Shilpa Reddy: మహిళల కోసం.. ‘రైజింగ్ శక్తి’!

మనం మాత్రమే ఎదగాలనుకోవడం స్వార్థం.. మనతో పాటు నలుగురూ ఎదిగేలా స్ఫూర్తి నింపడం మంచితనం. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ప్రముఖ ఫ్యాషనిస్టా, మాజీ మిసెస్‌ ఇండియా శిల్పా రెడ్డి ఒకరు. మేటి ఫ్యాషన్‌ డిజైనర్‌గా, మోడల్‌గా ఇప్పటికే ఫ్యాషన్‌ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆమె.. సమాజ సేవకురాలిగానూ పేరు గడించారు.

Updated : 08 Mar 2024 13:31 IST

మనం మాత్రమే ఎదగాలనుకోవడం స్వార్థం.. మనతో పాటు నలుగురూ ఎదిగేలా స్ఫూర్తి నింపడం మంచితనం. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ప్రముఖ ఫ్యాషనిస్టా, మాజీ మిసెస్‌ ఇండియా శిల్పా రెడ్డి ఒకరు. మేటి ఫ్యాషన్‌ డిజైనర్‌గా, మోడల్‌గా ఇప్పటికే ఫ్యాషన్‌ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆమె.. సమాజ సేవకురాలిగానూ పేరు గడించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ వేదికగా మహిళలు, యువతను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమంటోన్న ఆమె.. తన ఈ కొత్త ప్రాజెక్ట్‌ గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

ఫ్యాషనిస్టా.. ఫిట్‌నెస్‌ గురూ!

శిల్పా రెడ్డి.. తెలుగు వారికి, ఫ్యాషన్‌ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. అందాల పోటీలపై మక్కువతో ‘Gladrags Mrs India 2004’ అందాల కిరీటం గెలిచిన ఆమె.. మహిళల ఆశయాలకు పెళ్లి అడ్డు కాదని నిరూపించారు. ఫ్యాషన్‌పై మక్కువతో 2011లో ‘శిల్పా రెడ్డి స్టూడియో’ పేరుతో ఓ క్లోతింగ్‌ బ్రాండ్‌ని ప్రారంభించిన ఆమె.. ఈ వేదికగా సంప్రదాయ, మోడ్రన్‌ దుస్తులు రూపొందిస్తున్నారు. మరోవైపు తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో సెలబ్రిటీలకూ హంగులద్దుతోన్న ఆమె.. ఫ్యాషన్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. శిల్ప ఓ మేటి ఫ్యాషనరే కాదు.. ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ కూడా! పోషకాహార నిపుణురాలిగానూ ఆమెకు పేరుంది. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ రొటీన్‌/వ్యాయామాలు, పోషకాహారంపై మహిళలకు సలహాలూ ఇస్తుంటారామె.. ఆయా విషయాలపై వారిలో అవగాహన పెంచడానికి ప్రత్యేక వ్యాసాలు/బ్లాగులు రాస్తుంటారామె.

సేవలోనూ ముందే!

ఇద్దరు బిడ్డల తల్లిగా వారి ఆలనా పాలన చూస్తూనే.. మరోవైపు కెరీర్‌లోనూ రాణిస్తోన్న ఈ ఫ్యాషన్‌ మామ్‌.. తన మాతృత్వ అనుభవాల్ని రంగరిస్తూ ప్రత్యేక బ్లాగ్స్‌ కూడా రాస్తుంటారు. ఈతరం తల్లులకు పేరెంటింగ్‌ పాఠాలు కూడా చెబుతుంటారు. ‘కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ విమెన్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ (COWE)’కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న శిల్ప.. సమాజ సేవలోనూ ముందుంటారు. ఈ క్రమంలో- శారీరక వైకల్యాలున్న వారిని ఆటల్లో ప్రోత్సహిస్తోన్న ‘ఆదిత్య మెహతా ఫౌండేషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సార్క్‌, ఇతర అంతర్జాతీయ వేదికలు/సమావేశాల్లో ప్రసంగించిన ఆమె.. టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత, ముక్తా ఖురానాతో కలిసి ‘Ekam’ పేరుతో ఓ ప్రి-స్కూల్‌ని కూడా ప్రారంభించారు.

మహిళల కోసం..!

ఇలా విభిన్న రంగాల్లో రాణిస్తూ తనదైన ముద్ర వేసిన శిల్ప.. తాజాగా మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. మహిళలు, యువత అభివృద్ధే లక్ష్యంగా ‘రైజింగ్‌ శక్తి ఫౌండేషన్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారామె. మహిళల్ని, యువతను విద్యావంతుల్ని చేయడంతో పాటు వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం, వారికి వ్యాపార మెలకువలు నేర్పించడం.. మొదలైన లక్ష్యాలతో తమ ఫౌండేషన్ పని చేస్తుందని ఆమె చెబుతున్నారు. అంతేకాదు.. సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసి.. నాణ్యమైన, మెరుగైన జీవనశైలిని ప్రతి ఒక్కరికీ చేరువ చేయడానికి; ప్రతి ఒక్కరూ పర్యావరణం పట్ల బాధ్యతగా ఉండేలా ప్రేరణ కలిగించడానికి తన ఎన్జీవో కృషి చేస్తుందని పేర్కొన్నారామె.
 ‘రైజింగ్‌ శక్తి ఫౌండేషన్‌తో నా జర్నీ పరిపూర్ణమైనట్లనిపిస్తోంది. సమాజానికి తిరిగి ఇవ్వడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నా. ఈ ఎన్జీవో వేదికగా అందించే విద్య, ఉపాధి కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారత సాకారమవుతుందని విశ్వసిస్తున్నా. ఈ ఫౌండేషన్ ద్వారా మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం!’ అంటున్నారు శిల్ప. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్