Cheetah Ladies: ‘చీతా’లతో అలా దోస్తీ కట్టారు..!

ప్రాజెక్ట్‌ చీతా.. గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. 74 ఏళ్ల క్రితం దేశంలో అంతరించిపోయిన చీతా జాతిని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ చేపట్టిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగానే ఇటీవలే నమీబియా నుంచి వచ్చిన ఎనిమిది.....

Updated : 21 Sep 2022 20:20 IST

(Photos: Twitter)

ప్రాజెక్ట్‌ చీతా.. గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. 74 ఏళ్ల క్రితం దేశంలో అంతరించిపోయిన చీతా జాతిని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ చేపట్టిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగానే ఇటీవలే నమీబియా నుంచి వచ్చిన ఎనిమిది చీతాల్ని మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులోకి ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రయత్నం నిన్న అనుకొని.. నేడు సఫలమైంది కాదు.. దీని వెనుక సుమారు పన్నెండేళ్ల కృషి దాగుంది. ఈ ప్రయత్నంలో ఇరు దేశాల ప్రభుత్వాలే కాదు.. ఇద్దరు మహిళల కృషి కూడా ఉందని తెలిసింది చాలా తక్కువమందికే! వాళ్లే ‘చీతా లేడీ’ డాక్టర్‌ ప్రద్న్యా గిరాడ్కర్‌, ఈ ప్రాజెక్ట్‌ హెడ్‌ డాక్టర్‌ లారీ మార్కర్‌. మరి, ఆఫ్రికా నుంచి చీతాల్ని భారత్‌కు రప్పించడంలో వీళ్లు చేసిన ప్రయత్నమేంటో తెలుసుకుందాం రండి..

ఏంటీ ‘ప్రాజెక్ట్‌ చీతా’?

సుమారు 74 ఏళ్ల క్రితం మన దేశంలో అంతరించిపోయిన చీతా జాతిని పునరుద్ధరించేందుకు నిర్దేశించిందే ఈ ‘ప్రాజెక్ట్‌ చీతా’. సుమారు 12 ఏళ్లుగా సాగుతోన్న ఈ ప్రయత్నాలకు 2020 జనవరిలో సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. ఈ అంశంపై ఈ ఏడాది జులై 20న నమీబియా, భారత్‌లు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడంతో చీతాల రాకకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రత్యేక బోయింగ్‌ విమానంలో ఎనిమిది చీతాల్ని నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులోకి వదిలారు. ఈ ప్రయత్నంలో భారత్‌కు చెందిన డాక్టర్‌ ప్రద్న్యా గిరాడ్కర్‌, ఈ ప్రాజెక్ట్‌ హెడ్‌ డాక్టర్‌ లారీ మార్కర్‌లు కీలక పాత్ర పోషించారు.


చీతా లేడీ.. !

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన డాక్టర్ ప్రద్న్యా గిరాడ్కర్‌ను ‘భారత తొలి చీతా సంరక్షణ నిపుణురాలి’గా పేర్కొంటారు. ‘చీతా లేడీ’గానూ పేరు పొందిన ఆమెకు వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంటే చిన్న వయసు నుంచే మక్కువ. ఈ ఆసక్తినే తన చదువులోనూ కొనసాగించారామె. ముంబయి యూనివర్సిటీ నుంచి ‘వన్యప్రాణులు-పర్యావరణ పరిరక్షణ’ అనే అంశంపై ప్రత్యేక అధ్యయనం చేసిన ప్రద్న్యా.. ఈ సమయంలోనే తాను దేశంలో చీతాల పునఃప్రవేశం గురించిన ఆలోచన చేశానంటున్నారు.
‘ముంబయి యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో వన్యప్రాణులు-పులుల సంరక్షణపై ప్రత్యేక అధ్యయనం చేశాను. ఈ క్రమంలోనే మన దేశంలో చీతాలు 1952లోనే అంతరించిపోయాయన్న విషయం తెలుసుకున్నా. అప్పుడే అనిపించింది.. చీతాల్ని తిరిగి మన దేశంలో ప్రవేశపెట్టాలని! 2011లో నమీబియాలో నిర్వహించిన ‘చీతాల పరిరక్షణ శిక్షణ’ కోసం నన్ను ఎంపిక చేయడంతో నా కల నెరవేరినంత సంతోషంగా అనిపించింది. అంతర్జాతీయ చీతా పరిరక్షకురాలు డాక్టర్‌ లారీ మార్కర్‌ ఈ శిక్షణ ఏర్పాటుచేశారు. ఆమెతో కలిసి పనిచేయడం వల్ల వన్యప్రాణి సంరక్షణ, చీతాల పరిరక్షణకు సంబంధించి బోలెడన్ని విషయాల్లో నాకు అవగాహన వచ్చింది..’ అని చెప్పుకొచ్చారు ప్రద్న్యా.

అవగాహనతో చైతన్యం!

