Updated : 05/10/2021 18:57 IST

అవును.. అసలు దుస్తులకు, విడాకులకు సంబంధమేంటి?

(Photo: Instagram)

‘మన రాజ్యాంగం మనకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది.. అలాగని దాని అర్థం ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయమని కాదు!’ అంటోంది బబ్లీ బ్యూటీ విద్యుల్లేఖా రామన్‌. ఇటీవలే తన ఇష్టసఖుడు సంజయ్‌తో కలిసి ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మాల్దీవుల్లో హనీమూన్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాను బికినీలో దిగిన ఫొటో ఒకటి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో చాలామంది ఆమె ఆహార్యాన్ని తప్పుబడుతున్నారు. ‘విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారం’టూ కొంతమంది తమ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీనికి ప్రతిగా విద్యు ఇచ్చిన ఘాటు రిప్లై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోజులు మారుతున్నా ఈ సమాజం మహిళల్ని చూసే దృష్టి కోణంలో మాత్రం ఇసుమంతైనా మార్పు రావట్లేదంటూ మరోసారి మహిళలపై ఉన్న వివక్ష సర్వత్రా చర్చనీయాంశమైంది!

విద్యుల్లేఖా రామన్‌.. తన హావభావాలు, కామెడీ పంచ్‌లతో అనతి కాలంలోనే లేడీ కమెడియన్‌గా పేరు తెచ్చుకుందీ తమిళమ్మాయి. మొన్నటిదాకా ఎంతో చబ్బీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య నాజూగ్గా మారి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. గతేడాది తన బాయ్‌ఫ్రెండ్‌ సంజయ్‌తో నిశ్చితార్థం చేసుకున్న విద్యు.. సెప్టెంబర్‌ 9న అతనితో ఏడడుగులు నడిచింది. ప్రస్తుతం ఈ లవ్లీ కపుల్‌ మాల్దీవుల్లో హనీమూన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన ట్రిప్‌కి సంబంధించిన ఫొటోల్ని కూడా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచు కుంటోందీ చెన్నై బ్యూటీ.

మీ విడాకులెప్పుడు?!

సముద్రపు అందాల్ని ఆస్వాదిస్తూ, ప్రకృతి ఒడిలో పరవశించిపోతూ దిగిన ఫొటోలు, వీడియోలను ఇప్పటికే ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన విద్యుల్లేఖ.. తాజాగా తాను బికినీలో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. దీనికి ‘ఆరు నెలల చొప్పున ఏడాదికి రెండుసార్లు నాకు ఇలాంటి వెకేషన్‌ కావాలి..’ అంటూ సరదాగా క్యాప్షన్‌ జోడించింది. నిజానికి ఇక్కడ కూడా తన కామెడీ పంచ్‌తో అందరినీ నవ్వించే ప్రయత్నం చేసిందామె. అయితే దీనికంటే అందరి కళ్లూ ఆమె బికినీ లుక్ పైనే పడ్డాయి. చాలామంది ఆమె ఆహార్యాన్ని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమందైతే ‘మీ విడాకులెప్పుడు?’ అంటూ అడుగుతున్నారు. అయితే ప్రతిసారీ తనపై వచ్చే విమర్శల్ని తనదైన రీతిలో తిప్పి కొట్టే విద్యు.. ఈసారీ కాస్త ఘాటుగానే బదులిచ్చింది.

అసలు సమస్య మీ ఆలోచనల్లోనే ఉంది!

‘మీ విడాకులెప్పుడు? అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నేను స్విమ్‌సూట్‌ ధరించడం వల్లనే ఇలా అడుగుతున్నారా? అలాంటి వారందరికీ ఇదే నా సమాధానం! ఆంటీస్‌, అంకుల్స్‌.. 1920 కాలాన్ని వదిలి 2021 లోకి రండి. అసలు సమస్య ఇలాంటి నెగెటివ్‌ కామెంట్లలో కాదు.. ఈ సమాజం ఆలోచించే ధోరణిలోనే ఉంది. నిజంగా విడాకులకు ఒక మహిళ ధరించిన దుస్తులే కారణమైతే.. పద్ధతిగా దుస్తులు ధరించిన వాళ్లందరూ సంతోషంగా ఉన్నట్లేనా? సంజయ్‌ లాంటి ఉన్నత వ్యక్తిని భర్తగా పొందినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. నీతి, నిజాయతీ, ధైర్యం, నమ్మకం.. వంటి సుగుణాల కలబోత అతను! నిజానికి ఇలాంటి విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదని తను నాతో అన్నారు. కానీ వీటిని అంత తేలిగ్గా వదిలేయాలనిపించలేదు.
మీ సంకుచిత మనస్తత్వం, విషపూరితమైన ఆలోచనల్ని మార్చాల్సిన అవసరం నాకు లేదు. ఇలా ఆలోచించే వారి దృష్టిలో ఆడదంటే ఒక లైంగిక వస్తువు, అవమానించినా అణిగి మణిగి పడుంటుందన్న ఆలోచనతో ఉంటారు. అలా చూసినంత కాలం ఆమె ఉన్నత వ్యక్తిత్వం మీకు కనిపించదు. మీరు బతకండి.. ఎదుటివాళ్లను బతకనివ్వండి!’ అంటూ ఇన్‌స్టా రీల్స్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది విద్యు.

