జుట్టు తడిగా ఉండగానే నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!

రోజువారీ పనుల్లో పడిపోయి, వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉన్న మహిళలకు తమకంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి కూడా సమయం సరిపోదు. కనీసం తమ అందాన్ని పరిరక్షించుకోవడానికి కూడా వారికి టైముండదు! ఈ క్రమంలో చివరికి తల స్నానాన్ని కూడా వాయిదా వేసే వారూ లేకపోలేదు. ఇలాంటి వారు ఏ రాత్రికో, పడుకునే ముందో తలస్నానం చేసి ఆరబెట్టుకోవడానికి సమయం లేక.. జుట్టు తడిగా ఉండగానే నిద్ర పోతుంటారు.

Published : 14 Feb 2022 19:59 IST

రోజువారీ పనుల్లో పడిపోయి, వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉన్న మహిళలకు తమకంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి కూడా సమయం సరిపోదు. కనీసం తమ అందాన్ని పరిరక్షించుకోవడానికి కూడా వారికి టైముండదు! ఈ క్రమంలో చివరికి తల స్నానాన్ని కూడా వాయిదా వేసే వారూ లేకపోలేదు. ఇలాంటి వారు ఏ రాత్రికో, పడుకునే ముందో తలస్నానం చేసి ఆరబెట్టుకోవడానికి సమయం లేక.. జుట్టు తడిగా ఉండగానే నిద్ర పోతుంటారు. మీరూ ఇలాగే చేస్తున్నారా? అయితే మీ జుట్టు ఆరోగ్యాన్ని మీరే చేజేతులా దెబ్బ తీస్తున్నారన్నమాట! అంతేకాదు.. ఈ అలవాటు మన రోగనిరోధక శక్తి పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. మరి, తడి జుట్టుతో అలాగే నిద్రపోవడం వల్ల సౌందర్యపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అలా జరగకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? రండి.. తెలుసుకుందాం..

తడిసిన జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది.. అందుకే తలస్నానం చేసిన వెంటనే దువ్వకూడదని చెబుతుంటారు సౌందర్య నిపుణులు. ఒకవేళ అలా చేస్తే వెంట్రుకలు తెగిపోవడం, ఎక్కువ జుట్టు రాలిపోవడం.. వంటి సమస్యలొస్తాయి. అదేవిధంగా జుట్టు తడిగా ఉన్నప్పుడు అలాగే నిద్రపోవడం వల్ల కూడా పలు రకాల సౌందర్య, ఆరోగ్య సమస్యలొస్తాయట! అవేంటంటే..!

అలా జుట్టు తెగిపోతుంది!

సాధారణంగా జుట్టు తడిగా ఉన్నప్పుడు ముడుచుకోకుండా అలాగే వదిలేస్తుంటాం. పడుకోవడానికి ముందు తలస్నానం చేసినా జుట్టు విరబోసుకొనే పడుకుంటాం. ఈ క్రమంలో బెడ్‌పై అటూ ఇటూ దొర్లడం వల్ల జుట్టు, దిండుతో రాపిడికి గురవుతుంది. ఫలితంగా అప్పటికే బలహీనంగా ఉండడం వల్ల వెంట్రుకలు సులభంగా తెగిపోవడం, చిట్లిపోవడం.. వంటివి జరుగుతాయంటున్నారు నిపుణులు. అందుకే ఎంత ఆలస్యమైనా సరే.. పడుకునే ముందు కాస్త సమయం కేటాయించి జుట్టును కాటన్‌ టవల్‌తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలని సూచిస్తున్నారు.

జలుబు చేస్తుందట!

తడిగా ఉన్న జుట్టును బిగుతుగా ముడేసుకోవడం, జడ వేసుకోవడం.. వంటివి చేస్తే కాసేపటికే తలంతా బరువుగా అనిపిస్తుంటుంది. అందుకే తలస్నానం చేశాక జుట్టును పొడిగా తుడుచుకోవాలని లేదంటే జలుబు చేస్తుందని చెబుతుంటారు మన ఇళ్లల్లో ఉండే పెద్దవారు. కానీ వారి మాటల్ని మనలో చాలామంది పెడచెవిన పెడుతుంటారు. అయితే ఇలా పెద్దలు చెప్పిన మాట అక్షరాలా నిజమంటున్నారు నిపుణులు. అప్పటికే జుట్టు తడిగా ఉండడం, రాత్రుళ్లు వాతావరణం కూడా చల్లగా ఉండడంతో.. ఈ రెండింటి ప్రభావంతో జలుబు చేసే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. తడి జుట్టు వాతావరణంలోని ఫ్లూ వైరస్‌ను త్వరగా ఆకర్షించడం కూడా ఇందుకు మరో కారణమంటున్నారు. కాబట్టి తడి జుట్టుతోనే పడుకోకుండా ముందుగా ఆరబెట్టుకోవాలని సూచిస్తున్నారు.

చుండ్రు వేధిస్తుంది!

తడి జుట్టుతో అలాగే పడుకోవడం వల్ల చుండ్రు సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో జుట్టుకు సరిగ్గా గాలి తగలక కుదుళ్లలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు రావడమే ఇందుకు కారణమంటున్నారు. దీంతో పాటు కేశాల్లోని తడిదనం వల్ల దిండు కూడా తేమగా అయిపోతుంది. తద్వారా వాతావరణంలోని బ్యాక్టీరియా దిండుకు త్వరగా ఆకర్షితమవుతుంది. ఇలా కుదుళ్లలోని ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, వాతావరణంలోని బ్యాక్టీరియా.. ఈ రెండూ దిండు ద్వారా మన చర్మానికి అంటుకొని మొటిమలకు కారణమవుతాయట! అందుకే సాధ్యమైనంత వరకు జుట్టు ఆరబెట్టుకున్నాకే నిద్రకు ఉపక్రమించాలంటున్నారు నిపుణులు.

