Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!

చక్కెర.. ఇది ఆరోగ్యానికి ప్రధాన శత్రువు. ముఖ్యంగా మధుమేహులకు ఇది విషంతో సమానమని చెప్పాలి. అయితే ఈ వ్యాధిగ్రస్తులు తీపి తినాలన్న కోరికతో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్ని

Published : 14 Aug 2022 18:28 IST

చక్కెర.. ఇది ఆరోగ్యానికి ప్రధాన శత్రువు. ముఖ్యంగా మధుమేహులకు ఇది విషంతో సమానమని చెప్పాలి. అయితే ఈ వ్యాధిగ్రస్తులు తీపి తినాలన్న కోరికతో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతుక్కుంటుంటారు. అలాగని వాటిలోనూ చక్కెర ఉండదా? అంటే.. పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. అందుకే ఇలాంటి వాళ్లందరికీ ఓ నమ్మకంగా మారింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వాతీ పాండే. సహజసిద్ధమైన చక్కెర ఉండే స్టీవియాను సాగుచేస్తూ మధుమేహుల నోరు తీపి చేస్తోంది. ఈ క్రమంలోనే ఓ సంస్థను స్థాపించి దేశవిదేశాలకు తాను తయారుచేసే న్యాచురల్‌ చక్కెరను ఎగుమతి చేస్తూ కోట్లు గడిస్తోంది. ‘మా అమ్మ సమస్య.. ఇప్పుడు ఎంతోమందికి మార్గం చూపిస్తుందం’టోన్న స్వాతి వ్యాపార జర్నీ ఎలా మొదలైందో తెలుసుకుందాం రండి..

అవసరమే మనలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంటుంది. లక్నోకు చెందిన స్వాతీ పాండే విషయంలోనూ ఇదే జరిగింది. తన తల్లి గత పదిహేనేళ్లుగా మధుమేహ సమస్యతో బాధపడుతోంది. దీంతో తనకిష్టమైన స్వీట్స్‌కి దూరంగా ఉండడం స్వాతిని బాధపెట్టింది. ఎలాగైనా అమ్మ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్న ఆమె.. ఈ దిశగానే పరిశోధనలు చేసింది. ఆఖరికి స్టీవియా రూపంలో ఆమెకో పరిష్కారం దొరికినట్లయింది.

ఉద్యోగం వదిలేసి స్వదేశానికి..!

లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో చదువు పూర్తిచేసిన స్వాతి.. సింగపూర్‌లోని ‘క్లీన్‌ టెక్నాలజీ ప్రాక్టీస్‌’ అనే సంస్థలో కన్సల్టెంట్‌గా విధులు నిర్వర్తించింది. ఈ క్రమంలోనే మార్కెట్లో ఉన్న చక్కెర ప్రత్యామ్నాయాల గురించి అన్వేషించింది. అయితే ఎక్కడా చక్కెరకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కనిపించలేదామెకు. ఇంకాస్త లోతుగా పరిశీలించగా స్టీవియా జాడ తెలిసింది స్వాతికి. ఇది చక్కెర కంటే 200 రెట్లు ఎక్కువ తీపి ఉంటుందని, క్యాలరీలు శూన్యమని తెలుసుకున్న ఆమె.. దీన్నే తన వ్యాపారాంశంగా నిర్ణయించుకుంది. వెంటనే సింగపూర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి లక్నో చేరుకుందామె. అయితే స్వాతి స్నేహితుడు మనీష్‌ ఛౌహాన్‌ తండ్రికి కూడా మధుమేహ సమస్య ఉంది. దీంతో ఇద్దరూ కలిసి 2015లో ఆర్బోరియల్‌ (Arboreal) అనే సంస్థకు తెరతీశారు. స్టీవియాతో విభిన్న ఆహార పదార్థాలు, పానీయాలు తయారుచేసే సంస్థ ఇది. అంతేకాదు.. స్టీవియాను పొడి, పానీయం రూపంలో తయారుచేసి దేశవిదేశాలకూ ఎగుమతి చేస్తున్నానంటోంది స్వాతి.

రుచిలో రాజీ పడకుండా..!

నిజానికి చక్కెరతో చేసిన పదార్థాల రుచి, దాని ప్రత్యామ్నాయాలతో చేసిన వంటకాల రుచులు వేర్వేరుగా ఉంటాయి. అవి తిన్నా అంత సంతృప్తికరంగా అనిపించవు. కానీ తాను సాగుచేస్తోన్న స్టీవియా చక్కెర వీటికి భిన్నం అంటోంది స్వాతి. రుచిలో ఏమాత్రం రాజీలేకుండా.. అచ్చం చక్కెర తిన్న సంతృప్తి కలుగుతుందంటోందామె. ‘ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌.. వంటి రాష్ట్రాల్లో స్టీవియాను సాగుచేస్తున్నాం. వీటి ఆకుల నుంచి మేం తయారుచేసే న్యాచురల్ షుగర్‌ రుచిలోనే కాదు.. రూపం కూడా అచ్చం చక్కెరను పోలినట్లే ఉంటుంది. కాబట్టి చాలామంది దాన్ని చక్కెర ప్రత్యామ్నాయంగా కాకుండా చక్కెర అనే పొరబడుతుంటారు. ప్రస్తుతం మా వద్ద స్టీవియా చక్కెరతో కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు తయారవుతున్నాయి. అంతేకాకుండా.. స్టీవియా ఎక్స్‌ట్రాక్ట్‌, స్టీవియా ద్రావణాలు.. కూడా దేశంలో సుమారు 150 కంపెనీలతో పాటు ఐదు దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ప్రస్తుతం సుమారు రూ. 40 కోట్లుగా ఉన్న మా వార్షికాదాయాన్ని వచ్చే ఏడాది వరకు రూ. వంద కోట్లు దాటించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం..’ అంటోంది స్వాతి.

ఇలా తన ఉత్పత్తులతో మధుమేహులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూనే.. మరోవైపు ఎంతోమంది రైతులకు ఉపాధి కూడా కల్పిస్తోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌. తన వ్యాపార దక్షతకు గుర్తింపుగా 2018లో ‘కార్టియర్‌ విమెన్స్‌ ఇనీషియేటివ్‌ అవార్డు’ అందుకుంది స్వాతి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్