మనవరాలి కోసం మోడల్‌గా మారింది.. మనసులు గెల్చుకుంది!

మోడలింగ్‌... చూడచక్కని రూపం, సొగసైన శరీరాకృతి... అందులోనూ 18 నుంచి 30 ఏళ్ల లోపు యువతులే ఈ రంగంలో కనిపిస్తుంటారు. వయసు పైబడిన వాళ్లు మోడలింగ్‌ చేయడమనేది చాలా అరుదు. అలాంటిది 99 ఏళ్ల మలి వయసులో మోడల్‌గా మారిపోయారు అమెరికాకు చెందిన హెలెన్‌ సిమోన్‌. ముడతలు పడ్డ చర్మంతోనే ఓ బ్యూటీ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యహరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక వయసున్న మోడళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆమె ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Updated : 14 Aug 2021 14:14 IST

(Photo: Instagram)

మోడలింగ్‌... చూడచక్కని రూపం, సొగసైన శరీరాకృతి... అందులోనూ 18 నుంచి 30 ఏళ్ల లోపు యువతులే ఈ రంగంలో కనిపిస్తుంటారు. వయసు పైబడిన వాళ్లు మోడలింగ్‌ చేయడమనేది చాలా అరుదు. అలాంటిది 99 ఏళ్ల మలి వయసులో మోడల్‌గా మారిపోయారు అమెరికాకు చెందిన హెలెన్‌ సిమోన్‌. ముడతలు పడ్డ చర్మంతోనే ఓ బ్యూటీ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యహరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక వయసున్న మోడళ్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆమె ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

99 ఏళ్ల వయసులో మోడల్‌గా!

కాలిఫోర్నియాలో నివాసముంటోన్న హెలెన్‌కు ఆరుగురు పిల్లలు, 11 మంది మనవళ్లు, మనవరాళ్లు, ఆరుగురు ముని మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ ఆమెను ‘నానా’ అని ప్రేమగా పిలుచుకుంటారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే 99వ వసంతంలోకి అడుగుపెట్టారు సిమోన్‌. ఈ సందర్భంగా ఆమె మనవరాలు ల్యానీ క్రోవెల్ తన బ్యూటీ బ్రాండ్‌కు మోడల్‌గా వ్యవహరించాలని గ్రాండ్‌మాను కోరింది. అయితే మోడలింగ్‌లో తనకెలాంటి అనుభవం లేదంటూ మొదట అయిష్టత చూపారు సిమోన్‌. అయితే క్రోవెల్‌ వెనక్కు తగ్గలేదు. ఎలాగైనా బామ్మతోనే తన బ్యూటీ బ్రాండ్‌ను ప్రచారం చేయించాలనుకుంది. ఈ విషయమై తన కుటుంబ సభ్యులతో కూడా చెప్పించింది. ఇలా అందరూ రిక్వెస్ట్‌ చేయడంతో మోడలింగ్‌ షూట్‌కు ఓకే చెప్పారు హెలెన్.

మా ఫేవరెట్‌ మోడల్!

కుటుంబ సభ్యులందరి ప్రోత్సాహంతో యాడ్‌ షూటింగ్‌లలో నానా ఉత్సాహంగా పాల్గొన్నారు. మనవరాలితో పాటు ఆమె బృందం కూడా ఇందుకు సహకరించింది. ఆ తర్వాత తన బ్రాండ్‌ బ్యూటీ ఉత్పత్తులతో సిమోన్‌ దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది క్రోవెల్‌. వీటికి నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వచ్చింది. చాలామంది నానాను ‘మా ఫేవరెట్‌ మోడల్‌’ అని అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు.

మోడలింగ్‌ అనగానే నవ్వాను!

ప్రపంచంలో అత్యధిక వయసున్న మోడళ్లలో ఒకరిగా గుర్తింపు పొందారు సిమోన్‌. ‘నేను చిన్నప్పటి నుంచి ఎంతోమంది మోడళ్లను చూశాను. కానీ మోడలింగ్‌లో నాకెలాంటి అనుభవం లేదు. నా మనవరాలు ఈ విషయం చెప్పినప్పుడు మొదట నేను నవ్వాను. ‘ఈ వయసులో మోడలింగ్‌ ఏంటి?’ అని తనను అడిగాను. అయితే నేను చేస్తేనే బాగుంటుందని తను చెప్పింది. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా నాకు అండగా నిలిచారు. షూట్‌ సమయంలోనూ వారు నా పక్కనే ఉన్నారు. సలహాలు, సూచనలు అందించారు. చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇలా ఎంతో సంతోషకరమైన వాతావరణంలో నా షూట్‌ సాగింది.

ఎక్కువ మేకప్‌ వేసుకునేదాన్ని కాదు!

‘ప్రస్తుతం ఈ రంగంలో ఎంతోమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. వారికి నేను ఎలాంటి పోటీ కాదని నాకు తెలుసు. అసలు నేను మోడల్‌ అవుతానని కలలో కూడా ఊహించలేదు. చిన్నప్పటి నుంచి అందంగా కనిపించాలనుకున్నాను..అయితే ఎక్కువ మేకప్ ఉత్పత్తులు అసలు వినియోగించేదాన్ని కాదు. అయితే ఇప్పుడిప్పుడే మాయిశ్చరైజర్‌, మస్కారా, లిప్‌బామ్‌ వంటి ఉత్పత్తులను వాడుతున్నాను. ఈ నా కొత్త ప్రయాణానికి నా మనవరాలే పునాది వేసింది. తన సహాయంతోనే భయం లేకుండా షూట్లలో పాల్గొంటున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు నానా.

ఇంతకీ ఈ ౯౯ ఏళ్ల బామ్మ గారి సౌందర్య రహస్యం ఏమిటో తెలుసా?  'ప్రతి చిన్న విషయానికీ ఆందోళన పడకపోవడం; వాళ్లు ఇలాంటి వారు, అలాంటి వారు అంటూ ఇతరులను జడ్జ్ చేయకపోవడమే నా బ్యూటీ సీక్రెట్ ఏమో' అంటూ నవ్వేస్తారామె!

అలా మా గ్రాండ్‌మాను ఒప్పించాను!

ఈ సందర్భంగా సిమోన్‌ మనవరాలు క్రోవెల్‌ మాట్లాడుతూ ‘ఇటీవల బామ్మ పుట్టిన రోజు ఉండడంతో ఆమె ఇంటికెళ్లాను. అక్కడ ఓ టేబుల్‌పై మా బ్యూటీ ఉత్పత్తులు కొన్ని కనిపించాయి. ఆమె మా ఉత్పత్తులు వాడుతుండడం నాకు చాలా సంతోషమేసింది. వెంటనే వాటిని ఫొటోలు తీసుకున్నాను. అదే సమయంలో మా బ్రాండ్‌ను అనుసరిస్తోన్న ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ బామ్మతో ప్రచారం చేయిస్తే కొత్తగా ఉంటుందని సలహా ఇచ్చాడు. నాకు కూడా ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. వెంటనే గ్రాండ్‌మాతో మాట్లాడాను. అయితే మొదట ఆమె ఒప్పుకోలేదు. ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా చెప్పించాను. చివరకు తనకు ఇష్టమైన బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు స్టెఫ్‌ కర్రీ పేరు ఉన్న ఫొటోగ్రాఫర్‌ను తీసుకొచ్చాను. అప్పుడు కానీ ఆమె షూట్‌కు అంగీకరించలేదు. అయితే ఇంతటి స్పందన వస్తుందని మాత్రం ఊహించలేదు’ అని చెప్పుకొచ్చింది.

మరి మీరూ మీ బామ్మలు లేదా అమ్మమ్మలు; ఇతర పెద్దవాళ్లతో ఇలాంటి క్రియేటివ్ ప్రాజెక్టులేమైనా ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆ విషయాల గురించి వసుంధర వేదికగా ఇతరులతో పంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్