నా అధిక బరువే వాళ్లకు కామెడీ అయింది!

విద్యుల్లేఖకు విమర్శలు కొత్త కాదు.. గతంలోనూ తన అధిక బరువు గురించి కొంతమంది తమ నోటికొచ్చినట్లు మాట్లాడారంటూ పలు పోస్టుల రూపంలో పంచుకుందామె. ‘సినిమాల్లోకొచ్చిన కొత్తలో నా అధిక బరువు పైనే జోక్స్‌, కామెడీ డైలాగులు రాసేవారు. అప్పుడు వాటిని నేను అంతగా పట్టించుకోలేదు. ఎలాగైతే ఏంటి.. ప్రేక్షకుల్ని నవ్విస్తే చాలనుకున్నా.. కానీ ముందు ముందు దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో అప్పుడు నేను గ్రహించలేకపోయా. తర్వాత్తర్వాత అదే అదనుగా తీసుకొని చాలామంది నాపై విమర్శలు చేసేవారు. అప్పుడు నా అధిక బరువు గురించి జోక్స్‌, డైలాగ్స్‌ రాయకూడదని ఆ తర్వాత దర్శకనిర్మాతలతో చెప్పే ధైర్యం చేశా..’ అంటూ తన అధిక బరువు గురించి తానెదుర్కొన్న విమర్శల్ని ఓ సందర్భంలో పంచుకుందీ ముద్దుగుమ్మ.

నేను డ్యాన్స్‌ చేస్తే భూకంపం వస్తుందట!

ఇక బరువు తగ్గే క్రమంలోనూ తనపై చేసే విమర్శలకు కళ్లెం పడలేదంటూ మరో సందర్భంలో చెప్పుకొచ్చిందీ బబ్లీ గర్ల్‌. ‘నాకోసం నేను బరువు తగ్గుతున్నా. ఇప్పటికే 20 కిలోల దాకా తగ్గాను. అయినా విమర్శించే వాళ్ల నోటికి తాళం పడట్లేదు. నేను డ్యాన్స్‌ చేస్తే భూకంపం వస్తుందని ఇప్పటికీ కొంతమంది కామెంట్లు పెడుతుంటారు. అయినా ఇలాంటి వాళ్లందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు.. నా పట్టుదల/అంకితభావానికి థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నా’ అంటూ తనలోని బాడీ పాజిటివిటీని చాటుకుందీ చెన్నై బ్యూటీ.

దుస్తులకు, విడాకులకు సంబంధమేంటి?

విద్యుల్లేఖే కాదు.. గతంలోనూ ఎంతోమంది తారలు తమ ఆహార్యం విషయంలో ఎన్నో రకాల విమర్శల్ని ఎదుర్కొన్నారు. బాడీ షేమింగ్‌కి గురయ్యారు. అలాగని ఊరుకోకుండా తమదైన రీతిలో వాటిని తిప్పి కొట్టారు. ఇంత జరిగినా అర్థం కాని విషయం ఏంటంటే.. మగాళ్లు ఏ పని చేసినా మిన్నకుండే ఈ సమాజం.. ఆడవాళ్లు చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతకడానికే అధిక ప్రాధాన్యమిస్తుందన్నది చాలామంది అభిప్రాయం!

అసభ్యతకు తావివ్వనంత వరకు ఎవరికి నచ్చిన దుస్తులు ధరించే హక్కు, అధికారం ఆడవాళ్లకు ఉన్నాయి. అలాంటప్పుడు వేసుకున్న దుస్తుల్ని బట్టే వాళ్ల ప్రవర్తనను, దాంపత్య బంధాన్ని అంచనా వేయడం ఎంతవరకు సబబు? నిజంగానే విద్యు అడిగినట్లు సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన వాళ్లందరూ తమ అనుబంధంలో సంతోషంగా ఉన్నారంటారా? అసలు దుస్తులకు, దాంపత్య బంధానికి, విడాకులకు సంబంధమేంటి? దీనిపై మీ ఆలోచనలు, అభిప్రాయాలు, పంచుకోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని