నా జుట్టు మెరుపుకి కారణమిదే!

సాధారణంగా తలస్నానం ఎన్నిరోజులకోసారి చేస్తారు? జుట్టుతత్వాన్ని బట్టి కొందరు రెండు, మూడు రోజులకోసారి.. మరికొందరు వారానికోసారి మాత్రమే చేస్తుంటారు. అంతే కానీ రోజూ తలస్నానం చేసేవాళ్లు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన జాబితాలో తాను ఉన్నానంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. కుదుళ్లను జిడ్డుగా ఉంచుకోవడం తనకు ఏ మాత్రం ఇష్టం ఉండదంటోన్న ఈ అందాల తార.. తప్పనిసరిగా రోజూ తలస్నానం చేస్తానంటోంది. ఈక్రమంలో తన అందం, కురుల సంరక్షణకు సంబంధించి కొన్ని చిట్కాలను షేర్‌ చేసుకుంది.

Published : 05 Jul 2021 18:51 IST

సాధారణంగా తలస్నానం ఎన్నిరోజులకోసారి చేస్తారు? జుట్టుతత్వాన్ని బట్టి కొందరు రెండు, మూడు రోజులకోసారి.. మరికొందరు వారానికోసారి మాత్రమే చేస్తుంటారు. అంతే కానీ రోజూ తలస్నానం చేసేవాళ్లు అరుదుగా ఉంటారు. ఆ అరుదైన జాబితాలో తాను ఉన్నానంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. కుదుళ్లను జిడ్డుగా ఉంచుకోవడం తనకు ఏ మాత్రం ఇష్టం ఉండదంటోన్న ఈ అందాల తార.. తప్పనిసరిగా రోజూ తలస్నానం చేస్తానంటోంది. ఈక్రమంలో తన అందం, కురుల సంరక్షణకు సంబంధించి కొన్ని చిట్కాలను షేర్‌ చేసుకుంది.

ఇవే నా బ్యూటీ సీక్రెట్స్‌!

సినిమాలతోనే కాదు.. తన సోషల్‌ మీడియా పోస్టులతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రకుల్‌. టాలీవుడ్‌కు సంబంధించి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే నటీమణుల జాబితాలో ముందుండే ఈ భామ.. వ్యాయామాలు, యోగాసనాలు, ఆరోగ్యకరమైన రెసిపీలకు సంబంధించిన విషయాలను ఫొటోలు, వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటుంది. అలా తాజాగా తన చర్మ, జుట్టు రహస్యాలను పంచుకుందీ టాలీవుడ్‌ అందం.

అందం కోసం అమ్మ చేతి వంట!

మనం తీసుకునే ఆహారం, పాటించే జీవనశైలే మన అందాన్ని రెట్టింపు చేస్తుందని చెబుతోంది రకుల్‌. ‘హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, అధిక వేడి.. ఆడవారి చర్మ సౌందర్యానికి ఇవే ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ప్రత్యేకించి మొటిమలు, మచ్చలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. అందుకే వీటి విషయంలో ముందు నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అదృష్టవశాత్తూ నాకు ఎక్కువగా ఇలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఇక జంక్‌ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే ఆ ప్రభావం కచ్చితంగా చర్మ సౌందర్యంపై పడుతుంది. అందుకే నేను ఎక్కువగా బయటి ఆహారానికి ప్రాధాన్యమివ్వను. ఇంట్లో అమ్మ, అమ్మమ్మ చేసిన వంటకాలే తింటుంటాను. చాలామంది చర్మ సౌందర్యం కోసం రకరకాల ఉత్పత్తులు, ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేస్తుంటారు. కానీ నేను వాటికి కాస్త దూరంగానే ఉంటాను. చివరిసారిగా గతేడాది లాక్‌డౌన్‌లో కేవలం ఒకసారి మాత్రమే ఫేస్‌మాస్క్‌ వేసుకున్నా’.

అలా జుట్టురాలడం తగ్గిపోయింది!

‘సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మొదట్లో జుట్టు రాలే సమస్య నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. అప్పుడు మెంతులు, శీకాకాయలతో తయారుచేసుకున్న హెయిర్‌ మాస్క్‌ నాకు బాగా సహకరించింది. దాంతో కొద్దిరోజుల్లోనే ఈ సమస్య అదుపులోకి వచ్చింది. ఇక అమ్మ చెప్పిన అరటిపండు-కోడిగుడ్డు హెయిర్‌ మాస్క్‌ను కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. అలాగే కురుల సంరక్షణ విషయంలో బయట దొరికే ఉత్పత్తుల కంటే ఇంట్లో సహజంగా తయారుచేసుకునే వాటికే ప్రాధాన్యమిస్తాను. హెయిర్‌ డ్రయర్స్‌, స్టైలింగ్‌ ఉత్పత్తులకు వీలైనంత దూరంగా ఉంటాను. ఇక చర్మం లాగే శిరోజాల సంరక్షణకూ ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి’.

అందుకే రోజూ తలస్నానం చేస్తాను!

‘రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారుతుందని, కురుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చాలామంది అంటుంటారు. అది పెద్ద అపోహని నా అభిప్రాయం. కుదుళ్లు జిడ్డుగా ఉండడం నాకు ఏ మాత్రం ఇష్టం ఉండదు. అందుకే వర్కవుట్‌ పూర్తయ్యాక రోజూ తప్పనిసరిగా తలస్నానం చేస్తాను’ అని తన హెయిర్ కేర్‌ సీక్రెట్‌ని పంచుకుంది రకుల్‌.

ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి?

సాధారణంగా జుట్టుతత్వాన్ని బట్టి ఇన్ని రోజులకోసారి అని తలస్నానం చేయాల్సి ఉంటుంది. కర్లీ హెయిర్‌ ఉన్న వారు వారంలో ఒకటి లేదా రెండుసార్లు, పొడి జుట్టు ఉన్న వారు వారానికి రెండు సార్లు, ఆయిలీ హెయిర్‌ ఉన్న వారు రోజు విడిచి రోజు తలస్నానం చేయాలంటున్నారు నిపుణులు. అయితే కుదుళ్లు మరీ జిడ్డుగా ఉంటే గాఢత తక్కువ గల షాంపూలతో రోజూ తలస్నానం చేయాల్సిందేనంటున్నారు. అలా చేయకపోతే వెంట్రుకల్లో దుమ్ము, ధూళి చేరి చుండ్రు లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కుదుళ్లు జిడ్డుగా ఉండడం వల్ల జుట్టు సహజసిద్ధమైన మెరుపును కోల్పోయి నిర్జీవంగా, బలహీనంగా మారుతుంది. తద్వారా జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంటుంది.

ఇక వ్యాయామాలు చేసే క్రమంలో బాగా చెమటపడుతుంది. కాబట్టి ఇలాంటివారు రోజూ తలస్నానం చేయాల్సిందేనంటున్నారు నిపుణులు. గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు కూడా కుదుళ్లు జిడ్డుగా మారిపోతాయి. అలాంటప్పుడు వెంట్రుకలను క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలి. లేకపోతే జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.

గమనిక: సాధారణంగా ఒక్కొక్కరి జుట్టుతత్వం ఒక్కోలా ఉంటుంది. దాన్ని బట్టే ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి? ఎలాంటి హెయిర్‌ కేర్‌ టిప్స్‌ పాటించాలి? అన్న విషయాలు ఆధారపడి ఉంటాయి. మీ జుట్టు సంరక్షణ విషయంలో ఇంకా మీకేమైనా సందేహాలు, సమస్యలుంటే సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.. అంతేకానీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోకండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్