Saudi: ఆ విమానంలో.. ఆ ఏడుగురు..!

పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు ఈతరం మహిళలు. విమానయాన రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఈ క్రమంలో పూర్తి మహిళా సిబ్బందితో నడిచే విమానాల గురించి మనం అప్పుడప్పుడూ వింటుంటాం. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో....

Updated : 06 Sep 2022 15:25 IST

(Photo: Twitter)

పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు ఈతరం మహిళలు. విమానయాన రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఈ క్రమంలో పూర్తి మహిళా సిబ్బందితో నడిచే విమానాల గురించి మనం అప్పుడప్పుడూ వింటుంటాం. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో ఇది సర్వసాధారణమే అయినా.. మహిళలపై కఠినమైన ఆంక్షలున్న సౌదీ అరేబియా దేశంలో ఇలాంటిది జరిగితే మాత్రం వింతగానే పరిగణిస్తారు. అలాంటి అరుదైన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ‘ఫ్లైఎడీల్‌’ సంస్థ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. తద్వారా మహిళా సాధికారతకు బీజం వేసింది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

ముస్లిం దేశాల్లో మహిళలపై ఆంక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అటు కుటుంబంలో, ఇటు సమాజంలో పురుషాధిపత్యమే కనిపిస్తుందక్కడ. అయితే గత కొన్నేళ్లుగా మహిళలపై ఉన్న ఈ అసమానతలు ఒక్కొక్కటిగా తొలగుతున్నాయని చెప్పచ్చు. అందుకు తాజా ఉదాహరణే.. ఫ్లైఎడీల్‌ అనే విమానయాన సంస్థ పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో విమానం నడిపింది.

ఏడుగురు మహిళలతో..!

ఫ్లైఎడీల్‌.. అనేది సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన విమానయాన సంస్థ. ఇది రియాద్‌ నుంచి జెద్దా వరకు విమానాలు నడుపుతుంటుంది. అయితే ఈ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా పురుషులకే ఇచ్చే ఈ సంస్థ.. ఈసారి మహిళా సాధికారతను చాటాలని నిర్ణయించుకుంది. ఇందుకు ప్రతిగానే పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో కూడిన విమానాన్ని ఇటీవలే తొలిసారి నడిపింది. ఈ బృందంలో ఏడుగురు మహిళలుండగా.. వీరిలో కెప్టెన్‌ తప్ప మిగతా వారంతా సౌదీ అరేబియాకు చెందిన మహిళలేనని విమానయాన సంస్థకు చెందిన అధికారులు తెలిపారు. ఇక ఈ బృందంలో యారా జాన్‌ అనే మహిళా పైలట్‌ కూడా ఉంది. ఆమె అక్కడి తొలి ఆఫీసర్‌గా, అతి పిన్న మహిళా పైలట్‌గా కీర్తి గడించింది.

మూడేళ్ల క్రితమే..!

అయితే సౌదీ అరేబియా విమానయాన రంగంలో మహిళలకు ప్రవేశం కల్పించడం ఇది తొలిసారేమీ కాదు. 2019లో యాస్మీన్‌ అల్ మియామనీ ఆ దేశంలో కమర్షియల్‌ విమానాన్ని నడిపిన తొలి మహిళగా చరిత్రకెక్కింది. ఇక అప్పట్నుంచి మహిళలపై ఆంక్షల్ని క్రమంగా సడలిస్తూ ఈ రంగంలో వారిని సాధికారత దిశగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి అధికారులు. ఇందుకు ప్రతిగానే 2016లో అక్కడి విమానయాన రంగంలోని వివిధ విభాగాల్లో 19 శాతం మహిళా సిబ్బంది ఉండగా.. 2020 నాటికి అది 33 శాతానికి పెరగడం మహిళా సాధికారతకు ప్రత్యక్ష నిదర్శనం. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో విమానం నడిపి కొత్త చరిత్రకు తెర తీసిందా పురుషాధిపత్య దేశం. ఇక ముందు కూడా ఈ రంగంలో మహిళల పాత్ర మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

టార్గెట్‌ - విజన్ 2030!

