన్సేషన్‌. 2002 ఏప్రిల్‌ 15న సోనిపట్‌ జిల్లాలోని మదీనా గ్రామంలో పుట్టింది సోనమ్‌. తండ్రి రాజేందర్‌ మలిక్‌తో పాటు కుటుంబంలో చాలామందికి కుస్తీలో అనుభవం ఉండడంతో ఆమె కూడా అదే ఆటపై ఆసక్తి పెంచుకుంది. తండ్రి స్నేహితుడు అజ్మెర్‌ మాలిక్‌ గ్రామంలోనే రెజ్లింగ్‌ అకాడమీ ప్రారంభించడంతో అక్కడకు వెళ్లి రెజ్లింగ్‌లో ఓనమాలు నేర్చుకుంది. అయితే ఆ అకాడమీ మొదలైన రోజుల్లో మ్యాట్‌ ఉండేది కాదు. దీంతో నేలపైనే శిక్షణ పొందేది సోనమ్‌. వర్షాకాలంలో అయితే ఆ నేలంతా బురదమయంగా మారిపోయేది.  దీంతో రోడ్లమీద తన ప్రాక్టీస్‌ను కొనసాగించేదీ యువ రెజ్లర్‌.

ఆ పతకంతో ఆత్మవిశ్వాసం!

కోచ్‌తో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బలంగా ఉండడంతో రెజ్లింగ్‌లో రాటు దేలిపోయింది సోనమ్‌. ఈ క్రమంలోనే 2016 నేషనల్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెల్చుకుంది. ఇది తనలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టిందంటోందామె. ఇక సోనమ్‌ సత్తా పూర్తిగా బయటపడిన సంవత్సరం 2017. ఆ ఏడాది నేషనల్‌ క్యాడెట్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన ఆమె.. ఆ తర్వాత జరిగిన వరల్డ్‌ స్కూల్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ గెల్చుకుంది. ఆపై ఆసియా క్యాడెట్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం, వరల్డ్‌ క్యాడెట్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. దీంతో కుస్తీ పోటీల్లో సోనమ్‌ పేరు మార్మోగిపోయింది.

కుస్తీని మర్చిపోవాలన్నారు!

ఇక అంతా బాగుందనుకున్న సమయంలో సోనమ్‌కు అయిన ఒక గాయం ఆమె కెరీర్‌ను కుదిపేసే పరిస్థితికి తీసుకొచ్చింది. 2017లో ఓ టోర్నీలో పోటీ పడుతున్న సమయంలో ఆమె తీవ్రంగా గాయపడింది. కుడిభుజంలో నరాలు దెబ్బతిని మొత్తం చేయి పనిచేయకుండా పోయేంత పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు కూడా ఇక ఆమె రెజ్లింగ్‌ను మర్చిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో సుమారు ఒకటిన్నర సంవత్సరం పాటు ఆటకు దూరంగా ఉండిపోయిందీ యువ రెజ్లర్‌. ఆ సమయంలో తండ్రి, కోచ్‌లు ఆమెకు అండగా నిలిచారు. ధైర్యం చెప్పారు. వారి సహకారంతోనే మళ్లీ మ్యాట్‌పైకి బలంగా దూసుకొచ్చింది సోనమ్‌. 2018లో ఆసియా, వరల్డ్‌ క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు గెల్చుకుంది. ఆ మరుసటి ఏడాదే వరల్డ్‌ క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి స్వర్ణంతో మెరిసింది. ఇక 2020లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ను వరుసగా రెండుసార్లు ఓడించి అందరి దృష్టిని ఆకర్షించిందీ రెజ్లింగ్‌ క్వీన్‌.

ఆరోజు ఎవరినైనా ఓడిస్తాను!

ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా ఆసియా ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ పోటీల్లో బరిలోకి దిగింది సోనమ్‌. కజకిస్థాన్‌ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 62 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరి టోక్యో బెర్తును ఖాయం చేసుకుంది. ‘ఒలింపిక్స్‌లో పోటీ ఎక్కువగానే ఉంటుంది. నేను ఫేవరెట్‌ కాదని కూడా నాకు తెలుసు. అయితే నాదైన రోజు ఎవరినైనా ఓడిస్తాను’ అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోందీ యువ రెజ్లర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్