ఆ మార్పుల్ని అంగీకరించాలి!

అమ్మయ్యాక ఆడవాళ్ల శరీరంలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం, అందం తగ్గిపోవడం.. వంటివి వీటిలో కొన్ని! అయితే ఇవి ప్రతికూలతలే అయినా సానుకూలంగా స్వీకరించినప్పుడే సంతోషంగా ఉండగలం అంటోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్కా శర్మ.

Published : 15 Nov 2021 20:17 IST

(Photo: Instagram)

అమ్మయ్యాక ఆడవాళ్ల శరీరంలో ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం, అందం తగ్గిపోవడం.. వంటివి వీటిలో కొన్ని! అయితే ఇవి ప్రతికూలతలే అయినా సానుకూలంగా స్వీకరించినప్పుడే సంతోషంగా ఉండగలం అంటోంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్కా శర్మ. ఈ ఏడాది జనవరిలో వామిక అనే పాపకు జన్మనిచ్చిన ఆమె.. ప్రస్తుతం అమ్మతనాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తోంది. అయితే అందరు ఆడవాళ్లలాగే తానూ మొదట్లో ప్రసవానంతర మార్పుల్ని సానుకూలంగా స్వీకరించలేకపోయానంటోందీ బాలీవుడ్‌ మామ్‌. తన భర్త విరాట్‌ సహాయంతో ఈ మానసిక స్థితి నుంచి బయటపడ్డ ఆమె.. ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించినప్పుడే హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండచ్చంటూ.. తన ప్రసవానంతర సమస్యల గురించి ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది.

మోస్ట్‌ లవబుల్‌ సెలబ్రిటీ కపుల్‌గా పేరు గాంచారు అనుష్కా శర్మ – విరాట్‌ కోహ్లీ జంట. ఈ ఏడాది జనవరిలో వామిక అనే పాపకు జన్మనిచ్చిన ఈ అందాల జంట.. ప్రస్తుతం తమ తమ వృత్తుల్లో బిజీగా ఉన్నా.. తన చిన్నారి ఆలనా పాలనకు తగిన సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కూతురితో కలిసి దిగిన ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతోందీ జంట.

అసహ్యించుకుంటానేమోనని భయమేసింది!

అమ్మయ్యాక ప్రతి మహిళ శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం సహజంగా జరిగే ప్రక్రియే! ఈ విషయం తెలిసినా తమ శరీరాన్ని అంగీకరించడానికి మాత్రం ఒప్పుకోరు చాలామంది మహిళలు. తానూ అలాగే చేశానంటోంది అనుష్క.
‘బిడ్డ పుట్టాక తల్లులు బరువు పెరిగిపోయి ఫిట్‌నెస్‌ కోల్పోవడం సహజమే. ఇలా తమ శరీరాకృతిని చూసుకొని బాధపడిపోతుంటారు చాలామంది. వామిక పుట్టాక కొన్ని రోజులకు నేనూ ఈ విషయంలో మథనపడ్డా. ముఖ్యంగా.. ఫిట్‌నెస్‌ కోల్పోయిన నా శరీరాన్ని చూసుకొని అసహ్యించుకుంటానేమోనని పదే పదే ఆలోచించేదాన్ని. అందుకే పూర్వపు స్థితికి చేరుకోవడానికి, ఫిట్‌నెస్‌ను పెంచుకోవడానికి వ్యాయామాలు చేసేదాన్ని. అప్పుడప్పుడూ విరాట్‌కి గత ఫొటోలు చూపిస్తూ.. ‘అప్పుడు నేను ఎంత అందంగా ఉన్నానో చూడు!’ అనేదాన్ని. అప్పుడు తను.. ‘నువ్విలా మారడం వెనకున్న అసలు వాస్తవాన్ని (అంటే.. అన్నింటికన్నా మించిన అమ్మతనాన్ని పొందగలిగానని) గుర్తిస్తే ప్రస్తుత ఫొటో కూడా నీ కంటికి అద్భుతంగా కనిపిస్తుంది..’ అంటూ నా మనసులోని నెగెటివిటీని దూరం చేసేవాడు.. ఇప్పుడనే కాదు.. నా మొదటి త్రైమాసికంలోనూ విరాట్‌ నా పక్కనే ఉండి.. ఆ సమయంలో నా మనసులో కలిగిన ఆందోళనలన్నీ దూరం చేశాడు..’

అంగీకరించడంలోనే ఆనందముంది!

‘ఇలా విరాట్‌ ప్రోత్సాహంతో నా మనసులోని ఆలోచనల్ని క్రమంగా మార్చుకునే ప్రయత్నం చేశా. నన్ను నేను అంగీకరించుకుంటూ, నా శరీరాన్ని ప్రేమించుకుంటూ ముందుకు సాగా. ఇలాంటి సానుకూల దృక్పథం మనల్ని మనకే సరికొత్తగా చూపిస్తుంది. భవిష్యత్తులో నా కూతురిని కూడా ఇలాంటి పాజిటివ్‌ మైండ్‌సెట్‌తోనే పెంచాలని నిర్ణయించుకున్నా. ఎవరైతే సమాజం నిర్ణయించే సౌందర్య ప్రమాణాలను పట్టించుకోకుండా.. ఎలా ఉన్నా తమ శరీరాన్ని ప్రేమించుకుంటూ, అంగీకరించుకుంటూ ముందుకు సాగుతారో వారిలోనే అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది..’ అంటోందీ అందాల అమ్మ.

ఇలా తన అనుభవాలతో ప్రసవానంతర మార్పుల గురించి మహిళలందరిలో స్ఫూర్తి నింపిందీ బాలీవుడ్‌ బ్యూటీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్