మొన్నటి దాకా పురుషుల తోడు లేనిదే బయటికి వెళ్లలేకపోయిన సౌదీ మహిళలు.. ఇప్పుడు ఒంటరిగా కార్లు, విమానాలు నడుపుతున్నారు. తమకు నచ్చిన రంగంలో దూసుకుపోతున్నారు. ఇలా వాళ్లపై విధించిన ఒక్కో ఆంక్షనూ తొలగిస్తూ వారిని సాధికారత దిశగా అడుగులు వేయిస్తోంది అక్కడి ప్రభుత్వం. అందుకు కొన్ని ఉదాహరణలే ఇవి..!

* గత కొన్నేళ్ల క్రితం గార్డియన్‌షిప్‌ (పురుష సంరక్షణ) వ్యవస్థకు చరమగీతం పాడిన అక్కడి ప్రభుత్వం.. ఎవరిపై ఆధారపడకుండా స్త్రీలు సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునే వెసులుబాటు కల్పించింది.

* అప్పటిదాకా మహిళలు వాహనాలు నడపకూడదన్న నియమం పెట్టిన సౌదీ ప్రభుత్వం.. 2018లో దీన్ని ఎత్తివేసింది. లింగ సమానత్వానికి దీన్నో నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

* ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల కోసమే ప్రత్యేకంగా ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టింది సౌదీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే న్యాయ శాఖ దగ్గర్నుంచి విమానయానం దాకా.. ప్రతి రంగంలోనూ వారి నైపుణ్యాలకు తగిన ఉద్యోగాల్ని కట్టబెట్టింది.

* 2019లో ‘రీమా బింట్‌ బందర్‌ అల్‌ సౌద్‌’ను మొట్టమొదటి మహిళా రాయబారిగా నియమించింది. యూఎస్‌లో సౌదీ రాయబారిగా ఆమె వ్యవహరిస్తున్నారు.

* సాధారణంగా ముస్లిం మహిళలు అభయ/బుర్ఖా ధరించడం కామన్‌. అయితే ఈ విషయంలోనూ పలు సడలింపులు చేశారు సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌. డ్రస్‌ పద్ధతిగా, హుందాగా ఉన్నప్పుడు అభయ ధరించాల్సిన పని లేదంటూ ప్రకటన చేశారు. దీంతో అక్కడి మహిళలు ఊపిరి పీల్చుకున్నట్లయింది.

* 2017కు ముందు వరకు ఆటలు చూడ్డానికి మహిళలు స్టేడియాలకు రావడానికి కూడా వీల్లేదు. అయితే అదే సంవత్సరం ఈ ఆంక్షను కూడా సడలించి.. ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను చూడ్డానికి అనుమతించింది అక్కడి ప్రభుత్వం.

* ఫ్యాషన్‌పై ఆసక్తి ఉన్న మహిళల్నీ ఆ దిశగా ప్రోత్సహిస్తోంది సౌదీ. ఈ క్రమంలో బ్లాక్ అభయాలకు బదులు విభిన్న రంగులు, స్టైల్స్‌, ఫ్యాబ్రిక్స్‌తో రూపొందించిన అభయాల్ని రూపొందిస్తూ.. వాటిని అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికల పైనా ప్రదర్శించే సువర్ణావకాశం అక్కడి మహిళా ఫ్యాషనర్లకు అందించింది.

* ఇక మహిళల ఆరోగ్యం-ఫిట్‌నెస్‌ను పెంపొందించేందుకు మహిళల కోసం ప్రత్యేకంగా జిమ్‌లు, వెల్‌నెస్‌ సెంటర్లు ప్రారంభించింది.

ఇలా అక్కడి మహిళలపై ఉన్న ఒక్కో ఆంక్షనూ సడలిస్తూ వస్తోన్న సౌదీ ప్రభుత్వం.. పూర్తి స్థాయి మహిళా సాధికారతను సాధించేందుకు ‘విజన్‌ - 2030’ని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే.. 2030 నాటికి ఆ దేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 30 శాతానికి పెంచడమే దీని ముఖ్యోద్దేశం. కాగా, 2018 నాటికి అంతర్జాతీయ మహిళా శ్రామిక శక్తి (39 శాతం)తో పోల్చితే సౌదీలో ఈ గణాంకాలు 15 శాతమే!

ఏదేమైనా అడుగడుగునా పురుషాధిపత్యం వేళ్లూనుకుపోయిన సౌదీ వంటి దేశంలో మహిళా సాధికారత విషయంలో గణనీయ మార్పులు చోటుచేసుకోవడం మంచి పరిణామం. మరి, ఈ విషయంలో మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని Conactus@vasundhara.net వేదికగా పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్