పిల్లలకు ఈ మర్యాదలు నేర్పిస్తున్నారా?

చదువు మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్లాడంటే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాడని అర్థం. అందుకే చాలామంది తల్లిదండ్రులు ఫీజులు భారమైనా తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని ఉత్తమ పాఠశాలల్ని...

Published : 22 Jun 2022 13:20 IST

చదువు మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఒక విద్యార్థి పాఠశాలకు వెళ్లాడంటే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాడని అర్థం. అందుకే చాలామంది తల్లిదండ్రులు ఫీజులు భారమైనా తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని ఉత్తమ పాఠశాలల్ని ఎంచుకుంటారు. అయితే ఇక్కడ పిల్లలకు మార్కులు, ర్యాంకులు మాత్రమే ముఖ్యం కాదు.. వారికి కొన్ని కనీస మర్యాదలు నేర్పించడం అత్యవసరమని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల వారికి మంచి విద్యతో పాటు సత్ప్రవర్తన కూడా అలవడుతుంది. ఈ క్రమంలో పిల్లలు పాఠశాల దశలోనే నేర్చుకోవాల్సిన కొన్ని మర్యాదల గురించి తెలుసుకుందాం..

కళ్లలోకి కళ్లు పెట్టి..!

ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు వారి కళ్లలోకి చూడకుండా దిక్కులు చూస్తే అవతలి వారికి వీళ్లతో మాట్లాడాలన్న ఆసక్తి తగ్గుతుంది.. అంతేకాదు.. ఇది పిల్లల్లో భయం, బిడియానికి ఓ కారణం కావచ్చు. అందుకే అవతలి వారితో సూటిగా కళ్లలోకి చూసి మాట్లాడేలా పిల్లలకు శిక్షణ ఇవ్వాలి. ఇది వారికి వ్యక్తిగతంగానే కాదు.. పెద్దయ్యే కొద్దీ కెరీర్‌ పరంగా, స్టేజ్‌ ఫియర్‌ను తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. మొదటిసారి ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యే వారికి కూడా ఇదే చెబుతుంటారు నిపుణులు. అయితే కొంతమంది పిల్లలు ఆటిజం, మానసిక సమస్యల వల్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు పక్కకు చూస్తుంటారు. ఇంకొంతమంది పిల్లలు ఎలా మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తుంటారు. ఇలాంటి వాళ్ల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించడం ముఖ్యం. దీన్ని అటు పాఠశాలలో ప్రాక్టీస్‌ చేయించడంతో పాటు.. ఇంటి వద్ద కూడా భోజనం చేసేటప్పుడు, ఆటలు ఆడుతున్నప్పుడు, ఇతర పనుల పరంగా.. ఇలా ఎక్కువగా వారితో మాట కలుపుతూ సాధన చేయించాలి.

పంచుకోవడంలోనే  పరమార్థం..

సామాజిక అంశాల గురించి పిల్లలు ఇంటి దగ్గర కంటే పాఠశాలలోనే ఎక్కువగా నేర్చుకుంటారు. పాఠశాలలో తమ వయసుకు చెందిన పిల్లలు ఎక్కువగా ఉండడం వల్ల వారితో ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ సమయంలోనే షేరింగ్‌, కేరింగ్‌ వంటి అంశాలను నేర్పించాలంటున్నారు నిపుణులు. తమ వస్తువులను ఇతురులతో పంచుకోవడం, అవసరమైన వారికి తమ వంతు సహాయం చేయడం వంటి లక్షణాలను.. టీచర్లు బోధించడం ద్వారా పిల్లలు త్వరగా గ్రహించగలుగుతారు. అలాగే ఇంటి వద్ద కూడా తల్లిదండ్రులు వివిధ ప్రత్యేక సందర్భాల్లో పిల్లల్ని ఆయా సేవా కార్యక్రమాల్లో భాగం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఈ తరహా లక్షణం వారికి భవిష్యత్తులోనూ మంచి పేరు తెచ్చిపెడుతుంది.

అనుమతి తప్పనిసరి...

స్నేహితులు/శ్రేయోభిలాషుల గురించిన విషయాలను, వస్తువులు, వీడియోలను ఇతరులతో పంచుకునే ముందు వారి అంగీకారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. కానీ ఈ రోజుల్లో పిల్లలతో పాటు చాలామంది పెద్దలు కూడా ఈ మర్యాదను మర్చిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కొన్నిసార్లు అవతలి వారికి, మనకు భేదాభిప్రాయాలొచ్చే ఆస్కారం ఉంటుంది. కొంతమంది పిల్లలు కూడా తమ స్నేహితులకు చెప్పకుండా వారి వస్తువులు తీసుకుంటారు. ఇది చూడడానికి చిన్న సమస్యలాగా అనిపించినా పెద్దయ్యే కొద్దీ పెద్ద వస్తువులు తీసుకునే/దొంగిలించే స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ఇతరులకు సంబంధించి ఏ పని చేసినా వారి అనుమతి తీసుకోవాలని, లేకపోతే దానివల్ల ఎదురయ్యే పర్యవసానాల గురించి పిల్లలకు చిన్న వయసు నుంచే అర్థమయ్యేలా వివరించాలి.

అందరూ ఒక్కటే...

సమాజంలో చాలామంది కులం, మతం, రంగు, రూపు, బరువు.. వంటి విషయాల్లో ఇతరులను అవహేళన చేయడం మనం చూస్తూనే ఉంటాం. దీనివల్ల అవతలి వారు బాధపడతారన్న కనీస జ్ఞానం కూడా వారికి ఉండదు. పిల్లలు తమ తోటి పిల్లల్ని బుల్లీయింగ్‌ చేయడం కూడా ఇలాంటిదే! కాబట్టి దీనివల్ల అవతలి వ్యక్తి పడే బాధ, మానసిక ఒత్తిడి గురించి చిన్నారులకు వివరించడం ముఖ్యం. తద్వారా వారు తప్పకుండా ఏది మంచి, ఏది చెడు అన్న విషయం అర్థం చేసుకుంటారు. అలాగే పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, విభిన్న సంస్కృతులకు చెందిన పిల్లలుంటారు. కాబట్టి, ఈ సమయంలోనే మన దేశం ఎలాగైతే ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే సిద్ధాంతాన్ని పాటిస్తోందో.. ఎలా ఉన్నా, ఎక్కడ్నుంచి వచ్చినా.. మనమందరం ఒక్కటేనన్న భావనకు పిల్లల్లో పసి వయసు నుంచే బీజం వేయాలి. తద్వారా వారు ఎదిగే కొద్దీ సత్ప్రవర్తనతో మసలుకుంటారని చెబుతున్నారు నిపుణులు.

నీతి ఎక్కడుంది?!

పూర్వం పాఠశాలలంటే ఆశ్రమాలే. అందులో ఉండే గురువులు రామాయణం, మహాభారతం వంటి ఇతివృత్తాలతో పాటు పంచతంత్ర కథలను పిల్లలకు చెప్పేవారు. ఈ క్రమంలో ఒక్కో కథ చెబుతూ అందులోని నీతిని పిల్లలకు వివరించేవారు. దాంతో పిల్లలకు ఏయే సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి? వంటి విషయాలు తెలిసేవి. కొన్ని తెలుగు పుస్తకాల్లో కూడా ఇలాంటి నీతి పాఠాలు ఉంటాయి. కానీ, ప్రస్తుతం ఎక్కువగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు పుట్టుకురావడం, తల్లిదండ్రులు కూడా తమ తమ విధుల్లో బిజీగా ఉండడం వల్ల ఇలాంటి నీతి కథలు చెప్పే వారే కరువవుతున్నారు. అందుకే ఇలాంటి కథలు పిల్లలకు చెప్పడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. అయితే కథలు కాకపోయినా నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల్ని ఉదాహరణలుగా తీసుకొని పిల్లలకు వివరించినా ఫలితం ఉంటుందంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్