తండ్రి చెరలో చీకటి రోజులు గడిపా..!

‘సినిమా తారలకు పెద్ద కష్టాలేముంటాయి?’, ‘అసలు లగ్జరీ లైఫ్‌ అంటే వాళ్లదే’ అంటూ సినీ నటుల గురించి చాలామంది రకరకాలుగా ఊహించుకుంటుంటారు.  కానీ మేకప్‌ తీసేశాక వాళ్లూ మనలాగే మామూలు మనుషులే. వాళ్లకీ కష్టాలు ఎదురవుతుంటాయి. సామాన్యుల్లాగానే సొంత కుటుంబీకుల చేతిలో చిత్రహింసలకు గురయ్యే వారూ లేకపోలేదు. పైగా తమ ఇబ్బందులను ఎవరితోనైనా ఏకరువు పెట్టుకుందామంటే సెలబ్రిటీ హోదా అడ్డు పడుతుంది.

Updated : 30 Jun 2021 18:05 IST

Photos: Instagram

‘సినిమా తారలకు పెద్ద కష్టాలేముంటాయి?’, ‘అసలు లగ్జరీ లైఫ్‌ అంటే వాళ్లదే’ అంటూ సినీ నటుల గురించి చాలామంది రకరకాలుగా ఊహించుకుంటుంటారు.  కానీ మేకప్‌ తీసేశాక వాళ్లూ మనలాగే మామూలు మనుషులే. వాళ్లకీ కష్టాలు ఎదురవుతుంటాయి. సామాన్యుల్లాగానే సొంత కుటుంబీకుల చేతిలో చిత్రహింసలకు గురయ్యే వారూ లేకపోలేదు. పైగా తమ ఇబ్బందులను ఎవరితోనైనా ఏకరువు పెట్టుకుందామంటే సెలబ్రిటీ హోదా అడ్డు పడుతుంది. ఇలా తాను కూడా నరకయాతన అనుభవిస్తున్నానంటోంది ప్రముఖ అమెరికన్‌ పాప్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 ఏళ్ల పాటు తన తండ్రి చెరలో చీకటి రోజులు గడిపానంటోంది. ఇప్పటికైనా తనను ఈ పంజరం నుంచి విడిపించాలంటూ కన్నీళ్లతో వేడుకుంటోంది.

‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ పాప్‌’గా!

పాప్‌ సంగీత ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు బ్రిట్నీ స్పియర్స్‌. తన హుషారెత్తించే పాటలు, డ్యాన్స్‌తో ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ పాప్‌’, ‘పాప్‌ ఐకాన్‌’గా గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. వినసొంపైన గాత్రంతో పాటు అందం, అభినయంతో అశేష అభిమాన గణాన్ని సంపాదించుకుంది. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో గ్రామీ అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఆమె ప్రతిష్ఠాత్మకమైన ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో కూడా చోటు సంపాదించుకుంది. ఇంత స్టార్‌డమ్‌, అందం ఉంది కాబట్టే ‘జల్సా’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ తన హీరోయిన్‌ని చూస్తూ ‘బ్రిట్నీ స్పియర్స్‌కి ప్రింట్‌ తీసినట్టుగా ఉందిరో ఈ సుందరి’ అని పాట కూడా అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితంలో వైఫల్యాలే!

వృత్తిపరంగా ఆకాశమంత క్రేజ్‌ సొంతం చేసుకున్న బ్రిట్నీకి వ్యక్తిగత జీవితంలో మాత్రం వైఫల్యాలే ఎదురయ్యాయి. 2004లో తన చిన్ననాటి స్నేహితుడు జాసన్‌ అలెన్‌ అలెగ్జాండర్‌ను వివాహం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో కొన్ని నెలలకే అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత అమెరికన్‌ డ్యాన్సర్‌ కెవిన్‌ ఫెడెర్‌లైన్‌ని రెండో వివాహం చేసుకుంది. వీరికి సియాన్‌, జేడెన్‌ జేమ్స్‌ అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే జేడెన్‌ పుట్టిన కొద్ది నెలలకే ఇద్దరూ విడిపోయారు. ఈక్రమంలో ఫెడెర్‌లైన్‌తో విడాకులు, వారి ఇద్దరి పిల్లల కస్టడీ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ మానసికంగా బాగా కుంగిపోయింది బ్రిట్నీ. పలుమార్లు ఆస్పత్రిలో కూడా చేరాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో గుండు చేయించుకుని తన అభిమానులకు షాక్‌ ఇచ్చింది. ఈనేపథ్యంలో 2008లో ఆమె ఆస్పత్రిలో ఉండగా.. కోర్టు బ్రిట్నీపై సర్వాధికారాలను ఆమె తండ్రి జేమీ స్పియర్స్‌(కన్జర్వేటర్‌గా)కు అప్పగించింది. అప్పటి నుంచి బ్రిట్నీ ఆర్థిక వ్యవహారాలన్నీ తండ్రి అధీనంలోనే ఉన్నాయి.

