Manjari Sharma: ఐదు లక్షలమందికి అండ ఫార్మ్‌ దీదీ!

అమ్మ చేతి వంటని మరిపించడం మరో అమ్మవల్లే సాధ్యం అవుతుందేమో! ఫార్మ్‌దీదీ వెబ్‌సైట్‌కి వెళ్తే తల్లులు ఇంటిపట్టున చేసిన కమ్మని వంటకాలు, పచ్చళ్లు స్వాగతం పలుకుతాయి.

Updated : 11 Feb 2024 12:14 IST

అమ్మ చేతి వంటని మరిపించడం మరో అమ్మవల్లే సాధ్యం అవుతుందేమో! ఫార్మ్‌దీదీ వెబ్‌సైట్‌కి వెళ్తే తల్లులు ఇంటిపట్టున చేసిన కమ్మని వంటకాలు, పచ్చళ్లు స్వాగతం పలుకుతాయి. సుమారు ఐదులక్షలమంది ఆడవాళ్లకి ఉపాధిబాట చూపించిన ఫార్మ్‌దీదీ రూపకర్త మంజరీశర్మకి ఈ ఆలోచన రావడానికి కారణం ఆడవాళ్లపై చూపించిన వివక్షేనంటారు...

డపిల్లని తెలిస్తే పురిట్లోనే హతమార్చే హరియాణాలో పుట్టాన్నేను. మాది బహదూర్‌గఢ్‌ గ్రామం. స్కూల్‌ తర్వాత నా చదువు మొత్తం దిల్లీలోనే సాగింది. చిన్నప్పట్నుంచీ ఆటపాటలూ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేదాన్ని. నాకంటే చిన్నపిల్లలకు లెక్కలు, సైన్స్‌ పాఠాలు చెప్పేదాన్ని. మా తాతగారికి సేవాగుణం ఎక్కువ. మా అమ్మానాన్నలు కూడా ఎవరికి ఏ కష్టమొచ్చినా మేమున్నామనే ధైర్యం చెప్పేవారు. అందుకే నలుగురికి ఉపయోగపడే పని అంటే వెనక్కి తగ్గేదాన్ని కాదు. ఐఐఎమ్‌ కోల్‌కతాలో ఎంబీఏ చేశా. యూనివర్సిటీ స్థాయిలో ఎన్నో ఆటల పోటీల్లోనూ పాల్గొన్నా. ఐఐఎమ్‌ కోల్‌కతా స్పోర్ట్స్‌ కౌన్సిల్లో సభ్యురాలిగా ఉండేదాన్ని. ఎంత చదివినా, ఏం చేసినా మా ప్రాంతాన్ని మార్చలేకపోతున్నానే అన్న దిగులు ఉండేది. ఆడపిల్లలపై అడుగడుగునా వివక్షే ఇక్కడ. నేనూ సామాజికంగా ఇలాంటి ఇబ్బందులెన్నో ఎదుర్కొన్నా. కానీ మా కుటుంబం నాకు అండగా నిలబడటంతో వాటిని జయించా. చదువయ్యాక ఇన్ఫోసిస్‌, విప్రో, ఏటీ కెర్నీ వంటి ప్రముఖ సంస్థలలో పని చేసినప్పుడు మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలకు వెళ్లాను. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న చాలా మంది మహిళలతో మాట్లాడా. వారందరూ కలసికట్టుగా సమస్యలు పరిష్కరించుకోవటం చూసి నాకు సంతోషంగా అనిపించింది. మగవాళ్లు పని కోసం పట్టణాలకు వెళ్తే అక్కడి మహిళలే వ్యవసాయం చేసి పంటను మార్కెట్టులో విక్రయించేవారు. కానీ అమ్మకాలు, కొనుగోళ్లపై అవగాహన లేకపోవడంతో పండించిన దానికంటే తక్కువకే అమ్మేవారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవాలనుకున్నా. అలా 2021లో పుట్టిందే ‘ఫార్మ్‌దీదీ’.

సేంద్రియ పదార్థాలతో...

ఫార్మ్‌దీదీ ఆధ్వర్యంలో రైతుల నుంచి సేంద్రియ ఉత్పత్తులను సేకరించేదాన్ని. వాటితో ఊళ్లోని ఆడవాళ్లతో వివిధ రకాల వంటకాలు చేయించి విక్రయిద్దాం అనుకున్నా. మొదట గదానా ప్రాంతంతో ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టా. కానీ అక్కడి మహిళలు  ఆసక్తి చూపించలేదు. ఇంతకు ముందు ఎక్కువ ధరకు పంటను కొంటాము అని చెప్పిన ఎంతో మంది వచ్చారు. వాళ్లంతా మమ్మల్ని మోసం చేశారంటూ చెప్పుకొచ్చారు. నిజమే కదా పొరుగూరు నుంచి వచ్చి మీతో వ్యాపారం చేయాలనుకుంటున్నా అని చెప్పగానే ఎలా నమ్మేస్తారు? అందుకే వీరిని ఒప్పించేందుకు మొదట్లో చాలా కష్టపడ్డాను. ఒక్కొక్కరికీ విషయం వివరించి చెప్పి ఎట్టకేలకు ఒప్పించా. అలా ఆ ఊరి వాళ్లంతా మా సంస్థలో సభ్యులయ్యారు. మేం అందించే ముడిసరకుతో వాళ్లు చక్కని వంటకాలు చేసిస్తారు. అంతా సేంద్రియమే కావడం విశేషం. వంట చేసేందుకు ఊళ్లో ప్రత్యేక కమ్యూనిటీ వంటశాలను ఏర్పాటు చేశాం. అన్ని జాగ్రత్తలూ తీసుకొని ఉత్పత్తులను తయారు చేస్తాం. కారప్పొడులు, పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు వంటి చాలా రకాల ఉత్పత్తులని అందిస్తున్నాం. ఇందు కోసం ఓ యాప్‌ను కూడా తయారు చేశా. బిగ్‌బాస్కెట్, అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌ వంటి ప్రముఖ ఆన్‌లైన్‌ వెబెసైట్ల ద్వారానూ అమ్ముతున్నాం. ‘నాతో కలసి పని చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడి స్త్రీలల్లో చాలా మార్పు వచ్చింది. వారి ఆర్థిక పరిస్థితి ఇంతకు మందు కంటే చాలా మెరుగుపడింది. నేనెప్పుడైనా వారిని కలిసేందుకు వెళ్తే ‘మనం ఎదిగేందుకు ఇంకా ఏ విధంగా కృషి చేస్తే బాగుంటుందని ఉత్సాహంగా అడుగుతూ ఉంటారు. ఆ మహిళల్ని చూసినప్పుడల్లా ఆర్థికంగా స్థిరపడుతున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంటుంది. బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాను. వచ్చే అయిదేళ్లలో మరో అయిదు లక్షల మందికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్