Nobel Prize: మనసుని హత్తుకునే కథలకు ప్రాణం పోసి..!

‘అర్థవంతమైన పదబంధాలకు చక్కటి సందేశాన్ని జోడిస్తూ.. పాఠకుల మదిని స్పృశించేలా, వారికి అర్థమయ్యే రీతిలో సరళంగా రచన సాగాలం’టారు 82 ఏళ్ల ఫ్రెంచ్‌ రచయిత్రి అనీ ఎర్నాక్స్‌. తన స్వీయానుభవాలు, వివిధ అంశాలకు సంబంధించి మహిళలు బయటకు చెప్పుకోలేని భావోద్వేగాలు, చుట్టూ జరిగే సంఘటనలే....

Published : 08 Oct 2022 12:43 IST

(Photos: Twitter)

‘అర్థవంతమైన పదబంధాలకు చక్కటి సందేశాన్ని జోడిస్తూ.. పాఠకుల మదిని స్పృశించేలా, వారికి అర్థమయ్యే రీతిలో సరళంగా రచన సాగాలం’టారు 82 ఏళ్ల ఫ్రెంచ్‌ రచయిత్రి అనీ ఎర్నాక్స్‌. తన స్వీయానుభవాలు, వివిధ అంశాలకు సంబంధించి మహిళలు బయటకు చెప్పుకోలేని భావోద్వేగాలు, చుట్టూ జరిగే సంఘటనలే ప్రధానాంశంగా.. ఎక్కడా రాజీ పడకుండా ఆమె చేసే రచనలు ప్రపంచవ్యాప్తంగా పాఠకాదరణను సొంతం చేసుకున్నాయి. ఇందుకు గుర్తింపుగానే తాజాగా సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక ‘నోబెల్‌ పురస్కారం’ అనీని వరించింది. 121 ఏళ్ల నోబెల్‌ ప్రైజ్‌ చరిత్రలో సాహిత్యంలో 115 అవార్డుల్ని ప్రదానం చేయగా.. వారిలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోనున్న 17వ మహిళగా నిలిచారీ ఫ్రెంచ్ రచయిత్రి.

ఫ్రాన్స్‌లోని నార్మండీలో 1940లో జన్మించారు అనీ.  కొన్నేళ్ల తర్వాత ఆమె కుటుంబం అక్కడికి దగ్గర్లోని మరో ప్రాంతానికి మకాం మార్చింది. అక్కడే ఆమె తల్లిదండ్రులిద్దరూ ఓ కిరాణా కొట్టు, కాఫీ షాపు ప్రారంభించి జీవనం సాగించేవారు. అనీ తల్లికి చదువంటే మహా ఇష్టం. విద్యతోనే జీవితాన్ని సన్మార్గంలో పెట్టుకోవచ్చన్న నమ్మకం ఆమెది. ఈ క్రమంలోనే ఆర్థికంగా ఇబ్బందులున్నా అనీని స్కూల్‌కి పంపించే ఏర్పాటుచేశారామె.

టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించి..!

అనీది ఆర్థికంగా కాస్త వెనకబడిన కుటుంబం. దీంతో పాఠశాలలో తోటి విద్యార్థుల నుంచి పలు అవమానాలు ఎదుర్కొందామె. ‘ఈ సమాజానికి భయపడి మనల్ని మనం తక్కువ చేసి చూసుకోవడం సరికాదు. ఇలాంటి పరిమితులు, అనవసరమైన నియమనిబంధనలు జీవితంలో మనల్ని మనం నిరూపించుకోకుండా అడ్డుపడతాయి..’ అంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు అనీ. చదువు పూర్తయ్యాక కొన్నేళ్ల పాటు స్కూల్‌ టీచర్‌గా, మరికొన్నేళ్ల పాటు దూరవిద్యలో బోధన చేసిన ఆమె.. 2000లో టీచింగ్‌ వృత్తిని వదిలిపెట్టారు. ఆ తర్వాత తన పూర్తి కెరీర్‌ను రచనలకే అంకితం చేశారు. తొలుత కల్పిత కథలు, ఆ తర్వాత ఆత్మకథలపై పట్టు సాధించిన ఆమె.. తన స్వీయానుభవ రచనలతో అశేష పాఠకాభిమానుల్ని సంపాదించుకున్నారు.

