CEO Radhika: అవును.. ఈ లోపం ఉన్నా సరే.. జీవితాన్ని గెలిచా!

లోపాలనేవి ప్రతి ఒక్కరిలో సహజం. అయితే వాటిని ప్రత్యేకతలుగా స్వీకరించినప్పుడే జీవితాన్ని గెలవగలం.. ‘ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌’ సంస్థ సీఈఓ రాధికా గుప్తా జీవిత కథ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పుట్టుకతోనే మెడ కాస్త వంకరగా జన్మించిన ఆమె.. ఇటు స్కూల్లో, అటు సమాజం.....

Published : 07 Jun 2022 19:48 IST

(Photo: Instagram)

లోపాలనేవి ప్రతి ఒక్కరిలో సహజం. అయితే వాటిని ప్రత్యేకతలుగా స్వీకరించినప్పుడే జీవితాన్ని గెలవగలం.. ‘ఎడెల్‌వీస్‌ మ్యూచువల్‌ ఫండ్‌’ సంస్థ సీఈఓ రాధికా గుప్తా జీవిత కథ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పుట్టుకతోనే మెడ కాస్త వంకరగా జన్మించిన ఆమె.. ఇటు స్కూల్లో, అటు సమాజం నుంచి ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది.. మరోవైపు చదువులో రాణించినా ఉద్యోగ ప్రయత్నాల్లో వరుస వైఫల్యాలే ఆమెకు స్వాగతం పలికాయి. ఇలాంటి ప్రతికూలతల నడుమ తీవ్ర కుంగుబాటుకు లోనైన ఆమె.. ఒకానొక దశలో ఆత్మహత్యా ప్రయత్నం దాకా వెళ్లింది. ఆ తర్వాతే తన జీవితానికీ ఓ అర్థం, పరమార్థం ఉంటుందని గ్రహించిన ఆమె.. స్వీయ ప్రేమను పెంచుకోవడం మొదలుపెట్టింది. ఆ ఔషధమే ఆమెను విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలబెట్టింది. దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన సీఈఓల్లో ఒకరిగా అరుదైన గుర్తింపు సాధించిపెట్టింది. ఒకప్పుడు ఏ లోపాన్ని చూసుకొని ఆత్మన్యూనతకు గురైందో.. ఇప్పుడు అదే లోపం తనను ప్రత్యేకంగా నిలబెట్టిందంటోన్న రాధిక.. తన జీవితంలోని ఎత్తుపల్లాల్ని ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌ వేదికగా అక్షరీకరించింది. ఆ స్ఫూర్తిదాయక గాథ ఆమె మాటల్లోనే మీకోసం..!

అమ్మతో పోల్చేవారు!

‘నేను పుట్టుకతోనే కాస్త మెడ వంకరతో జన్మించాను. దాంతో స్కూల్లో అందరూ నన్ను కొత్తగా, వింతగా చూసేవారు.. ఈ క్రమంలో చాలావరకు ఒంటరిగానే గడిపేదాన్ని. మా నాన్న విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేసేవారు. దీంతో దిల్లీతో పాటు పాకిస్తాన్‌, న్యూయార్క్‌, నైజీరియా.. ఇలా వివిధ దేశాల్లోని స్కూళ్లలో చదువుకోవాల్సి వచ్చింది. ఆఖరికి నైజీరియా స్కూల్లో చేరాక.. నేను మాట్లాడే భారతీయ భాష యాస విని అక్కడి పిల్లలు నన్ను ఆటపట్టించేవాళ్లు. ఏవేవో కార్టూన్‌ క్యారక్టర్‌ పేర్లతో నన్ను పిలుస్తూ ఏడిపించేవాళ్లు. మా అమ్మ చాలా అందగత్తె. తను టీచర్‌. నేను చదివే స్కూల్లోనే పాఠాలు చెప్పేది. దీంతో అందరూ నన్ను తనతో పోల్చుతూ.. ‘నువ్వెంత అందవికారంగా ఉన్నావో?!’ అంటూ సూటిపోటి మాటలనే వారు. ఇవన్నీ నా మనసును గాయపరిచాయి. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. నన్ను ఒక రకమైన ఆత్మన్యూనతలోకి నెట్టేశాయి.

జీవితం వ్యర్థమనిపించి..!

ఈ ప్రతికూలతల నడుమ 22 ఏళ్లకే చదువు పూర్తిచేశా.. ఇవి చాలవన్నట్లు ఈ దురదృష్టం ఉద్యోగ ప్రయత్నాల్లోనూ నన్ను వెంబడించింది. వరుసగా ఏడుసార్లు ఇంటర్వ్యూల్లో విఫలమయ్యా. ఇక జీవితం వ్యర్థమనిపించింది. కిటికీలోంచి బయటికి దూకి ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించా. అప్పుడు నా స్నేహితురాలే నన్ను కాపాడింది. తీవ్రమైన కుంగుబాటులో ఉన్న నన్ను సైకియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లింది. చికిత్స ఇప్పించి తిరిగి నన్ను మామూలు మనిషిని చేయడంలో కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో మరో ఇంటర్వ్యూ అవకాశం వచ్చింది. ఇదే ఆఖరి ప్రయత్నంగా ఇంటర్వ్యూకు హాజరయ్యా. ఈసారి అదృష్టం వరించింది. అమెరికాలోని మెకిన్సే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీవితంలో నా దశ తిరిగిందనుకున్నా. అయితే మూడేళ్ల తర్వాత ఆర్థిక మాంద్యం ప్రభావం నా ఉద్యోగం పైనా పడింది. జాబ్‌ కోల్పోవడంతో తిరిగి ఇండియా చేరుకున్నా.

అలా ‘సీఈఓ’నయ్యా!

ఈసారి అధైర్యపడకుండా సొంతంగా ఓ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పెట్టాలనుకున్నా. ఈ క్రమంలోనే నళిన్‌ మోనిజ్‌తో పరిచయమైంది. క్రమంగా అది ప్రేమగా మారి మా పెళ్లికి దారితీసింది. నేను, నళిన్ మరో ఫ్రెండ్‌తో కలిసి కంపెనీ ప్రారంభించాం. కొన్నేళ్లలోనే మంచి పేరు సంపాదించాం. దాంతో ఎడెల్‌వీస్‌ అనే మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ మా కంపెనీని కొనుగోలు చేసింది. ఆ సంస్థలో నాకు కీలక పదవి దక్కింది. కంపెనీ అభివృద్ధిలో నాకొచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాను. ఇంతలోనే ఎడెల్‌వీస్ సంస్థకు కొత్త సీఈఓ కావాలని వేట మొదలైంది.

‘ఆ పదవి నీకే ఎందుకు దక్కకూడదు? అనుభవం లేకపోయినా సీఈఓకు ఉండాల్సిన అన్ని లక్షణాలు, నైపుణ్యాలు నీలో ఉన్నాయి’ అంటూ నన్ను ప్రోత్సహించారు మావారు. ఇదే విషయాన్ని మా బాస్‌ వద్దకు తీసుకెళ్లా.. ‘నాకు సీఈఓ పదవిపై ఆసక్తి ఉంద’ని చెప్పా. అనుభవం లేకపోయినా.. నాలో ఉన్న తపనతో నన్ను నేను మెరుగుపరచుకోగలనన్న భరోసా ఇచ్చా. అలా కొన్ని నెలల తర్వాత ఆ పదవి నాకు దక్కింది. దేశంలోని అత్యంత పిన్న వయస్కులైన సీఈఓలలో నేనూ ఒకరినని తెలుసుకొని మురిసిపోయా.

అదే నా ప్రత్యేకత!

ఆ మరుసటి ఏడాదే ఓ కార్యక్రమంలో నన్ను వక్తగా ఆహ్వానించారు. ఆ వేదికగా నా జీవితంలోని ఎత్తుపల్లాలన్నీ పంచుకున్నా. నా ఉపన్యాసం శారీరక, మానసిక లోపాలున్న ఎంతోమందిలో స్ఫూర్తి నింపింది. మరెంతోమంది వాళ్ల సమస్యల్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా పంచుకోవడం మొదలుపెట్టారు. లోపాలే మనలో ఉండే ప్రత్యేకతలు అని తెలుసుకున్న నేను.. నా గత అనుభవాలన్నీ రంగరించి ‘లిమిట్‌లెస్‌’ అనే పుస్తకం కూడా రాశాను. నా జీవితంలో నేను సాధించిన గొప్ప విజయం ఏంటంటే.. ఎలా ఉన్నా నన్ను నేను అంగీకరించడం. ఇప్పటికీ నన్ను చూసి కొందరు కామెంట్లు చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఒకటే ప్రశ్న వేస్తా.. ‘అవును.. నా కళ్లలో మెల్ల ఉంది.. మెడ కాస్త వంకర.. అయితే ఏంటి? అదే నా ప్రత్యేకత! మరి, మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి?’ అని..’ అంటూ తన జీవితగాథను పంచుకున్నారు రాధిక.

అమ్మ కాబోతున్నా!

ప్రస్తుతం ఎడెల్‌వీస్‌ సీఈఓగా తన పని తాను చేసుకుపోతున్నా రాధికకు విమర్శలు తప్పట్లేదు. ఇటీవలే ఆమె రాసిన పుస్తకం గురించి ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం వృత్తిపరమైన పనుల పైన దృష్టి పెట్టండి.. ఇలాంటి హాబీలేమైనా ఉంటే రిటైరయ్యాక చూసుకోండి..’ అంటూ విమర్శించాడు. అందుకు తనదైన శైలిలో బదులిచ్చారు రాధిక.

‘సత్య నాదెళ్లనే ఉదాహరణగా తీసుకుందాం. ఆయన ఓవైపు మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తూనే.. మరోవైపు ‘హిట్‌ రీఫ్రెష్‌’ అనే పుస్తకం రాశారు. నేనూ అదే చేశా. పనిపై నిబద్ధత కలిగిన వ్యక్తులు.. ఇటు వృత్తిని, అటు ప్రవృత్తిని సమన్వయం చేసుకోగలరు..’ అంటూ చురకలంటించారు.

ప్రస్తుతం రాధిక భర్త అదే కంపెనీలో చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాధిక-నళిన్‌లు త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందబోతున్నారు. ఈ క్రమంలో తాను గర్భవతినంటూ ఈ శుభవార్తను ఇటీవలే సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారీ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమన్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్