Updated : 03/03/2023 08:26 IST

వీళ్ల సినిమా.. సూపర్‌హిట్

ఆ జిల్లా వాసుల ముప్పై ఏళ్ల కల అది. దానిని నిజం చేశారు.. అక్కడి మహిళలు! పైసా పైసా కూడబెట్టి పొదుపు చేసిన సొమ్ముతో వాళ్లు నడుపుతున్న బెలూన్‌ థియేటర్‌.. కుమురం భీం జిల్లా వాసుల రంగుల కలని ఎలా నిజం చేసిందో తెలుసుకోవాలంటే ఈ మహిళా విజయం గురించి తెలుసుకోవాల్సిందే!

కుమురం భీం జిల్లావాసులకు మూడు దశాబ్దాలుగా ఒక్క సినిమా థియేటర్‌ కూడా లేదు. అందుకే వాళ్లకి వినోదం చాన్నాళ్లుగా అందని ద్రాక్షే అయ్యింది. ఒకవేళ సినిమా చూడాలనుకుంటే పక్కజిల్లాకి వెళ్లాల్సిందే. అలాంటిది అక్కడి ప్రజలు ప్రస్తుతం ఆధునిక సదుపాయాలతో, ఏసీ చల్లదనంలో సినిమా చూస్తున్నారంటే అదంతా అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళల గొప్పదనమే. పూర్తిగా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ థియేటర్‌ని చూసి దర్శకుడు రాజమౌళి సైతం మురిసిపోయారు. ఇదంతా ఎలా సాధ్యమైదంటే.. ‘ఇక్కడ ఏళ్లుగా సినిమా థియేటర్‌ లేదన్న విషయాన్ని గ్రహించిన పిక్చర్‌ టైమ్‌ సంస్థ ఆ లోటు తీర్చాలనుకుంది. మామూలుగా అయితే థియేటర్‌ నిర్మాణానికి చాలా సమయం పడుతుంది. బదులుగా తేలిగ్గా, తక్కువ సమయంలో నిర్మించే బెలూన్‌ థియేటర్‌ని నిర్మించాలనుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆసిఫాబాద్‌లో థియేటర్‌ని మీరే నిర్వహించాలని అధికారులు చెప్పినప్పుడు మొదట నమ్మలేకపోయాం. తర్వాత కంగారు పడ్డాం. కానీ అధికారులు ఇచ్చిన ధైర్యం మాలో ఉత్సాహాన్ని నింపింది. మేము పొదుపు చేసిన రూ.30 లక్షలతో 2022 జనవరిలో థియేటర్‌కి అంకురార్పణ జరిగింది. పిక్చర్‌టైమ్‌ సంస్థ రూ.20 లక్షల ఆర్థిక సహకారంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందించింది. మార్చి 8న ‘రాధేశ్యామ్‌’ సినిమాతో మా బెలూన్‌ థియేటర్‌ ప్రారంభం అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో హౌజ్‌ఫుల్‌ కలెక్షన్లు వచ్చాయి.’ అంటారు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి.

అన్నీ మేమే అయి...  

బెలూన్‌ థియేటర్‌.. వినడానికి కొత్తగా ఉంది కదూ! దీనిలో సదుపాయాలు కూడా అలానే ఉంటాయి. చూడ్డానికి గాలితో నిండిన పెద్ద బుడగలా ఉండే థియేటర్‌ సామర్థ్యం.. 120 సీట్లు. హెచ్‌డీ ప్రొడక్షన్‌తో పాటు 5.2 డాల్బీ డిజిటల్‌ సౌండ్‌, ఏసీ, కుషన్‌ సీట్లూ ఉంటాయి. ప్రమాదాలకు తట్టుకునే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించారు. ‘సినిమాని ఎలా డౌన్‌లోడ్‌ చేయాలో, దానిని ఎలా ప్రదర్శించాలో, అందుకు సంబంధించిన లైసెన్స్‌లు తీసుకోవడం, టిక్కెట్లు ఇవ్వడం వంటి విషయాలపై పిక్చర్‌ టైమ్‌ సంస్థ ప్రతినిధులు మాకు వారంరోజుల పాటు శిక్షణ ఇచ్చారు. థియేటర్‌ ఆవరణలో చిరుతిళ్ల దుకాణాలను మా సభ్యులతోనే ఏర్పాటు చేశాం. లాభాల్లో మాకు 60 శాతం వాటా. పిక్చర్‌ టైమ్‌ సంస్థ 40 శాతం తీసుకుంటుంది. ఏడాదిలో అన్ని ఖర్చులు పోను రూ.10 లక్షల ఆదాయం వచ్చింది. అంటే పెట్టుబడిలో 30శాతం వెనక్కి వచ్చేసింది. ఈ డబ్బుని మారుమూల గ్రామాల్లో ఉన్న పేద సంఘాల మహిళలకు స్వయం ఉపాధి రుణాలుగా ఇస్తూ, ఆర్థిక చేయూతనందిస్తున్నామని’ అంటున్నారు ఈ థియేటర్‌ని నడుపుతున్న 30 మంది మహిళలూ ముక్తకంఠంతో!


రాజమౌళి మెచ్చారు...

సినిమా అభిమానులని ఆకట్టుకుంటున్న ఈ థియేటర్‌ గురించి తెలిసి దర్శకుడు రాజమౌళి దంపతులు ఇక్కడకు వచ్చారు. ఆ సదుపాయాలు చూసి మురిసిపోయారు. స్థానిక పంచాయతీ కూడా రూ.కోటి నిధులు కేటాయించడంతో శౌచాలయాలు, ప్రహరీ తదితర వసతులు అందుబాటులోకి వచ్చాయి.


- చొక్కాల రమేశ్‌, ఆసిఫాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని