Updated : 15/03/2022 15:07 IST

కార్పొరేట్ కొలువు వద్దని.. పేస్ట్రీ చెఫ్‌గా మారింది!

కార్పొరేట్‌ కొలువు.. చక్కటి జీతం.. చీకూ-చింతా లేని జీవితం.. ఒకమ్మాయికి ఇంతకంటే కలిసొచ్చే అంశాలు ఇంకేముంటాయి?! కానీ ఇన్ని సాధించినా.. జీవితంలో స్థిరపడినా.. ఇంకా ఏదో సాధించాలన్న తపన ఆమెను ఉన్నచోట ఉండనివ్వలేదు. అది మరేదో కాదు.. బేకింగే అని తెలుసుకున్న ఆమె.. అందులో నైపుణ్యాలు సాధించాలన్న పట్టుదలతో ప్యారిస్‌ వైపు అడుగులు వేసింది. కట్‌ చేస్తే.. ఇప్పుడు ప్యారిస్‌లోనే ఓ పేరుమోసిన సంస్థలో ప్రొఫెషనల్‌ పేస్ట్రీ చెఫ్‌గా పనిచేస్తోంది. ఆమే.. పుణేకు చెందిన దిశా చంద్రకాంత్‌ ఎకల్‌. ప్రస్తుతం ‘నా మనసెక్కడుందో నేనూ అక్కడే ఉన్నా.. నచ్చిన పనిలో ఉన్న సంతృప్తి మరెందులోనూ దొరకదం’టోన్న ఈ యువ చెఫ్‌ పేస్ట్రీ జర్నీని ఓసారి చూద్దాం..!

మనలోని ఆసక్తుల్ని, నైపుణ్యాల్ని నలుగురికీ చూపించుకోవాలన్న ఆరాటం చాలామందికి ఉంటుంది. దిశ కూడా అంతే! చిన్నతనం నుంచీ బేకింగ్‌ని ఇష్టపడే ఆమె.. సందర్భం వచ్చినప్పుడల్లా తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్కూల్‌ ఫ్రెండ్స్‌కి తన చేత్తో తయారుచేసిన పేస్ట్రీలు, మఫిన్స్‌ రుచి చూపించేది. కాలేజీల్లో నిర్వహించే పలు కార్యక్రమాల్లోనూ తాను తయారుచేసిన ఈ బేకింగ్‌ ఐటమ్స్‌తో ఓ స్టాల్‌ని ఏర్పాటుచేసేది. ఎంతో మక్కువతో, మనసు పెట్టి తయారుచేసిన ఈ పదార్థాల్ని అందరూ లొట్టలేసుకుంటూ తినేవారు. ఎంతో రుచిగా ఉన్నాయంటూ ప్రశంసించేవారు.

అప్పుడే తెలుసుకున్నా..!

అయితే బేకింగ్‌పై మక్కువ ఉన్నా ముందు చదువుపై దృష్టి పెట్టాలనుకుంది దిశ. ఈ క్రమంలోనే స్పోర్ట్స్‌ సైన్సెస్‌ విభాగంలో ఎంబీఏ పూర్తిచేసింది. ఆ తర్వాత కార్పొరేట్‌ ఉద్యోగం కూడా సంపాదించింది. వేలల్లో జీతం. అయినా ఏదో వెలితిగా ఫీలయ్యేదాన్నని చెబుతోందామె.

‘చదువు పూర్తి కాగానే ఉద్యోగమొచ్చింది. అయితే ఇది నా ఫుల్‌టైమ్‌ కెరీర్‌ కాదేమో అనుకునేదాన్ని. ఇక అప్పుడప్పుడూ నా చేత్తో తయారుచేసిన బేకింగ్‌ ఐటమ్స్‌ని నా కొలీగ్స్‌కి రుచి చూపించేదాన్ని. అంతేకాదు.. పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీల కోసం ప్రత్యేకంగా కేక్స్‌, పేస్ట్రీలు కూడా తయారుచేసిచ్చేదాన్ని. అవి వారికెంతో నచ్చేవి. ఒకసారి ఓ కొలీగ్‌.. ‘ఇదే నీ అసలైన ట్యాలెంట్‌!’ అన్నారు. నాలో నిద్రాణమై ఉన్న తపనను అప్పుడు గుర్తించా. ఇక సమయం వృథా చేయదల్చుకోలేదు. అందుకే ఉద్యోగం వదిలి ఓ పేస్ట్రీ కేఫ్‌లో చేరాను. నామమాత్రపు జీతం. అయినా నాకెంతో సంతృప్తిగా అనిపించేది..’ అంటూ చెప్పుకొచ్చిందీ పేస్ట్రీ లవర్‌. ఇలా బేకింగ్‌పై తనకున్న మక్కువతో ఇండియాలోని పలు సంస్థల్లో ఇంటర్న్‌గా, ఫ్రీలాన్స్‌ పేస్ట్రీ ఆర్టిస్ట్‌గానూ పనిచేసింది దిశ.

అదే నా సక్సెస్‌ సీక్రెట్‌!

ఇక కొన్నాళ్ల తర్వాత తన బేకింగ్‌ నైపుణ్యాలకు మరింత పదును పెట్టేందుకు ప్యారిస్ పయనమైన దిశ.. ప్యారిస్‌లోని ‘లే కార్డన్‌ బ్లూ’ అనే కుకింగ్‌ స్కూల్లో పేస్ట్రీ డిప్లొమా చేసింది. 2020లో ఈ కోర్సు పూర్తి చేసిన దిశ ప్రతిభకు లాక్‌డౌన్‌ ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి కంపెనీలో ఉద్యోగమొచ్చింది. ఈ క్రమంలోనే ప్యారిస్‌లోని పేరుమోసిన ఇండో-ఫ్రెంచ్‌ పేస్ట్రీ కంపెనీ ‘లియోనీ ప్యారిస్‌’లో ప్రొఫెషనల్‌ పేస్ట్రీ చెఫ్‌గా కొనసాగుతోందామె. ‘మొదట్లో కాస్త సంకోచించినా అమ్మానాన్న నా నిర్ణయాన్ని గౌరవించారు. మనసో చోట తనువో చోట ఉంటే ఏ చిన్న పనైనా కష్టంగానే అనిపిస్తుంది. అదే నచ్చిన అంశాన్ని కెరీర్‌గా మార్చుకుంటే ఎంత కష్టమైనా విజయం సాధించచ్చు.. మనం చేయాల్సిందల్లా మనపై మనం నమ్మకముంచడమే! ప్రస్తుతం నేను నా మనసు ఎక్కడుందో అక్కడే ఉన్నా.. సంతృప్తిగా ఉన్నా..’ అంటోంది దిశ.

బేకింగ్‌తో పాటు వాలీబాల్‌ను అమితంగా ఇష్టపడే దిశ.. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌ బెకెట్‌ యూనివర్సిటీ విమెన్స్‌ వాలీబాల్‌ జట్టులో భాగమైంది. ఈ క్రమంలోనే పలు మ్యాచుల్లోనూ పాల్గొందీ స్పోర్ట్స్‌ లవర్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని