Published : 31/12/2021 16:12 IST

న్యూ ఇయర్.. ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకుందాం!

వెకేషన్స్‌, ఫ్యామిలీ టూర్స్‌, డీజే హంగామా, పబ్బులు, పార్టీలు, డ్యాన్సులు.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో మనం చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ఒమిక్రాన్‌ పొంచి ఉన్న నేపథ్యంలో పబ్బులు, పార్టీలు, డీజేలు అంటే కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కొత్త సంవత్సర వేడుకలు సామూహికంగా చేసుకోవడం కంటే నిరాడంబరంగా జరుపుకోవడమే మేలంటున్నారు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలూ పాటించాలని చెబుతున్నారు. అవేంటంటే..!

వెకేషన్‌కి వెళ్తున్నారా?

న్యూ ఇయర్‌ వేడుకల కోసం వివిధ ప్రాంతాలకు వెకేషన్‌కు వెళ్లడం మనలో చాలామందికి అలవాటు. అయితే దీనివల్ల వైరస్‌ విస్తృతికి మనమే తెరతీసిన వాళ్లమవుతాం. కాబట్టి వెకేషన్‌ని వాయిదా వేసుకొని ఈసారి ఎవరింట్లో వాళ్లే న్యూఇయర్‌ పార్టీ సెలబ్రేట్‌ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అయితే ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాలి అనుకున్న వారు దగ్గర్లోని సురక్షిత ప్రదేశాల్ని ఎంచుకోవడంతో పాటు మరిన్ని అదనపు జాగ్రత్తలు పాటించడం మంచిది.

* ప్రయాణం కోసం సన్నద్ధమయ్యే ముందు దానికి సంబంధించిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలేంటో తెలుసుకోవాలి.

* వెకేషన్‌కి వెళ్లడానికి ముందు, తిరిగొచ్చాక కరోనా టెస్ట్‌ చేయించుకోవాలి. ఈ పరీక్షలో ఒకవేళ పాజిటివ్‌ వస్తే టూర్‌కి వెళ్లకుండా ఇంట్లోనే స్వీయ ఐసోలేషన్‌లో ఉండాలి. వెళ్లొచ్చాక పాజిటివ్‌ వచ్చినా ఇలాగే చేయాలి.

* ప్రయాణానికి సిద్ధమయ్యే క్రమంలో ముందు జాగ్రత్తగా ఫ్లూ వ్యాక్సిన్‌ వేయించుకోవడం మంచిది.

* బస్సు, రైలు, విమానం.. ఇలా ఏ రవాణా సదుపాయాన్ని ఎంచుకున్నా నిరంతరం మాస్కులు ధరించడం, వెళ్లిన చోట కూడా మాస్క్‌ పెట్టుకోవడం, ఇతరులకు దూరంగా ఉండడం.. వంటివి చేయాలి.

* మాస్క్‌లు, హ్యాండ్‌ శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లు.. వంటివి మీకు, మీ కుటుంబానికి సరిపడా ఇంటి నుంచే తీసుకెళ్లడం ఉత్తమం.

* మీకు వీలైతే ఆ ఒకట్రెండు రోజులు సరిపడా స్నాక్స్‌, ఇతర తినుబండారాలను ఇంటి నుంచే తీసుకెళ్లడం మరీ మంచిది. లేదంటే వెళ్లిన చోట ఏది పడితే అది తినేయడం, తద్వారా అది ఇతర సమస్యలకు దారి తీసే అవకాశాలూ లేకపోలేదు.

* ఇక వీటితో పాటు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, నోరు-ముక్కు కవరయ్యేలా మాస్క్‌ పెట్టుకోవడం, మాస్క్‌ను పదే పదే తాకకపోవడం, మాస్క్‌ తాకిన చేత్తోనే ముఖ భాగాలను టచ్‌ చేయకపోవడం.. వంటి కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే!


పార్టీ ఇస్తున్నారా? పార్టీకి వెళ్తున్నారా?

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా పార్టీ ఇవ్వడం, పార్టీలకు వెళ్లడం సహజమే. అయితే ఈసారి ఈ రెండు విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

* పార్టీ ఏర్పాటు చేసే వాళ్లు చాలా తక్కువమంది అతిథులకు ఆహ్వానం పంపించాలి.

* బహిరంగ ప్రదేశాల్లో అంటే.. డాబా మీద, ఇంటి ముందు, గార్డెన్‌లో.. ఇలా విశాలమైన ప్రదేశాల్లో పార్టీ చేసుకోవడం మంచిది. తద్వారా గాలి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది.

* ఇలా వీలు కాని వారు గాలి, వెలుతురు బాగా ప్రసరించే విశాలమైన గదులను ఎంచుకోవచ్చు. ఈ క్రమంలో గదిలోని గాలిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసే విండో ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవడం మంచిది.

* పార్టీకి వచ్చే అతిథుల కోసం అదనంగా మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. వారిని మాస్కులు పెట్టుకునేలా, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్ చేసుకునేలా ప్రోత్సహించాలి.

* అతిథులు పదే పదే టచ్‌ చేసే ఉపరితలాల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.

* అతిథులకు ఏర్పాటుచేసే విందు భోజనం బయటి నుంచి ఆర్డర్‌ చేయడం కాకుండా ఇంట్లోనే పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయడం లేదంటే పాట్‌లక్‌ పార్టీలాగా ఒక్కొక్కరూ ఒక్కో ఫుడ్‌ ఐటమ్‌ను తీసుకురావడమూ మంచిదే. అయితే అందరూ ఆయా పదార్థాలు తయారుచేసే క్రమంలో తగిన నాణ్యతా ప్రమాణాలను పాటించాలి. ఇక తినడానికి ప్లేట్స్‌, గ్లాసులు.. వంటివి కుదిరితే ఎవరికి వారే తెచ్చుకోవడం మంచిది.

* పార్టీలో మంద్రస్థాయి మ్యూజిక్‌ని ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అటు ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు ఇటు ఇతరులు మాస్క్‌ తొలగించి మరీ గట్టిగా అరిచే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇలాంటి నిర్లక్ష్యం కూడా కరోనా విస్తృతిని పెంచే ప్రమాదం ఉంది.


ఇలా చేయడం మంచిది!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో న్యూ ఇయర్‌కి స్వాగతం చెప్పాలంటే పార్టీలకే వెళ్లాల్సిన అవసరం లేదు.. వెకేషన్‌తో అసలు పనే లేదు. అయినా అంతటి ఎంజాయ్‌మెంట్‌ని మూటగట్టుకోవాలంటే బోలెడన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.

* కరోనా మొదలైనప్పట్నుంచి పార్టీలైనా, మీటింగులైనా అన్నీ వర్చువల్‌గానే జరిగిపోతున్నాయి. ఇదే ఐడియాను న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి కూడా ఆపాదించుకోవచ్చు. మీ స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వర్చువల్‌ డిన్నర్‌, వర్చువల్‌ కౌంట్‌డౌన్‌.. వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.

* కేవలం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంజాయ్‌ చేయచ్చు. ఈ క్రమంలో ఆటపాటలు, డ్యాన్సులు చేయడం, నచ్చిన సినిమాలు చూడడం, ప్రత్యేక వంటకాలు చేసుకొని అందరూ కలిసి ఆరగించడం.. వంటివి చేయచ్చు.

* ఇరుగుపొరుగున ఉండే వాళ్లంతా ఎవరి ఇళ్ల ముందు వాళ్లు నిలబడి న్యూ ఇయర్‌ కౌంట్‌డౌన్‌లో భాగం కావచ్చు. తద్వారా అటు సామాజిక దూరం పాటించిన వారవుతారు.. ఇటు అందరూ కలిసి కొత్త ఏడాదికి స్వాగతం పలికిన సంతృప్తి కూడా కలుగుతుంది.

* మీ మనసుకు నచ్చిన పనులు చేస్తూ కూడా కొత్త ఏడాదికి స్వాగతం పలకచ్చు. ఈ క్రమంలో పుస్తకాలు చదవడం, కుటుంబమంతా కలిసి వాకింగ్‌కి వెళ్లడం, ఇంట్లోనే నచ్చిన ఆటలు ఆడుకోవడం వంటివి చేయచ్చు.

ఇక వీటితో పాటు పార్టీకి వెళ్లినా, ఇంట్లో ఉన్నా మాస్క్‌ పెట్టుకోవడం మరవద్దు. అలాగే చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం/శానిటైజ్‌ చేసుకోవడం, ఒంట్లో నలతగా ఉందనిపిస్తే ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా స్వీయ ఐసోలేషన్‌లో ఉండడం.. వంటివి తప్పనిసరిగా పాటించాలి. మరి, కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలన్నీ మనమూ పాటించేద్దాం.. కొత్త ఏడాదికి ఆరోగ్యకరమైన రీతిలో స్వాగతం పలికేద్దాం.. ఏమంటారు?!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని