ఇళ్లను శుభ్రం చేస్తూ.. కోట్లలో సంపాదిస్తోంది!

ఈ రోజుల్లో యువత ఆలోచనలు మారుతున్నాయి. తమదైన శైలిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మిలియనీర్లుగా మారుతున్నారు. సాధారణంగా ఏదైనా రంగంలో మంచి ప్రతిభ కనబరచడం లేదా స్టార్టప్‌లు నెలకొల్పి విజయం సాధించడం వల్ల మిలియనీర్‌గా మారుతుంటారు.

Updated : 05 Jan 2024 19:51 IST

ఈ రోజుల్లో యువత ఆలోచనలు మారుతున్నాయి. తమదైన శైలిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మిలియనీర్లుగా మారుతున్నారు. సాధారణంగా ఏదైనా రంగంలో మంచి ప్రతిభ కనబరచడం లేదా స్టార్టప్‌లు నెలకొల్పి విజయం సాధించడం వల్ల మిలియనీర్‌గా మారుతుంటారు. కానీ, ఫిన్లాండ్‌కు చెందిన ఆరి కటారినా అనే యువతి ఇందుకు పూర్తి భిన్నం. చెత్త, చెదారంతో పేరుకుపోయిన ఇళ్లను ఉచితంగా శుభ్రం చేస్తూ మిలియనీర్‌గా మారింది. ఇళ్లను ఉచితంగా శుభ్రం చేస్తే డబ్బులు ఎలా వస్తాయనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కథ. మరి, అదేంటో తెలుసుకుందామా...?

వారికి మాత్రమే..!

ఫిన్లాండ్‌కు చెందిన ఆరికి చిన్నప్పటి నుంచి క్లీనింగ్‌ అంటే మక్కువ. అందుకే Tampere University of Applied Sciences నుంచి ప్రత్యేకంగా ‘సర్వీస్ మేనేజ్‌మెంట్‌’లో డిగ్రీ పట్టా పొందింది. చదువు పూర్తైన తర్వాత రెండేళ్ల పాటు ఓ సంస్థలో పర్సనల్‌ అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత దాదాపు 9 సంవత్సరాలు ‘క్లీనింగ్‌ సూపర్‌వైజర్‌’గా పనిచేసింది. ఈ క్రమంలోనే క్లీనింగ్‌లోని మెలకువలు, ప్రత్యేకమైన ఉత్పత్తుల గురించి తెలుసుకుంది. తనకు దగ్గర్లోని ఓ మహిళ ఇల్లు చెత్త, చెదారంతో ఉండడం గమనించింది. ఆమెకు మానసిక రుగ్మత ఉండడంతో భర్త వదిలేసి పోయాడు. దాంతో ఆరినే ఆ ఇంటిని పూర్తిగా శుభ్రం చేసింది. ఆ సమయంలో ఆ మహిళ కళ్లలోని ఆనందాన్ని దగ్గర్నుంచి గమనించింది ఆరి. అంతే అప్పట్నుంచి వివిధ సమస్యలతో ఇల్లు శుభ్రం చేసుకోలేని వారికి సహాయం చేయాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలోనే సొంతంగా ఓ సంస్థను ఏర్పాటు చేసి మానసిక రుగ్మతతో బాధపడేవారు, వివిధ కారణాల వల్ల కదల్లేని వారు, వృద్ధుల ఇళ్లను శుభ్రం చేయడమే పనిగా పెట్టుకుంది.

లక్షల్లో అభిమానులు..!

సొంతంగా సంస్థను పెట్టుకున్న ఆరి ప్రతి వారం ఒక ఇంటిని శుభ్రం చేసేలా ప్రణాళిక వేసుకుంటుంది. ఈ క్రమంలో యజమాని అనుమతి తీసుకుని తను ఆ ఇంటిని ఎలా శుభ్రం చేస్తుందో మొదటి నుంచి వీడియో రూపంలో చిత్రీకరిస్తుంది. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటుంది.

ఈ సందర్భంగా- ‘నా వృత్తిని నేను ప్రేమిస్తాను. చెత్త, చెదారంతో కూడుకున్న ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఇలాంటి తృప్తిని వారానికోసారి అనుభవిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది ఆరి. ఈ క్రమంలో ఆరి పోస్ట్‌ చేసే వీడియోలకు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తుంటుంది. ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 4 లక్షల మంది అనుసరిస్తుండగా... యూట్యూబ్‌లో మూడు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లో అయితే కోటి మంది అభిమానులు ఉన్నారు. అందులో పోస్ట్‌ చేసే వీడియోల ద్వారా ఆరి కోట్లలో ఆర్జిస్తోంది.

వేరే దేశాలకు వెళ్లి...

ఆరికి క్లీనింగ్‌ అంటే విపరీతమైన పిచ్చి. అందుకే ఆమె తనను తాను ‘వరల్డ్‌ బెస్ట్‌ క్లీనర్‌’గా పిలుచుకుంటుంది. పేరుకు తగ్గట్టే క్లీనింగ్‌ చేయడం కోసం ఇతర దేశాలకు వెళ్లడానికి కూడా వెనకాడదు. ఆరి ఇప్పటివరకు యూకే, స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, అమెరికా దేశాలకు ఒంటరిగా వెళ్లి చాలా ఇళ్లను ఉచితంగా శుభ్రం చేసింది. ‘క్లీన్‌ చేసిన తర్వాత మళ్లీ మురికిగా మారతాయి కదా’ అంటే ‘నేను ఇళ్లను శుభ్రం చేయడం ద్వారా వారికి కొత్త జీవితాన్నిస్తున్నాను. ఆ తర్వాత వాళ్లు శుభ్రంగా ఉంచుకుంటారా? అనే విషయాన్ని పట్టించుకోను. కానీ, ఆ కొద్ది సమయంలో శుభ్రంగా ఉన్న ఇంటిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది’ అని చెబుతుంది.


నా గురించి చెప్పాలంటే..!

‘వరల్డ్‌ బెస్ట్‌ క్లీనర్‌’గా ఆరి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఈ సందర్భంగా తన గురించి 10 ఆసక్తికరమైన అంశాలను ఓ వీడియోలో పంచుకుంది. మరి, అవేంటో చూసేయండి!

1. ఎక్కడైనా చెత్త, బూజు కనబడితే నాలో ఉత్సాహం కలుగుతుంది.

2. ఒక ఇంటిని శుభ్రం చేయడానికి నాకు అత్యధికంగా 18 గంటల సమయం పట్టింది.

3. నేను ఇళ్లను ఉచితంగా శుభ్రం చేస్తా.

4. క్లీనింగ్‌కు సంబంధించిన కోర్సును పూర్తి చేశా.

5. ప్రపంచమంతా శుభ్రం చేయాలనేది నా చిరకాల కోరిక.

6. గత పది సంవత్సరాలుగా నేను శుభ్రం చేస్తున్నాను.

7. స్క్రబ్ డాడీ, స్క్రాపర్‌, క్లాత్‌, డిష్‌ సోప్‌.. ఇవే నాకిష్టమైన వస్తువులు.

8. నా వయసు 30 సంవత్సరాలు.

9. ప్రతి వారం ఒక ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తాను.

10. శుభ్రం చేయడాన్ని ఆస్వాదిస్తాను.



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్