సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!

ఇటీవల ఓ మహిళ.. భర్త వేధింపులకు తాళలేక తీవ్ర ఒత్తిడి, ఆందోళనలకు లోనై ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి ఆమె మూడు నెలల గర్భిణి కావడం అందరినీ కలచివేసింది.ఇక ఆ మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రసవానంతర ఒత్తిళ్లే దీనికి కారణమని ఆ తర్వాత తేలింది.....

Published : 13 Aug 2022 13:55 IST

ఇటీవల ఓ మహిళ.. భర్త వేధింపులకు తాళలేక తీవ్ర ఒత్తిడి, ఆందోళనలకు లోనై ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి ఆమె మూడు నెలల గర్భిణి కావడం అందరినీ కలచివేసింది.
ఇక ఆ మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రసవానంతర ఒత్తిళ్లే దీనికి కారణమని ఆ తర్వాత తేలింది.

సెలబ్రిటీలు కావచ్చు.. సామాన్యులు కావచ్చు.. ఇలా ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలను ఇటీవలి కాలంలో అడపాదడపా వింటూనే ఉన్నాం. వయసు, స్టేటస్‌తో సంబంధం లేకుండా ఎంతోమంది మహిళలు మానసిక ఆందోళనలకు గురవుతున్నారు. ఒకానొక దశలో ఓపిక నశించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు కూడా ఇదే విషయం రుజువు చేస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న ఆత్మహత్యలకు ముఖ్య కారణం ఆందోళనే అని ఈ సంస్థ చెబుతోంది. అందులోనూ పురుషుల కంటే 50 శాతం ఎక్కువమంది మహిళలు ఈ సమస్యతో సతమతమవుతున్నట్లు వెల్లడించింది. మన దేశంలో అయితే ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళల్లో 50 శాతం గృహిణులే కావడం గమనార్హం. ఏదేమైనా ఈ ఒత్తిడి, ఆందోళనలకు అనేక కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అలాగని తమలో తామే కుమిలిపోతూ అమూల్యమైన జీవితాన్ని త్యజించకుండా ఒక్క క్షణం ఆలోచించమంటున్నారు.

నివేదికలు ఏం చెబుతున్నాయి? 

ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి జాబితాను ఓసారి పరిశీలిస్తే.. అందులో మహిళల సంఖ్యే ఎక్కువని చెప్పాలి. ఈ క్రమంలో బయటికి వచ్చిన సంఘటనలు కొన్నైతే.. గుట్టుచప్పుడు కాకుండా ముగిసిన కథలు ఎన్నో! అయితే మహిళల ఆత్మహత్యలకు సంబంధించి నిర్వహించిన కొన్ని సర్వేలు/అధ్యయనాలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. అవేంటంటే..!

*ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. పురుషులతో పోల్చితే మహిళలు ఎక్కువ సంఖ్యలో డిప్రెషన్‌ బారిన పడుతున్నట్లు తేలింది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న ఆత్మహత్యలకు అధికంగా ఈ మానసిక ఆందోళనే కారణమని వెల్లడించింది.

*ఇందులోనూ 15-39 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఇక ప్రపంచవ్యాప్తంగా నమోదవుతోన్న ఆత్మహత్యల్లో 36 శాతం మంది భారతీయ మహిళలున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది.

*మరోవైపు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ఏం చెబుతోందంటే.. 2020లో ప్రతి లక్ష మంది జనాభాలో 70.9 మంది పురుషులు, 29.1 మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారట!

*అందులోనూ 22,372 మంది గృహిణులు వివిధ కారణాల వల్ల తనువు చాలించినట్లు వెల్లడైంది.

*ఈ లెక్కన చూస్తే రోజూ 61 మంది మహిళలు, ప్రతి 25 నిమిషాలకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు.. 1,53,000 ఆత్మహత్య కేసుల్లో 14.6 శాతం మంది గృహిణులున్నట్లు తేలింది.

ఇంటా, బయటా గండమే!

మన దేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న మహిళల్లో 50 శాతం మంది గృహిణులున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందుకు ఒకటి, రెండు కాదు.. అనేక కారణాలున్నాయంటున్నారు.

*వ్యక్తిగత సమస్యలే మహిళల్ని తీవ్రమైన ఆందోళనలోకి నెడుతున్నాయట! ఈ క్రమంలో కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు, వరకట్న వేధింపులు.. వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు నిపుణులు.

*సుమారు 30 శాతం మంది మహిళలు గృహ హింస కారణంగా ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఓ ప్రభుత్వ సర్వే తేల్చింది.

*భర్త నుంచి విడాకులు తీసుకోవడం కూడా మహిళలకు శాపంగా పరిణమిస్తోంది. ఈ క్రమంలో ఆర్థికంగా, సామాజికంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు వీరిని ఆత్మహత్యలకు పురికొల్పుతున్నాయంటున్నారు నిపుణులు.

*ఇక వృత్తిఉద్యోగాలు చేసే మహిళలు.. ఇటు ఇంటి పనులు-బాధ్యతలు, అటు ఆఫీస్ బాధ్యతలు నిర్వర్తించలేక శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. దీనికి తోడు వారికి చాలా విషయాల్లో స్వేచ్ఛ కరువవడంతో ‘ఇక ఈ జీవితం వ్యర్థం!’ అన్న భావనలోకి వెళ్లిపోతున్నారు. ఈ భావన కూడా ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది.

*కొంతమంది అమ్మాయిలకు, పెళ్లయ్యాక మహిళలకు చదువుకోవాలని ఉన్నా.. పలు ఆంక్షలు, కట్టుబాట్ల కారణంగా ఆ ఆశలు అడుగంటిపోతున్నాయి. ఇది కూడా వారిని ఒత్తిడిలోకి నెట్టి ఊపిరి సలపకుండా చేస్తుందంటున్నారు నిపుణులు.

*ఆరోగ్య సమస్యలు కూడా కొంతమంది మహిళల జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయట! ముఖ్యంగా స్థూలకాయం, మెనోపాజ్‌, వివిధ ప్రత్యుత్పత్తి సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ వ్యాధులున్న వారు.. పుండు మీద కారం చల్లినట్లుగా ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.


 

మీరు ఒంటరి కాదు..!

తీవ్ర మానసిక ఒత్తిడిలోకి కూరుకుపోయిన వారి మది నిండా ప్రతికూల ఆలోచనలే ఉంటాయి. పైగా ఈ సమస్య ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని, ఈ జర్నీలో తనకెవరూ తోడుండరన్న భ్రమలో ఉండిపోతారు. కానీ ఇది పూర్తిగా అపోహేనంటున్నారు నిపుణులు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని.. కొన్ని చిట్కాలు పాటిస్తే ఎంతటి మానసిక ఆందోళనల నుంచైనా బయటపడచ్చంటున్నారు.

*మనసులోని బాధను మీరు బాగా నమ్మే వ్యక్తులతో పంచుకోవాలి. దీనివల్ల బాధ తగ్గడమే కాదు.. మీ సమస్యకు తగిన పరిష్కార మార్గమూ దొరుకుతుంది.

*మానసిక ఒత్తిడితో ఉన్నవారు నలుగురితో కలవలేరు. అయితే దానివల్ల ఒంటరితనం మరింత తీవ్రంగా బాధిస్తుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే.. మీకు నచ్చిన వారి మధ్య మెలగడం ఉత్తమం. ఈ క్రమంలో వారితో కలిసి పండగలు, వేడుకలు, పార్టీల్లో పాల్గొనడం వల్ల మీ మనసుకు సాంత్వన కలుగుతుంది.

*వ్యాయామం చేయడం వల్ల హ్యాపీ హార్మోన్లుగా పిలిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తరిమికొట్టి సంతోషాన్ని మన సొంతం చేస్తాయి. ఈ క్రమంలో యోగా, ధ్యానం, పరుగు, బరువులెత్తడం, ఏరోబిక్స్‌.. వంటివి రోజూ అరగంట పాటు సాధన చేయాలి.

*మానసిక ఆందోళనలు నిద్ర పట్టనివ్వవు. దీనివల్ల సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి మనసు నిద్రకు ఉపక్రమించాలంటే.. ఇంట్లో మీకు నచ్చిన ప్రదేశంలో కూర్చొని.. నిద్రకు ప్రేరేపించే పనులు చేయాలి. అంటే కొంతమందికి పుస్తకం చదివితే నిద్రొస్తుంది.. మరికొందరు పాటలు వింటూ నిద్రపోతారు.. ఇలాంటివన్నమాట!

*ఆహారం కూడా మానసిక ఆందోళనల్ని దూరం చేస్తుంది. ఈ క్రమంలో చేపలు, నట్స్‌, పాలు-పాల ఉత్పత్తులు, తాజా పండ్లు-కాయగూరలు.. వంటివి తీసుకోవడం మంచిది.

*వీటన్నింటితో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించే ఆలోచనలు తగ్గాలంటే కొన్ని థెరపీలు, నిపుణుల కౌన్సెలింగ్‌ మేలు చేస్తాయి.

సమస్యతో పాటు దానికి తగ్గ పరిష్కారం కూడా పుడుతుందంటుంటారు పెద్దలు. కాబట్టి ఒక్క క్షణం ఆగి.. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే.. ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి.. మరెన్నో ఆత్మహత్యలు ఆగుతాయి. కాబట్టి క్షణికావేశంలో జీవితాన్ని అంతం చేసుకుంటే నష్టపోయేది మీరు, మీ కుటుంబమే! గుర్తుంచుకోండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్