వైట్‌డిశ్చార్జి.. ‘సహజం’గానే తగ్గించుకోవచ్చు!

వైట్‌ డిశ్చార్జి.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది మహిళల్లో ఈ సమస్య తలెత్తుతుంటుంది. అయితే ఇది సాధారణ సమస్యే అయినా.. దీని లక్షణాలను బట్టి తీవ్రతను అంచనా వేయచ్చంటున్నారు నిపుణులు. అండం విడుదలయ్యే సమయంలో, కలయికలో....

Published : 08 Feb 2023 19:38 IST

వైట్‌ డిశ్చార్జి.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది మహిళల్లో ఈ సమస్య తలెత్తుతుంటుంది. అయితే ఇది సాధారణ సమస్యే అయినా.. దీని లక్షణాలను బట్టి తీవ్రతను అంచనా వేయచ్చంటున్నారు నిపుణులు. అండం విడుదలయ్యే సమయంలో, కలయికలో పాల్గొన్నప్పుడు.. ఈ డిశ్చార్జి సహజమేనని, అలాగని తరచూ అవుతుంటే మాత్రం వెంటనే నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. దాంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా సమస్యను తగ్గించే వీలుందని సలహా ఇస్తున్నారు. మరి, వైట్‌ డిశ్చార్జి సమస్యను తగ్గించే సహజసిద్ధమైన చిట్కాలేంటో తెలుసుకుందాం రండి..

సమస్యకు ఇవీ కారణం కావచ్చు!

అండం విడుదలైనప్పుడు, కలయికలో పాల్గొన్నప్పుడు కొద్దిపాటి వైట్‌ డిశ్చార్జి సహజమే. కానీ కొంతమందిలో ఇది ఆ రెండు సమయాల్లో కాకుండా ఇతర సమయాల్లో కూడా అవుతుంటుంది. ఇందుకు శారీరకంగా బలహీనంగా ఉండడం, ఇన్ఫెక్షన్లు, వ్యక్తిగత శుభ్రత కొరవడడం.. వంటివీ కారణాలు కావచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ డిశ్చార్జి తెలుపు రంగులో కాకుండా తెలుపు-బూడిద, గోధుమ, తుప్పు.. వంటి రంగుల్లో అవుతున్నా; డిశ్చార్జితో పాటు దురద, మంట ఉన్నా తీవ్రంగా పరిగణించాలని.. ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇలా తరచూ వైట్‌ డిశ్చార్జి అవడం వల్ల నీరసం, చిరాకు, తలనొప్పి, మలబద్ధకం.. వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్యను తగ్గించుకోవడానికి నిపుణుల సలహా మేరకు మందులు వాడితే దీని కారణంగా తలెత్తే ఇతర వ్యాధుల్ని రాకుండా ముందే నివారించుకోవచ్చు.

సహజ చిట్కాలతో..

అయితే మరీ తీవ్రమైన వైట్‌ డిశ్చార్జి కాకుండా సాధారణంగా అవుతున్నట్లయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. అవేంటంటే..

వైట్‌ డిశ్చార్జి సమస్యకు మెంతులు సత్వర పరిష్కారం చూపుతాయి. ఇందుకోసం అర లీటర్‌ నీటిలో కొన్ని మెంతుల్ని వేసి నీళ్లు సగమయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఆపై వడకట్టుకొని చల్లారాక ఆ నీటిని తాగాలి. తరచూ ఈ చిట్కా పాటించడం వల్ల సమస్య నుంచి క్రమంగా బయటపడచ్చు.

ఒక గ్లాస్‌ నీళ్లలో కొన్ని ధనియాలు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వడకట్టుకొని పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజుల్లో సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

అంజీర్‌, అంజీర్‌ పొడి కూడా ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపిస్తుంది. ఇందుకోసం రోజుకు రెండుమూడు అంజీర్‌లను గ్లాసు నీళ్లలో రాత్రంతా నానబెట్టుకొని.. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని స్మూతీలా చేసుకొని పరగడుపున తీసుకోవాలి. లేదంటే టీస్పూన్‌ అంజీర్‌ పొడిని రెండు కప్పుల నీటిలో కలుపుకొని తీసుకున్నా ఫలితం ఉంటుంది.

ఉసిరి పొడి కూడా వైట్‌ డిశ్చార్జికి విరుగుడుగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఉసిరి కాయను ముక్కలుగా చేసి.. కొన్ని రోజులు ఎండలో ఎండబెట్టాలి. అవి పూర్తిగా ఆరాక పొడి చేసుకొని సీసాలో భద్రపరచుకోవాలి. రోజూ రెండు టీస్పూన్ల ఉసిరి పొడికి, రెండు టీస్పూన్ల తేనె కలిపి పేస్ట్‌లా చేసుకొని తీసుకోవాలి. లేదంటే ఈ రెండింటినీ నీళ్లలో కలిపి కూడా తాగచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు.

