శరన్నవరాత్రులు.. నిత్య పూజలు ఇలా..!

అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. భక్తులు నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్య....

Published : 27 Sep 2022 18:47 IST

అమ్మవారిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజులు శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. భక్తులు నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించే జగన్మాతను ఏ రూపంలో కొలవాలి.. ఏ రకమైన పూజలు చేయాలి? తెలుసుకుందాం రండి...

మొదటిరోజు

మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గా దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. గృహంలో అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి మందార పూలతో పూజ చేయాలి. 'ఓం శ్రీ కనకదుర్గా దేవతాయే నమో నమః' అనే మంత్రంతో అమ్మవారికి ఎర్రటి మందార పూలతో పూజ చేస్తే రుణ బాధ, అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపచేసుకోవచ్చు.


రెండో రోజు

రెండో రోజు బాలా త్రిపురసుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు 'భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా' అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. అమ్మవారిని పసుపు పచ్చటి చామంతి పూలతో పూజించాలి.


మూడో రోజు

మూడో రోజు గాయత్రీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటానికి తెల్లటి పూలతో పూజ చేయాలి. వీలైనన్నిసార్లు 'గాయత్రి వ్యాహౄతి సంధ్యా నిజ బృంద నిషేవితా' అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల గాయత్రీ దేవి అనుగ్రహంతో జీవితంలో అన్నపానాలకు ఎలాంటి లోటు ఉండదు.


నాలుగో రోజు

నాలుగో రోజు అన్నపూర్ణా దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి తెల్లటి పూలతో పూజ చేయాలి. 'పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరీ' అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి సిద్ధిస్తుంది.


అయిదో రోజు

అయిదో రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. లలితా అమ్మవారి చిత్రపటం ముందు దీపారాధన చేసి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. లలితా సహస్ర నామాన్ని పూర్తిగా చదవలేని వారు ఇంట్లో లలితా అమ్మవారి చిత్రపటం ముందు కూర్చొని 'శ్రీ శివశతైక్యరూపిణి లలితాంబిక' అనే మంత్రాన్ని జపిస్తూ చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే సంవత్సరం మొత్తం లలితా దేవి అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్య, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది.


ఆరో రోజు

ఆరో రోజు మహాలక్ష్మిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి చిత్రపటానికి తామర వత్తులతో దీపారాధన చేయాలి. మహాలక్ష్మీదేవిని మల్లె, జాజి, గులాబీ పూలతో పూజించాలి. ఈరోజు 'మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ' అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.


ఏడో రోజు

ఏడో రోజు అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటానికి తెల్లటి పూలతో పూజ చేయాలి. అలాగే తెలుపు రంగు పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి.


ఎనిమిదో రోజు

ఎనిమిదో రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి పూలతో పూజ చేయాలి. అమ్మవారి పటం ముందు నాలుగు వత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. 'దుర్లభా దుర్గమా దుర్గా దుఖహంత్రీ సుఖప్రదా యై నమః' అనే మంత్రాన్ని జపించాలి. దీని వల్ల నరఘోష, దృష్టి దోషం, అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడొచ్చు.


తొమ్మిదో రోజు

తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటాన్ని రకరకాల ఎర్రటి పుష్పాలతో పూజించాలి. 'అపర్ణా చండికా చండముండాసుర నిఘాధిని' అనే మంత్రాన్ని జపిస్తూ గంటని గట్టిగా మోగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా దుష్టశక్తులుంటే అవన్నీ తొలగిపోతాయి. శత్రు బాధలు తొలగుతాయి.


పదో రోజు

పదో రోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. ఇంట్లో అమ్మవారి చిత్రపటం ముందు దీపారాధన చేసి అరటి పండు, కొబ్బరి కాయ నైవేద్యంగా సమర్పించాలి. 'రాజరాజేశ్వరీ రాజ్యధాయని రాజ్యవల్లభయేనమో నమః' అనే మంత్రాన్ని జపించాలి. 

శత్రువులను సంహరించి అమ్మవారు అపరాజితాదేవిగా జమ్మిచెట్టు రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. ఎవరైతే విజయదశమి నాడు సాయంకాలం నక్షత్ర దర్శనమయ్యాక జమ్మిచెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసి, పసుపు, కుంకుమ చల్లి నీరు పోస్తారో వాళ్లు అపరాజితాదేవి కృపకి పాత్రులవుతారు. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్