తన కన్జర్వేటర్‌షిప్‌ (యూఎస్‌ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ గార్డియన్‌ చేతిలో పెట్టడం) గురించి అప్పుడప్పుడు వార్తలు వచ్చినా  నేరుగా ఎప్పుడూ ఈ విషయంపై మాట్లాడలేదు బ్రిట్నీ. అయితే ఈ మౌనం వెనక ఎన్నో ఏళ్ల మానసిక వేదన ఉందంటూ తాజాగా తన ఆవేదనను బయటపెట్టిందీ పాప్‌ సింగర్‌. తన తండ్రి చెర నుంచి తనను విడిపించాలని క్యాలిఫోర్నియా కోర్టును ఆశ్రయించింది. తండ్రికి తన జీవితంపై సర్వహక్కులు కల్పించే కన్జర్వేటర్‌షిప్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఓ వీడియో ద్వారా తన గోడును వెళ్లబోసుకుంది బ్రిట్నీ.

13 ఏళ్లు నరకం అనుభవించాను!

‘న్యాయస్థానం ఎప్పుడైతే నా తండ్రిని సంరక్షకుడిగా నియమించిందో అప్పటి నుంచే నా జీవితం నాశనమైంది. ఈ 13 ఏళ్లలో ఎప్పుడూ సంతోషంగా లేను. ప్రతి రోజూ ఏడుస్తూనే ఉన్నాను. కంటి నిండా నిద్ర పోయిన రోజు ఒక్కటీ లేదు. నా తండ్రి వల్ల రోజూ నరకం అనుభవించాను. ఇష్టం లేకపోయినా గంటల తరబడి పనిచేశాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బు, హోదా అన్నీ ఆయనే అనుభవించాడు. నా సంపాదనలో కనీసం ఒకటో వంతు కూడా నాకోసం ఖర్చుపెట్టలేదు. నా మొబైల్స్‌ దగ్గరి నుంచి విలువైన కార్డులన్నీ ఆయన నియంత్రణలోనే ఉండిపోయాయి. రోజూ నాకు లిథియం డ్రగ్‌ ఎక్కించేవాడు. దీంతో మత్తులోకి వెళ్లిపోయేదాన్ని. మళ్లీ పెళ్లి చేసుకుని జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించాలన్న ఆశలకు అడ్డు తగిలాడు. చివరకు నా ఇద్దరు పిల్లలను కూడా దూరం చేశాడు. సంరక్షకుడిగా ఆయన చేసిన మంచి కంటే చెడే ఎక్కువ. ఇది ఒక రకంగా ‘సెక్స్‌ ట్రాఫికింగ్‌’కు సమానం. ఇకనైనా ఆయన చెర నుంచి నాకు స్వేచ్ఛ కల్పించండి.. ఇలాంటి కఠినమైన చట్టాల్లో మార్పు తీసుకురండి..’ అని కన్నీటి పర్యంతమైందీ పాప్‌ సింగర్‌.

అది ‘అమ్మ’ నుంచే నేర్చుకున్నా!

దీంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది బ్రిట్నీ. ‘మీకో రహస్యం చెప్పాలనుకుంటున్నాను. మన జీవితం ఓ అందమైన కథలా ఉండాలని అందరం ఆశిస్తాం. అలానే నా లైఫ్‌ కూడా అద్భుతంగా ఉందనిపించేలా నటించాను. నా చిన్నతనంలో మా అమ్మ ఎన్ని కష్టాలున్నా పంటి బిగువున దాచుకునేది. కేవలం నాకోసం, నా తోబుట్టువుల కోసం ఆనందంగా నవ్వుతూ కనిపించేది. అలా ఎన్ని కష్టాలున్నా ఆనందంగా కనిపించాలని అమ్మను చూసే నేర్చుకున్నాను. కానీ నేను ఆనందంగా లేనన్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. నేను సంతోషంగా ఉన్నట్లు నటించినందుకు నా అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను. నా జీవితంలో జరిగిన ఈ చేదు సంఘటనలను పంచుకోవడానికి ఇబ్బందిగా అనిపించింది. నా పరువుకు భంగం వాటిల్లుతుందేమోనన్న భావనతోనే కొన్ని విషయాల గురించి ఇప్పటివరకు మాట్లాడలేకపోయాను’ అంటూ రాసుకొచ్చిందీ అందాల తార.

బ్రిట్నీకి స్వేచ్ఛను ప్రసాదించండి!

ఈ క్రమంలో పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు బ్రిట్నీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు కూడా న్యాయస్థానం బయట ఆమె అభిమానులు ‘ఫ్రీ బ్రిట్నీ’ అంటు ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు నిర్వహించారు. సోషల్‌ మీడియాలో ఆమెకు స్వేచ్ఛను ప్రసాదించాలంటూ ‘ఫ్రీ బ్రిట్నీ’ హ్యాష్‌ట్యాగ్‌తో పెద్ద ఎత్తున పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్