ఇద్దరమ్మాయిల రొమాంటిక్‌ ప్రేమకథ..!

సోషల్‌ మీడియాలో పరిచయం, ఆపై ఒకరినొకరు ఇష్టపడడం, ప్రేమించుకోవడం, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం.. సాధారణంగా ఇవన్నీ ఓ అమ్మాయి, అబ్బాయి మధ్యలో జరగడం చూస్తుంటాం. కానీ అచ్చం ఇలాంటి ప్రేమకథే ఇద్దరమ్మాయిల మధ్య చోటుచేసుకుంది.. గత నాలుగేళ్లుగా పీకల్లోతు....

Published : 24 Sep 2022 12:56 IST

(Photos: Instagram)

సోషల్‌ మీడియాలో పరిచయం, ఆపై ఒకరినొకరు ఇష్టపడడం, ప్రేమించుకోవడం, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం.. సాధారణంగా ఇవన్నీ ఓ అమ్మాయి, అబ్బాయి మధ్యలో జరగడం చూస్తుంటాం. కానీ అచ్చం ఇలాంటి ప్రేమకథే ఇద్దరమ్మాయిల మధ్య చోటుచేసుకుంది.. గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ లెస్బియన్‌ జంట.. ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయింది. దీంతో ఈ స్వలింగ జంటకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆ అమ్మాయిలెవరు? వాళ్ల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? తెలుసుకోవాలంటే.. ఈ ప్రేమకథ చదివేయండి!

సూఫీ మాలిక్‌, అంజలీ చక్రా.. నేపథ్యాలు, దేశాలు వేరైనా ఈ ఇద్దరి మనసులు కలిశాయి. వీరిలో పాకిస్థాన్‌కు చెందిన సూఫీ ఆర్టిస్ట్‌, టీచర్‌గా న్యూయార్క్‌లో స్థిరపడగా.. భారత్‌కు చెందిన  అంజలి ఈవెంట్‌ ప్లానర్‌గా, ప్రొడ్యూసర్‌గా పని చేస్తోంది. నాలుగేళ్ల క్రితం వీళ్లు కలుసుకోవడం దగ్గర్నుంచి ఇటీవలే నిశ్చితార్థం చేసుకునే దాకా.. వీళ్లు వేసిన ప్రతి అడుగూ ఓ సినిమా కథను తలపిస్తుందనడంలో సందేహం లేదు.

ఏడేళ్లు టచ్‌లోనే ఉన్నా..!

2018లో నేరుగా తొలిసారి కలుసుకున్న ఈ జంటకు.. అంతకు ఏడేళ్ల ముందు నుంచే పరిచయం ఉంది. ‘Tumblr’ అనే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌లో ఇద్దరూ బ్లాగులు రాసేవారు. ఒకరి బ్లాగును మరొకరు ఫాలో అవడం తప్ప ఎప్పుడూ మాట్లాడుకుంది లేదు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు ఇన్‌స్టాగ్రామ్‌లోకి మారిన ఈ ఇద్దరూ.. అప్పట్నుంచి ఒకరినొకరు ఫాలో అవడం మొదలుపెట్టారు. అనుభవాలు, సమస్యలు, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ తమ స్నేహాన్ని మరింత దృఢం చేసుకున్నారు. అయితే 2018లో ఓసారి అంజలి తన ఫ్రెండ్‌ని కలవడానికని న్యూయార్క్‌కి వెళ్లింది. అప్పుడే సూఫీని కలుసుకోవాలనుకుందామె. అలా అక్కడి ఎంపైర్‌ బిల్డింగ్‌పై ఈ ఇద్దరూ తొలిసారి నేరుగా కలుసుకున్నారు. ‘తొలి చూపులోనే ఇద్దరి మధ్య ఏదో ఆత్మీయ బంధం ఉన్నట్లనిపించింది. చాలాసేపు మాట్లాడుకున్నాం.. తిరిగి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లేటప్పుడు కూడా ఒకరినొకరు వీడలేకపోయాం..’ అంటూ తమ తొలి మీట్‌ గురించి చెప్పుకొచ్చారీ జంట.

