కోపమొచ్చిందా..?

అదేంటో.. కొంతమందికి కోపం.. ముక్కు మీదే ఉంటుంది. సరదాగా జోక్ చేసినా చాలు.. అనకూడని మాట ఏదో అన్నట్లుగా విరుచుకుపడిపోతుంటారు. అందుకే ఇలాంటివారితో మాట్లాడాలంటేనే చాలామంది వెనకాడుతూ ఉంటారు. ఏదైనా చెప్పాల్సివస్తే.. మనకెందుకులే తనతో గొడవ అని తప్పించుకుపోతుంటారు. అంతేకాదు వారితో స్నేహం చేయడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఏముంది కోపం తగ్గించుకోవడమే. అయితే ఇది మనం అనుకున్నంత సులువేమీ కాదు.

Published : 22 Jul 2021 20:35 IST

అదేంటో.. కొంతమందికి కోపం.. ముక్కు మీదే ఉంటుంది. సరదాగా జోక్ చేసినా చాలు.. అనకూడని మాట ఏదో అన్నట్లుగా విరుచుకుపడిపోతుంటారు. అందుకే ఇలాంటివారితో మాట్లాడాలంటేనే చాలామంది వెనకాడుతూ ఉంటారు. ఏదైనా చెప్పాల్సివస్తే.. మనకెందుకులే తనతో గొడవ అని తప్పించుకుపోతుంటారు. అంతేకాదు వారితో స్నేహం చేయడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఏముంది కోపం తగ్గించుకోవడమే. అయితే ఇది మనం అనుకున్నంత సులువేమీ కాదు. కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి చాలా సాధన అవసరం. మరి దానికోసం ఏం చేయాలో తెలుసుకుందామా..

ముందే గుర్తించడం..

సంతోషం, బాధ, కోపం లాంటివన్నీ భావోద్వేగాలకు సంబంధించిన అంశాలే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన మెదడులో జరిగే రసాయనిక చర్యల కారణంగా ఆయా సందర్భాలకనుగుణంగా మన భావాలు బయటకు వస్తాయి. అయితే కొంతమంది మాత్రం ఎక్కువ సందర్భాల్లో ఆగ్రహం రూపంలోనే తమ ఉద్వేగాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వాటిలో 'దీనికి కూడా కోపం తెచ్చుకోవాలా?' అని ఆశ్చర్యపోయేంతటి చిన్న విషయాలు కూడా ఉంటాయి. అయితే ఎలాంటి సందర్భాల్లో మీకు కోపం వస్తుందో గుర్తిస్తే దాన్ని అదుపులో ఉంచుకోవడం మరీ అంత కష్టం కాకపోవచ్చు. ఉదాహరణకి మీ రూమ్మేట్‌కి పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ వినడమంటే ఇష్టం. మీకు అది నచ్చదు. ఆ సందర్భంలో మీకెదురవుతున్న ఇబ్బందిని వారికి సౌమ్యంగా వివరించడం లేదా.. అక్కడి నుంచి కాసేపు దూరంగా వెళ్లడం లాంటివి చేయాలి. అలా చేయడం ద్వారా మీ కోపాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు. పెద్దగా పట్టించుకోనవసరం లేని విషయాల్లో ఈ సూత్రాన్ని పాటించినట్లయితే.. చాలావరకు మన కోపం మాయమవుతుందనే చెప్పవచ్చు.

వీటిని నియంత్రించుకుంటే..

కొన్ని సందర్భాల్లో బాధ, ఒత్తిడి, అసూయ, డిప్రెషన్‌లాంటి భావోద్వేగాలు కోపం రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఎదుటివారిపై అకారణంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. దీనివల్ల మనపై ఇతరులకు చెడు అభిప్రాయం కలగవచ్చు. అందుకే ఇలాంటప్పుడు మనల్ని మనం అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిమ్మల్ని బాధపెట్టే అంశాలకు దూరంగా ఉండాలి. అలాగే పని తాలూకు ఒత్తిడి మీ వ్యక్తిగత జీవితంపై పడకుండా చూసుకుంటే మీ కోపం సగం వరకూ తగ్గిపోయినట్లే. అలాగే ఇతరులపై మనం పెంచుకునే అసూయతో పాటే.. మనలోని ఆగ్రహస్థాయిలు కూడా పెరుగుతాయి. అందుకే ఆ లక్షణాన్ని మనలో పెరగకుండా చూసుకోవాలి. ఇలాంటివన్నీ తగ్గించుకోవడానికి మనకు యోగా సహకరిస్తుంది. అందుకే రోజూ యోగా చేయడం మంచిది. అంతేకాదు.. ఏదో ఒక సమయంలో అన్నట్లుగా కాకుండా.. ఉదయం వేళల్లో యోగా చేయడం ద్వారా ఆ రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు మన భావోద్వేగాలు సైతం అదుపులో ఉంటాయి.

బ్రేక్ తీసుకోవడం ద్వారా..

పని ప్రదేశాల్లో ఇతరులపై కోపాన్ని ప్రదర్శించడమంటే కత్తి మీద సాములాంటిదే. ఉన్నతాధికారులు, సహోద్యోగుల మీద మన కోపాన్ని ప్రదర్శించినట్లయితే ఆ ప్రభావం మన ఉద్యోగ జీవితంపైనా పడే అవకాశం ఉంటుంది. అందుకే పని ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనకొచ్చిన కోపాన్ని బయటపెట్టకూడదు. ఒకవేళ కోపం వస్తే కాసేపు బ్రేక్ తీసుకుని అక్కడి నుంచి బయటకి వచ్చేయాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేసినట్త్లెతే.. కోపం పూర్తిగా అదుపులోకి రావడంతో పాటు మనసు ప్రశాంతంగా తయారవుతుంది.

నిపుణుల సూచనతో..

ఎంతగా ప్రయత్నించినా కోపం అదుపులోకి రానట్లయితే నిపుణులను సంప్రదించి 'యాంగర్ మేనేజ్‌మెంట్‌' విధానం ద్వారా చికిత్స తీసుకోవడం మంచిది. నిపుణులు మీ మానసిక పరిస్థితి, భావోద్వేగాల స్థాయికి అనుగుణంగా తగిన చికిత్సావిధానాన్ని సూచిస్తారు. మీరు దాన్ని పాటించినట్లయితే తక్కువ సమయంలోనే మీ ఆగ్రహ స్థాయిల్లో మార్పు తప్పకుండా కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్