ఈ సమస్యలు కూడా!

* జుట్టు తేమగా ఉన్నప్పుడు దిండుపై పడుకోవడం వల్ల ఆ తడిదనంతో పాటు జుట్టులోని సహజసిద్ధమైన నూనెలు కూడా దిండులోకి ఇంకుతాయి. ఫలితంగా కేశాలు తమ సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవమైపోతాయి.

* తడి జుట్టుతో అలాగే నిద్రపోవడం వల్ల రోగ నిరోధక శక్తి పైనా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. దీనికి తోడు ఏసీ గదుల్లో పడుకుంటే ఆ చల్లదనం, జుట్టులోని తేమ కలగలిసి తలనొప్పి, జలుబు.. వంటి ఇతరత్రా అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* జుట్టును సరిగ్గా ఆరబెట్టుకోకుండా అలాగే వదిలేసుకొని నిద్ర పోవడం వల్ల జుట్టు చిక్కులు కడుతుంది. ఫలితంగా మరుసటి రోజు దువ్వినప్పుడు ఎక్కువ జుట్టు రాలిపోతుంది.

ఇవి గుర్తుపెట్టుకోండి!

తడి జుట్టుతో పడుకొని కేశ సౌందర్యాన్ని దెబ్బతీయడం కంటే పడుకునే ముందు జుట్టు ఆరబెట్టుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

* వీలైతే సాయంత్రమే తలస్నానం చేయడం మంచిది. తద్వారా రాత్రి పడుకునే సమయానికి కేశాలు సహజసిద్ధంగా ఆరిపోతాయి. కాబట్టి జుట్టు డ్యామేజ్‌ కాకుండా కాపాడుకోవచ్చు.

* తలస్నానం చేశాక కాటన్‌ టీ-షర్ట్‌ లేదంటే కాటన్‌ టవల్‌తో జుట్టును పొడిగా తుడుచుకోవాలి. ఇలా కాటన్ వస్త్రాన్ని ఉపయోగిస్తే వెంట్రుకల్లోని తేమ దీనికి త్వరగా ఇంకి జుట్టు ఆరిపోతుంది.

* వెంట్రుకలు దృఢత్వాన్ని కోల్పోకూడదంటే తలస్నానం చేశాక కండిషనర్‌ రాసుకోవడం మర్చిపోవద్దు.

* ఒకవేళ పడుకునే ముందే తలస్నానం చేయాల్సి వస్తే సిల్క్‌ దిండు కవర్‌ను ఉపయోగించమంటున్నారు నిపుణులు. తద్వారా దిండుకు, వెంట్రుకలకు మధ్య రాపిడి తక్కువగా జరిగి జుట్టు డ్యామేజ్‌ కాకుండా కొంత వరకు రక్షించుకోవచ్చు.

* రాత్రుళ్లు జుట్టు ఆరబెట్టుకునే సమయం లేని వారు తక్కువ వేడితో బ్లో-డ్రయర్స్‌ ఉపయోగించి వెంట్రుకల్ని ఆరబెట్టుకుంటే డ్యామేజ్‌ను తగ్గించచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

* తడి జుట్టుకు కొబ్బరి నూనె రక్షణ కవచంలా పని చేస్తుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అందుకే తప్పని పరిస్థితుల్లో తడి జుట్టుతోనే నిద్రపోవాలనుకునే వారు కొన్ని చుక్కల కొబ్బరి నూనెను జుట్టు చివర్లకు రాసుకుంటే సరి!

* పడుకునే ముందు తడి జుట్టును విరబోసుకోవద్దంటున్నారని జడ వేసుకోవడం, బిగుతుగా ముడేసుకోవడం చేశారనుకోండి.. దానివల్లా వెంట్రుకలు తెగిపోవడం, నిర్జీవమైపోవడం వంటివి జరుగుతాయంటున్నారు నిపుణులు.

* దిండు కవర్లను ఎప్పటికప్పుడు మార్చడం వల్ల కూడా వాటిపై చేరిన బ్యాక్టీరియా, ఫంగస్‌ల నుంచి కుదుళ్లను, ముఖ చర్మాన్ని కాపాడుకోవచ్చు.

ఏదేమైనా జుట్టు తడిగా ఉన్నప్పుడు అలాగే పడుకోవడం వల్ల అటు సౌందర్యపరంగా పలు సమస్యలు తలెత్తడంతో పాటు ఇటు ఆరోగ్యానికీ హానికరమే అన్న విషయం అర్థమైంది కదా. కాబట్టి మరోసారి ఈ అలవాటును పునరావృతం చేయకుండా జాగ్రత్తపడదాం. అలాగే జుట్టు త్వరగా ఆరిపోవాలని బ్లో-డ్రయర్స్‌ వాడడం కూడా కరక్ట్‌ కాదు. కాబట్టి మరీ అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధ్యమైనంత వరకు సహజసిద్ధంగానే తడి జుట్టును ఆరబెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం.. కేశాలను సంరక్షించుకుందాం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్