ఫొటోషూట్‌తో ప్రేమ వైరల్‌..!

అయితే అప్పటికే అంజలికి తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అవడం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం, ఆ సమయంలో సూఫీనే అండగా నిలవడంతో వాళ్ల మధ్య అనుబంధం మరింతగా పెనవేసుకుంది. ఆ తర్వాత కూడా ఇద్దరూ వెకేషన్లకు వెళ్లడం, స్నేహితుల పార్టీల్లో కలుసుకోవడం, పుట్టినరోజులు-ఇతర ప్రత్యేక సందర్భాల్ని కలిసే చేసుకోవడం.. ఇలా వాళ్లు వేసిన ప్రతి అడుగూ ఇద్దరినీ మరింత దగ్గర చేసిందని చెప్పచ్చు. ఇక ఒకరి మనసులో ఒకరున్నారని తెలుసుకున్న సూఫీ, అంజలి మధ్య జరిగిన ప్రేమ ప్రతిపాదన  గురించి ఎవరికీ తెలియకపోయినా.. 2019లో ఓ ఫొటోషూట్‌లో పాల్గొని తమ ప్రేమను అధికారికంగా ప్రకటించిందీ జంట. ఓ ఫ్యాషన్‌ సంస్థ నిర్వహించిన ఈ ఫొటోషూట్‌లో రొమాంటిక్‌గా పోజులిచ్చిన ఈ కపుల్‌.. తమ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకోగా అప్పట్లో తెగ వైరలయ్యాయి.

వాళ్లింట్లో ఒప్పుకోలేదు!

ఈ మధ్య అక్కడక్కడ లెస్బియన్‌ వివాహాలు జరుగుతున్నప్పటికీ.. చాలా కుటుంబాల్లో ఇలాంటి ప్రేమను అంగీకరించడమంటే కష్టమనే చెప్పాలి. సూఫీకీ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తన ఇంట్లో వీళ్ల రిలేషన్‌షిప్‌ను అంగీకరించలేదు. కానీ ఆమె స్నేహితులు, కజిన్స్‌.. మాత్రం ఈ జంటకు మద్దతుగా నిలిచారు. ఇక, మరోవైపు అంజలి కుటుంబం ఇందుకు భిన్నం. ‘మా ఇంట్లో అందరూ మా ప్రేమను, రిలేషన్‌షిప్‌ను అంగీకరించారు. ముఖ్యంగా మా అమ్మతో సూఫీకి మంచి అనుబంధం ఉంది. వాళ్లిద్దరూ కలిసి అప్పుడప్పుడూ అలా షికారుకి కూడా వెళ్లొస్తుంటారు..’ అంటూ మురిసిపోతోంది అంజలి.

నిశ్చితార్థం.. స్వీట్‌ మెమరీస్‌!

ఇలా మొత్తానికి నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోన్న ఈ జంట.. ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. అది కూడా తాము మొదటిసారి కలుసుకున్న న్యూయార్క్‌లోని ఎంపైర్‌ బిల్డింగ్‌లోనే! ఈ క్రమంలో ఇద్దరూ మరోసారి ప్రేమగా ప్రపోజ్‌ చేసుకొని.. ఉంగరాలు మార్చుకొని.. నిశ్చితార్థం చేసుకున్నారు.. ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ స్వీట్‌ మెమరీస్‌ని ఫొటోల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మురిసిపోయిందీ జంట. ప్రస్తుతం ఈ జంట ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో ఈ స్వలింగ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఓవైపు తమ తమ వృత్తుల్లో బిజీగా ఉన్న సూఫీ-అంజలి.. తమ పేర్లతో యూట్యూబ్‌ ఛానల్‌, సోషల్‌ మీడియా ఖాతాల్నీ తెరిచారు. ఈ వేదికగా లెస్బియన్‌ కపుల్‌ కోసం తమ అనుభవాలు, ప్రేమ పాఠాలు, డేటింగ్‌ టిప్స్‌.. వంటివి పంచుకుంటూ మరింత పాపులరవుతోంది ఈ జంట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని