Published : 06/03/2023 00:15 IST

మహిళా సాధికారతకు చిరునామా ఈ.. కేఫ్‌

ఆ మహిళలందరూ ఒకప్పుడు దినసరి కూలీలు. పని దొరకని రోజున పస్తు ఉండాల్సిందే. అటువంటి వారందరూ ఇప్పుడు పోషకాహారాన్ని అందిస్తూ.. కేఫ్స్‌ నిర్వహించే వ్యాపారవేత్తలుగా మారారు. వీరంతా వేలమంది ఆకలి తీర్చడమే కాదు, తమ కాళ్లపై తాము నిలబడి స్వయం ఉపాధినీ పొందుతున్నారు. ఒడిశా ప్రభుత్వం ‘మిషన్‌శక్తి కేఫ్స్‌’ ద్వారా ఇప్పుడు వందల మంది మహిళలు సాధికారతను పొందుతున్నారు.  

ఒడిశా, రవుర్కెలా ప్రాంతం, సుందర్‌గఢ్‌ జిల్లాకు చెందిన మహిళలకు గతంలో ఉపాధి లేక, కుటుంబ పోషణలో భాగస్వామ్యం వహించ లేకపోయేవారు. తాము చదువుకోలేకపోయినా.. పిల్లలనైనా ఉన్నత విద్యాభ్యాసం చదివించాలనే వారి ఆసక్తి తగినంత ఆర్థిక స్థోమత లేక అడియాసగానే మిగిలిపోయేది. అలాగని కూలీకి వెళదామన్నా..  పని దొరికేది కాదు. ఇటువంటి వారందరికీ ఉపాధిని కల్పించడం కోసం ప్రభుత్వం ‘మిషన్‌ శక్తి కేఫ్స్‌’ ప్రవేశపెట్టింది. 2021లో సుందర్‌గఢ్‌ జిల్లాలో కౌన్ర్‌ముందా బ్లాక్‌లో తొలి కేఫ్‌ ప్రారంభమైంది. స్థానిక మహిళలను స్వయం సహాయక బృందంలో సభ్యులను చేసిన తర్వాత వారికి శిక్షణ అందించారు. ఆ తర్వాత కేఫ్‌ నిర్వహణలో భాగస్వాములని చేశారు. మొదటిది విజయవంతమయ్యాక మరింత మందికి అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. అలా అంచెలంచెలుగా ఈ రెండేళ్లలో మొత్తం 16 బ్లాక్‌ హెడ్‌క్వార్టర్స్‌లో కేఫ్స్‌ తెరుచుకున్నాయి.  వీటి ద్వారా స్థానిక మహిళలకందరికీ ఉపాధిని కల్పించారు.

పెద్దపీట..

ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటలవరకు పనిచేసే ఈ కేఫ్స్‌లో పోషకవిలువలున్న ఆహారాన్ని వడ్డిస్తారు. అల్పాహారం, మధ్యాహ్నభోజనం, సాయంత్రం స్నాక్స్‌ వరకు ఇక్కడ లభ్యమవుతాయి. అతి సామాన్యులకూ అందుబాటు ధరలకు ఇవ్వడంతోపాటు నాణ్యత, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు. అలాగే కేఫ్స్‌ నిర్వహణతో కుటుంబాలకు ఆర్థిక చేయూతనీ ఇవ్వగలుగుతున్నాం అంటారు ఇక్కడి మహిళలు. తమ పిల్లలను చదివించడంలో తామూ భాగస్వాములు అవుతున్నందుకు వీరిలో ఆత్మవిశ్వాసం మెరుగుపడింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడంతో తమకు తృప్తిగానూ ఉందని చెబుతారు ఈ మహిళలు. మారుమూల ప్రాంతాల వారు కూడా ఈ స్వయం సహాయక బృందాల్లో చేరి కేఫ్స్‌ నిర్వహణలో భాగస్వామ్యులు కావడానికి ముందుకొస్తున్నారు. ఇది ఎంతోమంది మహిళల విజయంగా ఒడిశా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సామాజికాభివృద్ధికి సంకేతంగా మారుతున్న మిషన్‌ శక్తి కేఫ్స్‌ను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేయడానికి ప్రణాళికలు వేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని