Pad Woman: అందుకే మహిళల ఇష్ట ‘సఖి’.. ఆమె!

ఇప్పుడంటే శ్యానిటరీ న్యాప్‌కిన్లు, ట్యాంపూన్స్‌, మెన్‌స్ట్రువల్‌ కప్స్‌.. ఇలా బోలెడన్ని ఆప్షన్లున్నాయి. అదే ఓ దశాబ్దకాలం వెనక్కి వెళ్తే.. ఇన్ని ఆప్షన్లు, ఇప్పుడున్న సౌకర్యాలు అప్పుడు లేవనే చెప్పచ్చు. అందుకే ఆ రోజుల్లో చాలామంది నెలసరిని శాపంగా భావించేవారు. తమకు తెలిసిన అపరిశుభ్రమైన పద్ధతుల్ని పాటిస్తూ లేనిపోని అనారోగ్యాల్ని....

Updated : 12 Jul 2022 12:54 IST

(Photos: Facebook)

ఇప్పుడంటే శ్యానిటరీ న్యాప్‌కిన్లు, ట్యాంపూన్స్‌, మెన్‌స్ట్రువల్‌ కప్స్‌.. ఇలా బోలెడన్ని ఆప్షన్లున్నాయి. అదే ఓ దశాబ్దకాలం వెనక్కి వెళ్తే.. ఇన్ని ఆప్షన్లు, ఇప్పుడున్న సౌకర్యాలు అప్పుడు లేవనే చెప్పచ్చు. అందుకే ఆ రోజుల్లో చాలామంది నెలసరిని శాపంగా భావించేవారు. తమకు తెలిసిన అపరిశుభ్రమైన పద్ధతుల్ని పాటిస్తూ లేనిపోని అనారోగ్యాల్ని కొనితెచ్చుకునే వారు. ఈ పరిస్థితినే మార్చాలనుకున్నారు గుజరాత్‌లోని వదోదరకు చెందిన స్వాతి బెదేకర్‌. వృత్తిరీత్యా సైన్స్‌ టీచర్‌ అయిన ఆమె.. తక్కువ ధరకే, అదీ పర్యావరణహితమైన శ్యానిటరీ ప్యాడ్లు తయారుచేయడం ప్రారంభించారు. ఇంతింతై అన్నట్లుగా.. ఇప్పుడిది దేశవ్యాప్తంగా వందలాది గ్రామాలకు విస్తరించింది. ఇలా తన కృషితో ఎంతోమంది మహిళలకు ఆరోగ్యాన్ని అందిస్తూ, మరెంతోమందికి ఉపాధిని కల్పిస్తోన్న ఈ ప్యాడ్‌ ఉమన్‌ సక్సెస్‌ స్టోరీ మీకోసం..

క్లాత్, గడ్డి.. మొదలైనవన్నీ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు నెలసరి సమయంలో రక్తస్రావాన్ని అదుపు చేసుకోవడానికి ఉపయోగించిన వస్తువులు. నిజానికి ఇవన్నీ ప్రమాదకరమే! ఈ ఐదు రోజులు రక్షణ ఇవ్వకపోగా.. ఇతర ఇన్ఫెక్షన్లకు ఇవి కారణమవుతుంటాయి. వృత్తిరీత్యా సైన్స్‌ టీచర్‌ అయిన స్వాతికి ఈ విషయం తెలుసుకోవడం, అర్థం చేసుకోవడానికి పెద్ద సమయం పట్టలేదు. పైగా ఈ వాస్తవాలు తెలుసుకొని విస్మయానికి గురైన ఆమె.. ఈ పరిస్థితిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే 2010లో ‘సఖి ప్యాడ్స్‌’ పేరుతో అక్కడి దేవ్‌ఘర్‌ బరియా గ్రామంలో శ్యానిటరీ ప్యాడ్స్‌ని తయారుచేసే తొలి యూనిట్‌ని ప్రారంభించారామె.

మొదట వాళ్లు నమ్మలేదు!

గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిలో ఒక రకమైన చాదస్తం ఉంటుంది. వాళ్లకు తెలిసిందే నిజమనుకుంటారు. ఇతరులు మంచి చెప్పినా పట్టించుకోరు. తమ శ్యానిటరీ న్యాప్‌కిన్ల గురించి గ్రామీణ మహిళలకు వివరించే క్రమంలో తనకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయంటున్నారు స్వాతి.