వన్యప్రాణి సంరక్షణపై తాను అవగాహన పెంచుకోవడమే కాదు.. ప్రజల్లోనూ చైతన్యం కలిగించడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు ప్రద్న్యా. ఈ క్రమంలోనే ‘వైల్డ్ లైఫ్‌ కన్జర్వేషన్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారామె. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, రైతులు, వన్యప్రాణి పార్కుల చుట్టూ నివసించే స్థానిక గ్రామాల్లో వన్యప్రాణి సంరక్షణ గురించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు విభిన్న కార్యక్రమాలు చేపడుతున్నారామె. గతంలో ముంబయి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గానూ పనిచేసిన ఆమె.. ‘చీతాలను కాపాడాలంటే గడ్డి మైదానాలను కాపాడాలి. దానివల్ల అక్కడుండే ఇతర జంతువులూ సురక్షితంగా ఉంటాయి. ఫలితంగా జీవ వైవిధ్యం అభివృద్ధి చెందుతుంది. లారా మార్కర్‌ నిర్వహించిన శిక్షణలో భాగంగా నేను ఈ విషయాలు తెలుసుకున్నా..’ అంటారామె. ఇలా పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణలో తాను చేసిన కృషికి గుర్తింపుగా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులూ అందుకున్నారీ చీతా లేడీ.


పశువైద్య నిపుణురాలు కావాలనుకొని..!

గత పన్నెండేళ్లుగా కొనసాగిన ‘ప్రాజెక్ట్‌ చీతా’కు నాయకత్వం వహించి సక్సెసయ్యారు అమెరికాకు చెందిన జంతు శాస్త్రవేత్త, పరిశోధకురాలు డాక్టర్‌ లారీ మార్కర్‌. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ చీతా నిపుణుల్లో ఒకరిగా పేరు గాంచిన ఆమె.. 1990లో ‘చీతా కన్జర్వేషన్‌ ఫండ్‌ (సీసీఎఫ్‌)’ను స్థాపించారు. ఇందులో భాగంగా చిరుతలకు పునరావాసం కల్పించడం, వాటిని తిరిగి అడవిలోకి ప్రవేశపెట్టడం.. వంటి విషయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారామె. అలాగే పర్యావరణ పరిరక్షణ, జీవావరణ శాస్త్రంపై పరిశోధనలు చేస్తున్నారు. చిన్న వయసు నుంచే జంతువుల పట్ల ప్రేమను పెంచుకున్న లారీ.. తొలుత పశువైద్య నిపుణురాలిగా స్థిరపడాలనుకున్నారు. కానీ ఆ తర్వాత తన పూర్తి దృష్టిని జంతు సంరక్షణ పైకి మళ్లించారు.

అది మన చేతుల్లోనే ఉంది!

తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా నమీబియాను సందర్శించిన ఆమె.. అక్కడి రైతులు అడవుల్లోని చీతాల్ని వేటాడి చంపుతున్నారని, దానివల్లే అక్కడ చీతా జాతి సగానికి సగం అంతరించిపోయిందని తెలుసుకున్నారు. ఈ హింసను ఆపాలని కంకణం కట్టుకున్న ఆమె.. చీతా జాతిని తిరిగి పునరుద్ధరించడంలో విశేష కృషి చేశారు. చీతాలపై తనకున్న ప్రేమతో యూఎస్‌లోని ‘వైల్డ్ లైఫ్‌ సఫారీ జాతీయ పార్క్‌’లో జన్మించిన చీతా పిల్లను దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఎక్కడికెళ్లినా దాంతో కలిసే మీడియాకు కనిపించేవారు లారీ. ప్రస్తుతం తన సంస్థ కార్యకలాపాలతో పాటు వాషింగ్టన్‌ డీసీలోని ‘NOAH Center’ అనే జంతు సంరక్షణ సంస్థకు రీసెర్చ్‌ ఫెలోగా ఉన్నారు.

‘చాలా విషయాల్లో మనం ఇది మన పని కాదన్నట్లుగా వ్యవహరిస్తాం.. వన్యప్రాణి సంరక్షణ కూడా అంతే! మూగజీవాల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారనుకుంటాం.. కానీ వన్యప్రాణి సంరక్షణ కోసం నడుం బిగించిన తొలినాళ్లలోనే ఈ జీవాల్ని చూసుకోవడానికి ఎవరూ లేరన్న విషయం నాకు అర్థమైంది. అందుకే చీతాల సంరక్షణ బాధ్యతలు నేను తీసుకున్నా. ఇందులో నీ-నా అనే తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ భాగమైతేనే జీవ వైవిధ్యం సాధ్యమవుతుంది..’ అంటారు లారీ. వన్యప్రాణి సంరక్షణలో తన కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు అందుకున్న ఈ చీతా లవర్‌కు 2020లో ‘Explorers Club President’s Award’ వరించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్