వేలాడే అరలు.. శుభ్రం చేద్దామిలా!
ఇంటీరియర్‌లో భాగంగా ఇప్పుడు చాలామంది వేలాడే అరల (Floating Shelves)కి ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకురావడంతో పాటు స్థలాన్ని ఆదా చేయడమే వీటికున్న ప్రత్యేకత! అయితే వీటిని అమర్చుకుంటే సరిపోదు.. ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మాత్రం దుమ్ము-ధూళి చేరి వాటికున్న అందం దెబ్బతింటుంది.
ఇంటీరియర్‌లో భాగంగా ఇప్పుడు చాలామంది వేలాడే అరల (Floating Shelves)కి ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకురావడంతో పాటు స్థలాన్ని ఆదా చేయడమే వీటికున్న ప్రత్యేకత! అయితే వీటిని అమర్చుకుంటే సరిపోదు.. ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మాత్రం దుమ్ము-ధూళి చేరి వాటికున్న అందం దెబ్బతింటుంది. అలాగని సాధారణ అరల్లా మోటుగా శుభ్రం చేస్తే అవి డ్యామేజ్ అయ్యే అవకాశాలూ ఎక్కువే! కాబట్టి కాస్త మృదువుగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..
చెక్క షెల్ఫులైతే..!
చాలా ఇళ్లలో చెక్కతో చేసిన ఫ్లోటింగ్ షెల్ఫులను ఏర్పాటు చేసుకుంటుంటారు. అందులోనూ అవి ఓపెన్ షెల్ఫులు కావడం వల్ల త్వరగా దుమ్ము చేరే అవకాశాలుంటాయి. కాబట్టి వాటిని ఎప్పటిప్పుడు శుభ్రం చేయాలి. ఇందుకోసం నీటిని ఉపయోగిస్తే చెక్క పాడవ్వచ్చు. అందుకే దీనికి బదులు బేకింగ్ సోడా, నీళ్లు కలిపి తయారుచేసిన మిశ్రమంలో ఒక కాటన్ క్లాత్‌ను ముంచి బాగా పిండాలి. దీంతో షెల్ఫుల్ని మూలమూలలా శుభ్రం చేస్తే సరిపోతుంది. ఆపై మరోసారి పొడి కాటన్ క్లాత్‌తో తుడవాలి. తద్వారా అవి నీటిని పీల్చుకోకుండా త్వరగా ఆరిపోతాయి.
గాజు అరలా?
గాజు అరలు ఇంటికి ఎంత అందాన్నిస్తాయో.. వాటి నిర్వహణ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే అంత త్వరగా డ్యామేజ్ అవుతాయి. ముఖ్యంగా వాటిపై గీతలు పడే అవకాశాలు ఎక్కువ..! అందుకే వాటిని శుభ్రం చేయడానికి మృదువైన కాటన్/టర్కీ క్లాత్ తీసుకోవాలి. దాన్ని నీళ్లు-వెనిగర్ సమపాళ్లలో తీసుకొని కలిపిన మిశ్రమంలో ముంచి, పిండి.. షెల్ఫుల పైన, కింద, మూలల్లో క్లీన్ చేయాలి.. లేదంటే ఈ మిశ్రమాన్ని నేరుగా షెల్ఫులపై స్ప్రే చేసి కూడా తుడవచ్చు. ఆపై పొడి గుడ్డతో మరోసారి తుడవాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే దుమ్ము-ధూళి తొలగిపోవడంతో పాటు, వాటిపై పడిన జిడ్డు మరకలు కూడా వదిలిపోయి కొత్త వాటిలా మెరుస్తాయి.
తుప్పు వదిలేలా..!
లోహాలతో తయారైన షెల్ఫులు, వైర్‌తో అల్లినట్లుగా ఉండే ఫ్లోటింగ్ షెల్ఫులు కూడా ప్రస్తుతం కొంతమంది తమ ఇంట్లో భాగం చేసుకుంటున్నారు. అయితే ఈ తరహా షెల్ఫులు తేమకు త్వరగా తుప్పు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని శుభ్రం చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో ‘ఆల్ పర్పస్ క్లీనర్స్’ దొరుకుతున్నాయి. వాటిని నేరుగా అరలపై స్ప్రే చేసి టూత్ బ్రష్ సహాయంతో రుద్ది శుభ్రం చేయచ్చు. ఆపై పొడి క్లాత్‌తో తుడిచేయాలి. ఒకవేళ ఈ అరలు ఎక్కడైనా తుప్పు పట్టినట్లు అనిపిస్తే.. ఆ భాగంలో కొద్దిగా ఉప్పు వేసి రుద్దచ్చు.. ఆ తర్వాత నిమ్మరసం-వైట్ వెనిగర్ సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని ఆ భాగంపై నుంచి పోసి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసి పొడి గుడ్డతో మరోసారి తుడవాలి.
ప్లాస్టిక్‌వైతే ఇలా!
కొంతమంది ఇళ్లలో ప్లాస్టిక్ ఫ్లోటింగ్ షెల్ఫుల్ని కూడా చూస్తుంటాం. ఈ తరహా అరల్ని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, నీళ్లు కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. దీన్ని స్ప్రే బాటిల్‌లో నింపి అరలపై స్ప్రే చేయాలి. ఇప్పుడు తడి గుడ్డతో ఓసారి తుడిచి, పొడి క్లాత్‌తో మరోసారి తుడిచేస్తే అవి శుభ్రపడతాయి. అయితే వాటిపై ఏవైనా జిడ్డు మరకల్లాంటివి ఉంటే క్లీనింగ్ బ్రష్‌ని ఉపయోగించి వాటిని తొలగించచ్చు.
ఇవి గుర్తుంచుకోండి!
⚛ ఇలా వేలాడే అరల్ని శుభ్రం చేసే క్రమంలో వాటిపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. మూలల్లో ఇయర్ బడ్స్ ఉపయోగించి క్లీన్ చేయచ్చు.
⚛ ఇక అవి పూర్తిగా ఆరాకే వాటిపై వస్తువుల్ని అమర్చడం, పుస్తకాలు సర్దడం వంటివి చేయాలి.
⚛ తేమ చేరకుండా ఉండేందుకు అక్కడక్కడా సిలికా జెల్, నాఫ్తలీన్ బాల్స్.. వంటివి అమర్చాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.