‘గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు శ్యానిటరీ న్యాప్‌కిన్లపై అవగాహన లేమితో వివిధ రకాల పాత కాలపు పద్ధతులు అనుసరిస్తుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి పూడ్చలేనంత నష్టం వాటిల్లుతుంది. మరోవైపు అందుబాటులో ఉన్న ప్యాడ్స్‌లో ప్లాస్టిక్ వంటి హానికారకాలు ప్రత్యుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇక చుట్టుపక్కల గ్రామాల్లో నెలసరి కారణంగా చాలామంది అమ్మాయిలు స్కూల్‌ మానేస్తున్నారని తెలుసుకున్నా. ఈ పరిస్థితుల్ని మార్చాలనే 2010లో మావారు శ్యామ్‌తో కలిసి సఖి ప్యాడ్స్‌ పేరుతో సహజసిద్ధమైన శ్యానిటరీ న్యాప్‌కిన్లు తయరుచేయడం ప్రారంభించా. అదే సమయంలో ప్యాడ్ల వినియోగం, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి అక్కడి మహిళలకు వివరించినా చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. పైగా వాళ్లు పాటించే పాతకాలపు పద్ధతులే మంచివని, నేను తయారుచేసే ప్యాడ్స్‌ వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అన్నవారూ లేకపోలేదు. అయినా వెనక్కి తగ్గలేదు. మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టా. అయితే రాన్రానూ మహిళల ఆలోచన విధానం మారడం గమనించా..’ అంటూ తన ప్రయత్నాన్ని మహిళలకు చేరువ చేసిన తీరు గురించి పంచుకున్నారీ ప్యాడ్‌ ఉమన్.

ఆ రెండు పదార్థాలతో..!

చెట్టు బెరడు, అరటి తొక్కలు.. తన సఖి ప్యాడ్స్‌కి ఇవే మూలం అంటున్నారు స్వాతి. ‘మా ప్యాడ్స్‌ తయారీలో చెట్టు బెరడు, అరటి తొక్క.. ఈ రెండు పదార్థాల్ని వాడుతుంటాం. బయట దొరికే ప్యాడ్స్‌ కంటే వీటికి పీల్చుకునే గుణం ఎక్కువ. ఇవి సహజసిద్ధమైన పదార్థాలు కాబట్టి భూమిలో త్వరగా కలిసిపోతాయి కూడా! అంతేకాదు.. ఈ న్యాచురల్‌ ప్యాడ్స్‌ని మండించడానికి మా వారు, నేను కలిసి ‘అశుద్ధినాశక్‌’ పేరుతో టెర్రకోటాతో ఓ ప్రత్యేక యంత్రాన్ని కూడా తయారుచేశాం. ప్రస్తుతం మా వద్ద తయారయ్యే న్యాప్‌కిన్ల సైజును బట్టి రూ. 3-5 ధరకు అమ్ముతున్నాం..’ అంటూ చెప్పుకొచ్చారామె. ఈ పన్నెండేళ్ల కాలంలో తన వ్యాపారాన్ని అంతకంతకూ విస్తరించిన స్వాతి.. దేశవ్యాప్తంగా వందలాది గ్రామాల్లో ప్యాడ్‌ మేకింగ్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ క్రమంలో ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు కూడా! ఇందులో భాగంగానే ఆ మహిళలు తయారుచేసే ప్యాడ్స్‌ని వారే అమ్ముకునేలా.. దాంట్లో నుంచి రూపాయి కూడా ఆశించకుండా తన మంచి మనసును చాటుకుంటున్నారామె. మరోవైపు మహిళల్లో, బాలికల్లో నెలసరి అపోహల్ని తొలగించడానికి వివిధ అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.

‘వాత్సల్య’తో అవగాహన!

ఆరోగ్యకరమైన శ్యానిటరీ న్యాప్‌కిన్లు రూపొందిస్తూ ఎంతోమంది మహిళలకు ఇష్ట ‘సఖి’గా మారిన స్వాతి.. మరోవైపు ‘వాత్సల్య ఫౌండేషన్‌’ను కూడా స్థాపించారు. మహిళలు జీవనోపాధి పొందేందుకు వివిధ రకాల ప్రాజెక్టుల్ని రూపొందించి.. వీటి గురించి వారిలో అవగాహన పెంచుతోంది. ఈ క్రమంలో చేనేత మగ్గాలు, సోలార్‌ డీహైడ్రేటర్స్‌, శ్యానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేసే యంత్రాలు, ప్యాడ్స్‌ని కాల్చే మెషీన్లు (అశుద్ధనాశన్‌).. వంటివి మహిళలకు అందిస్తూ.. వారి అభివృద్ధికి దోహదపడుతున్నారీ సోషల్‌ వర్కర్‌. ఇలా ఓవైపు మహిళా సాధికారతకు కృషి చేస్తూనే.. మరోవైపు పర్యావరణహితం కోసం పాటుపడుతోన్న స్వాతి.. 2013లో ‘ఎన్విరాన్‌మెంట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ అందుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని