ఒక్క క్లిక్‌తో.. డోర్‌ వద్దకే డీజిల్ అందిస్తోంది!

వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. వారి బాటలో కాకుండా కొత్త మార్గాన్ని అన్వేషిస్తూ సక్సెస్‌ సాధిస్తుంటారు కొందరు మహిళలు. దిల్లీకి చెందిన సన్యా గోయెల్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నూనె వ్యాపారం చేసే కుటుంబానికి చెందిన ఆమె.. డీజిల్‌ను డోర్‌ డెలివరీ చేసే కొత్త ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టారు. లీటర్ల కొద్దీ ఇంధనం అవసరమయ్యే గృహ, ఆస్పత్రి...

Published : 07 Mar 2022 20:10 IST

(Photo: LinkedIn)

వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. వారి బాటలో కాకుండా కొత్త మార్గాన్ని అన్వేషిస్తూ సక్సెస్‌ సాధిస్తుంటారు కొందరు మహిళలు. దిల్లీకి చెందిన సన్యా గోయెల్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నూనె వ్యాపారం చేసే కుటుంబానికి చెందిన ఆమె.. డీజిల్‌ను డోర్‌ డెలివరీ చేసే కొత్త ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టారు. లీటర్ల కొద్దీ ఇంధనం అవసరమయ్యే గృహ, ఆస్పత్రి, నిర్మాణ సముదాయాల వద్దకే దీన్ని చేర్చుతూ.. దేశంలోనే తన కంపెనీని అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. ‘ఒకే ఒక్క క్లిక్‌తో.. నాణ్యతా ప్రమాణాలతో కూడిన డీజిల్‌ను గుమ్మం వద్దకు చేర్చే పూచీ మాదం’టోన్న ఈ ఫ్యూయల్‌ క్వీన్ కథేంటో తెలుసుకుందాం రండి..

క్షేత్ర స్థాయిలో నిర్వహించే ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడానికి ముందుకొచ్చే అతివలు చాలా తక్కువమందే ఉంటారు. అందులోనూ కొందరు కుటుంబ నేపథ్యం నుంచి స్ఫూర్తి పొంది.. తామూ ఇదే రంగాన్ని ఎంచుకోవాలనుకుంటారు. దిల్లీకి చెందిన సన్యా గోయెల్‌ కూడా ప్రస్తుతం తాను తన వ్యాపారంలో రాణించడానికి తన కుటుంబ స్ఫూర్తే కారణమంటోంది. ముఖ్యంగా తన తండ్రి నుంచి పూర్తి సహకారం, ప్రోత్సాహం అందడం వల్లే తానీ స్థాయికి చేరానని చెబుతోంది.

సమృద్ధి నుంచి హమ్‌సఫర్ దాకా..!

వ్యాపారంపై మక్కువతో వార్‌విక్‌ యూనివర్సిటీ నుంచి ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో డిగ్రీ చదివిన సన్యా.. తన కుటుంబంలో నాలుగో తరానికి చెందిన బిజినెస్‌ ఉమన్‌. నూనె వ్యాపారం చేసే కుటుంబం నుంచి వచ్చినా.. ఇంధన రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుందామె. ఈ క్రమంలోనే తన కజిన్స్‌తో కలిసి దిల్లీలో 2016లో ‘సమృద్ధి హైవే సొల్యూషన్స్‌’ అనే సంస్థను స్థాపించింది. ఇంధన డీలర్లు, రీటైలర్స్‌ భాగస్వామ్యంతో ఇంధన కొనుగోళ్లపై లాయల్టీ ప్రోగ్రామ్స్‌ నిర్వహించడమే దీని ముఖ్యోద్దేశం. ఈ క్రమంలోనే వినియోగదారులు నిర్దేశిత అవుట్‌లెట్స్‌లో ఇంధనం కొనుగోలు చేయడం ద్వారా కొన్ని పాయింట్స్‌ని సంపాదించచ్చు.. వీటిని తిరిగి కార్లు, బైక్స్‌.. వంటి వాహనాలు కొన్న షాపుల్లో రీడీమ్‌ చేసుకోవచ్చు. అయితే మూడేళ్ల పాటు ఈ సేవల్ని అందించిన ఈ సంస్థ.. ఆపై ‘పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ’ డీజిల్‌ డోర్‌ డెలివరీని చట్టబద్ధం చేయడంతో తన దిశను మార్చుకుంది. ఈ నేపథ్యంలోనే 2019లో ‘హమ్‌సఫర్‌’ పేరుతో డీజిల్‌ డోర్‌ డెలివరీ యాప్‌ను రూపొందించింది సన్యా.

ఇవే మా ప్రత్యేకతలు!

స్థిర/భారీ మెషినరీ వద్దకే డీజిల్‌ని చేర్చడం ఈ యాప్‌ ముఖ్యోద్దేశం. ‘ఏ వస్తువైనా గుమ్మం ముందుకు వచ్చేంత టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆలోచనతోనే డీజిల్‌ డోర్‌ డెలివరీ చేసేందుకు హమ్‌సఫర్‌ని రూపొందించాం. వినియోగదారులకు ఖర్చు తగ్గించడంతో పాటు వారి సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యమిస్తున్నాం. పైగా దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్‌ని కూడా కొంతవరకు నియంత్రించచ్చు. ప్రస్తుతం అపార్ట్‌మెంట్లు, ఆస్పత్రులు, నిర్మాణ సముదాయాలు, హోటళ్లు, స్కూళ్లు, మాల్స్‌, తయారీ-మైనింగ్‌ సంస్థలు.. వంటి సముదాయాల దగ్గరికే పెద్ద ఎత్తున డీజిల్‌ని పంపిస్తున్నాం. వినియోగదారులు మా వద్ద కనిష్ఠంగా 100 లీటర్ల నుంచి గరిష్ఠంగా PESO నిబంధనల ప్రకారం ఎంతైనా ఆర్డర్‌ చేసుకోవచ్చు. 24X7 మా సేవలు అందుబాటులో ఉంటాయి. దూరాన్ని బట్టి ఆర్డర్‌ చేసిన ఎనిమిది గంటల్లోపు డీజిల్‌ గుమ్మం ముందు ఉంటుంది..’ అంటూ తన సంస్థ అందించే సేవల గురించి చెప్పుకొచ్చారు సన్యా.

దేశవ్యాప్తంగా సేవలు..!

ఇలా హమ్‌సఫర్‌ యాప్‌ ద్వారా డీజిల్‌ని బుక్‌ చేసుకున్న తర్వాత వినియోగదారులు లైవ్‌ లొకేషన్‌ని ఫాలో అయ్యే సౌలభ్యం కూడా ఇందులో ఉంది. అంతేకాదు.. కల్తీ, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాల్ని నిరోధించడానికి వీలుగా ప్రత్యేకమైన OTP వ్యవస్థను ఈ యాప్‌లో అందుబాటులో ఉంచారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలోనూ నిర్విరామంగా తమ సేవల్ని కొనసాగించింది సన్యా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలకు విస్తరించిన హమ్‌సఫర్‌ సేవల్ని ఇప్పటివరకు సుమారు 6,200 మందికి పైగా వినియోగదారులు ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 7 లక్షల లీటర్ల డీజిల్‌ని డెలివరీ చేయగలిగామంటోన్న సన్యా.. మున్ముందు ఇతర దేశాల్లోనూ తమ సేవల్ని విస్తరించే ఆలోచనలో ఉన్నానంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్