కొంతమంది వైట్ డిశ్చార్జితో పాటు దుర్వాసన సమస్యతో కూడా బాధపడుతుంటారు. అలాంటివారు కొన్ని నీళ్లలో కొన్ని బెండకాయ ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని చిక్కటి స్మూతీలా చేసుకొని తీసుకోవాలి. లేదంటే బెండకాయ ముక్కల్ని పెరుగులో కూడా నానబెట్టుకొని తినొచ్చు. పెరుగు వెజైనా దగ్గర వైట్‌ డిశ్చార్జికి కారణమయ్యే బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటుంది.

అరటిపండ్లు కూడా వైట్‌ డిశ్చార్జిని తగ్గించడంలో ముందుంటాయి. ఇందుకోసం రోజూ రెండు అరటి పండ్లను తీసుకోవడం మంచిది.

రోజుకో దానిమ్మ కాయను తీసుకోవడం లేదంటే దానిమ్మ రసం తాగడం వల్ల కూడా వైట్‌ డిశ్చార్జి సమస్యకు చెక్‌ పెట్టచ్చు. అంతేకాదు.. కొన్ని దానిమ్మ ఆకుల్ని పేస్ట్‌ చేసుకొని గ్లాస్‌ నీళ్లలో కలుపుకొని పరగడుపునే తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే తులసి వైట్‌ డిశ్చార్జి సమస్యను కూడా తగ్గించడంలో సహకరిస్తుంది. ఇందుకోసం తులసి ఆకుల రసంలో కొద్దిగా తేనె కలుపుకొని తీసుకోవాలి. లేదంటే పాలల్లో కూడా తులసి ఆకుల రసాన్ని కలుపుకొని తాగచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే సమస్య నుంచి విముక్తి పొందచ్చు.

కొన్ని జామ ఆకుల్ని గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమం సగం అయ్యాక వడకట్టుకొని చల్లారాక తీసుకోవాలి. రోజుకు రెండుసార్లు ఈ చిట్కా పాటించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.

కొన్ని నీళ్లలో రెండు టీస్పూన్ల అల్లం పొడి వేసి నీళ్లు సగం అయ్యేంత వరకు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి ఆ తర్వాత వడకట్టుకొని తాగాలి. ఇలా మూడు నాలుగు వారాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.

గంజిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ గంజి వార్చి చల్లారాక తీసుకోవడం వల్ల సమస్య నుంచి త్వరగా బయటపడచ్చు.


ఇవి గుర్తుంచుకోండి!

వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్ల కూడా ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా, ఫంగస్‌ వృద్ధి చెంది వైట్‌ డిశ్చార్జికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి వెజైనాను తరచూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం గాఢత తక్కువగా ఉండే సబ్బులు, గోరువెచ్చటి నీళ్లు ఉపయోగించాలి. అంతేకానీ సువాసనతో కూడిన సబ్బులు, స్ప్రేలు వంటివి వాడకూడదు.

శుభ్రం చేసుకున్న తర్వాత కాటన్‌ టవల్‌తో ఆ ప్రదేశాన్ని పొడిగా తుడుచుకోవడం కూడా ముఖ్యమే.

మరీ బిగుతుగా ఉన్న లోదుస్తులు కాకుండా కాస్త ఫ్రీగా, శరీరానికి సౌకర్యవంతంగా ఉండేలా, కాటన్‌తో తయారుచేసినవి వేసుకుంటే చర్మానికి ఎలాంటి రాపిడి, అసౌకర్యం ఉండదు.

గమనిక: వైట్‌ డిశ్చార్జిని తగ్గించుకునేందుకు ఇంట్లో అందుబాటులోనే ఉండే కొన్ని పదార్థాలు ఎలా ఉపయోగపడతాయి? వ్యక్తిగత పరిశుభ్రత పరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మొదలైన విషయాలు తెలుసుకున్నారు కదా! ఇవన్నీ సహజసిద్ధమైన పదార్థాలే కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవు. అయినా సమస్య తగ్గకపోయినా, ఇతర రంగుల్లో డిశ్చార్జి కనిపించినా, దుర్వాసన-దురద-మంట.. వంటి సమస్యలున్నా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత వైద్య నిపుణుల్ని సంప్రదిస్తే తగిన చికిత్స అందిస్తారు. ఫలితంగా అది ఇతర సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్