సున్నితమైన కథాంశాలతో..

శారీరక, మానసిక, లైంగిక.. ఇలా వివిధ అంశాలకు సంబంధించి మహిళలు చాలా సందర్భాలలో తమ అభిప్రాయాలను, కోరికలను బయటికి చెప్పుకోలేరు. సమాజం ఏమనుకుంటుందోనని అనుక్షణం తమను తామే జడ్జ్ చేసుకుంటూ, తమ భావోద్వేగాలను తమలో తామే దాచేసుకుంటారు. ఇలాంటి సున్నితమైన అంశాలనే కథాంశాలుగా తీసుకొని సరళమైన రీతిలో రచనలు చేయడంలో అనీ దిట్ట. తన స్వీయానుభవాలు, తన చుట్టూ జరుగుతోన్న సంఘటనల్ని తన రచనల్లో ప్రతిబింబించడం ఆమె ప్రత్యేకత! ఈ క్రమంలోనే.. 18 ఏళ్ల వయసులో  ఎదురైన లైంగిక అనుభవం, తదనంతర పరిణామాలను ప్రధానాంశంగా చేసుకుని ‘ఎ గర్ల్స్‌ స్టోరీ’ పేరుతో ఓ పుస్తకం రాశారామె. ఇక 23 ఏళ్ల వయసులో తన స్వీయ గర్భవిచ్ఛి్త్తికి సంబంధించిన అనుభవాలను రంగరిస్తూ ‘హ్యాపెనింగ్‌’ పేరుతో మరో రచన చేశారు అనీ. తన ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి ప్రస్తావిస్తూ ఈ ఏడాది ‘గెట్టింగ్‌ లాస్ట్‌’ పేరుతో మరో పుస్తకం రాశారీ ఫ్రెంచ్‌ రచయిత్రి. ఇవే కాదు.. తన తల్లిదండ్రులు ఆర్థికంగా ఎదిగే క్రమం, తన టీనేజ్‌ అనుభవాలు, అల్జీమర్స్‌ వ్యాధి, తన తల్లి మరణం, రొమ్ము క్యాన్సర్‌.. వంటి అంశాలపై మరిన్ని పుస్తకాలు రాశారు అనీ. ఇలా తన 22 ఏళ్ల సాహిత్య కెరీర్‌లో సుమారు 30కి పైగా రచనలు చేశారామె.

ఆమె రచనా శైలికి ‘నోబెల్’!

అనీ సరళమైన రచనా శైలి ఆమెకు ఎన్నో అవార్డులు-రివార్డులు తెచ్చిపెట్టింది. తన ఆత్మకథ ‘ది ఇయర్స్‌’కి గాను ‘Prix Renaudot’ అవార్డు అందుకుందామె. ఆపై ఇదే పుస్తకం 2019లో ప్రతిష్టాత్మక ‘మ్యాన్‌ బుకర్ ప్రైజ్‌’ తుది జాబితాకు ఎంపికైంది. ఇలా సాహిత్య రంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది సాహిత్యం విభాగంలో ప్రతిష్టాత్మక ‘నోబెల్‌ బహుమతి’ కూడా ఆమె సొంతమైంది.

‘అనీ రచనల్లో నిజజీవితానుభవాలు, జీవితంలోని విభిన్న పార్శ్వాలు,  వైరుధ్యాలు, పరిమితుల గురించి ధైర్యంగా తన రచనల్లో బహిర్గతం చేయడం ఆమెకే చెల్లింది..’ అంటూ స్వీడిష్ అకాడమీ అనీపై ప్రశంసలు కురిపించింది. ‘నా రెండు దశాబ్దాల సాహిత్య కెరీర్‌లో నాకు దక్కిన అత్యంత గొప్ప గౌరవం ఇది!’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారీ ఫ్రెంచ్‌ రచయిత్రి. 121 ఏళ్ల నోబెల్‌ ప్రైజ్‌ చరిత్రలో భాగంగా.. సాహిత్యంలో 115 అవార్డుల్ని ప్రదానం చేయగా.. వారిలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోనున్న 17వ మహిళ అనీ. ఈ అవార్డు కింద రూ. 7.43 కోట్ల నగదు బహుమతి ఆమె సొంతం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్