Published : 03/02/2023 00:10 IST

బలహీనత కాదు.. వాళ్లే బలం!

‘ఇద్దరూ ఆడవాళ్లే.. రాణించడం అసాధ్యం’ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు చాలామంది అన్న మాట ఇది. విదేశాల్లో తొమ్మిదేళ్ల ఉద్యోగానుభవం. పిల్లలు పుట్టడానికి ముందు దేశానికి తిరిగొచ్చా. నా బాల్యమంతా ఆరోగ్యకరమైన ఆహారం, ప్రకృతి మధ్య సాగింది. నా పిల్లలకీ అలాంటి వాతావరణం కల్పించాలనుకున్నా. శ్రేయదీ అదే ఆలోచన. పిల్లలకు ప్రిజర్వేటివ్స్‌, చక్కెరలు లేని స్నాక్స్‌ అందించాలని చాలా వెతికాం. కానీ దొరకలేదు. ‘మనమే చేసి అందిస్తే’ అన్న ఆలోచన వచ్చాక ‘ద మమ్మమ్‌ కో’ ప్రారంభించాం. దీనికోసం ఎంతో పరిశోధన చేశాం. తీరా ఏం అందించాలి, వేటిని ఇష్టపడతారు వంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొని మొదలుపెట్టాక సలహాలు మొదలయ్యాయి. పిల్లలు, కెరియర్‌ రెండు పడవల మధ్యా ప్రయాణం మంచిది కాదన్నారు. అమ్మయ్యాక చాలామంది ఆడవాళ్లకి పిల్లలు, కెరియర్‌ల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలన్న ఒత్తిడి మొదలవుతుంది. పోనీ రెంటినీ సమన్వయం చేద్దామన్నా ‘చేయలేవు, పిల్లలకు అన్యాయం చేస్తున్నావ’నే అపరాధ భావనతో నింపేస్తారు. కానీ నేనవేమీ పట్టించుకోలేదు. ఇద్దరు పిల్లలదీ ఆరేళ్లలోపే వయసు. ‘కన్నా.. మీతోపాటు అమ్మ మీ ఫ్రెండ్స్‌కీ హెల్దీ స్నాక్స్‌ ఇవ్వాలనుకుంటోంది. నాకు మీరు సపోర్ట్‌ చేస్తారా?’ అని అడిగానోసారి. ఆనందంగా తలూపారు. తర్వాతి నుంచి నా షెడ్యూల్‌ పిల్లలకు అనుగుణంగా మార్చుకుంటూ వచ్చా. ఎప్పుడైనా వీలవ్వకపోతే వాళ్లే అర్థం చేసుకునేవారు. మనం వాళ్లకేం తెలీదనుకుంటాం కానీ.. మనల్ని బాగా అర్థం చేసుకోగలరు. వాళ్ల భాషలో చెప్పాలంతే. అందుకే పిల్లల్ని అమ్మల బలహీనతంటే నేను ఒప్పుకోను. తల్లిగా, వ్యాపారవేత్తగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించగలుగుతున్నానంటే నా పిల్లల తోడ్పాటే కారణం. మీదీ తల్లిగా ఇదే సందిగ్ధతా? వాళ్లతో ఓసారి పంచుకొని చూడండి. 

- ఫరా నాతాని మెంజీస్‌,సహవ్యస్థాపకురాలు, ద మమ్మమ్‌ కో.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని