ఆ నైపుణ్యాలే ‘సెలబ్రిటీ డిజైనర్’గా మార్చాయి!

కాలక్షేపం అవుతుందనో లేదంటే సరదా కోసమో తమకు ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి పెడుతుంటారు చాలామంది. అయితే అవే వ్యాపకాల్ని వ్యాపారంగా మలచుకునే వారు అరుదుగా కనిపిస్తుంటారు.

Updated : 31 Aug 2023 21:33 IST

కాలక్షేపం అవుతుందనో లేదంటే సరదా కోసమో తమకు ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి పెడుతుంటారు చాలామంది. అయితే అవే వ్యాపకాల్ని వ్యాపారంగా మలచుకునే వారు అరుదుగా కనిపిస్తుంటారు. హైదరాబాద్‌కు చెందిన రజితా రాజ్‌ రావుల రెండో కోవకు చెందుతారు. దుస్తులు కుట్టడంలో ఆసక్తి, నైపుణ్యాలున్న ఆమె.. తన కూతురి కోసం విభిన్న డిజైనర్‌ దుస్తులు కుట్టేవారు. అలా ప్రారంభమైన తన ఫ్యాషన్‌ వ్యాపకాన్ని కాలక్రమేణా వ్యాపార సూత్రంగా మలచుకున్న ఆమె.. ఇందులోనే అంచెలంచెలుగా ఎదుగుతూ సెలబ్రిటీ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు సీరియళ్లు, సినిమాల్లోని నటీనటులకు కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తూ.. ఫ్యాషన్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రజిత.. తన వ్యాపార ప్రయాణాన్ని ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

మాది కాజీపేట్‌. మావారి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాం. ఇంటర్‌లో ఉన్నప్పుడే నాకు పెళ్లైంది. నాకు చిన్నతనం నుంచే క్రాఫ్టింగ్‌, దుస్తులు కుట్టడం అంటే ఇష్టం. పెళ్లి తర్వాత కాస్త ఖాళీ సమయం, అవకాశం దొరకడంతో నా అభిరుచిపై దృష్టి పెట్టాను. బొమ్మలకు చిన్న చిన్న గౌన్లు, దుస్తులు కుట్టి.. వాటికి అలంకరించి మురిసిపోయేదాన్ని. ఇక పాప పుట్టాక తన కోసం కుట్టడం ప్రారంభించా. మా అత్తగారి పాత చీరలతో గౌన్లు, చుడీదార్స్‌, లంగావోణీ.. వంటివెన్నో కుట్టేదాన్ని. ఇక తన స్కూల్లో జరిగే ఫ్యాన్సీ డ్రస్‌ కాంపిటీషన్‌ కోసం.. థీమ్‌ను బట్టి వివిధ రకాల దుస్తులు రూపొందించేదాన్ని. అలా వాటికి తనెప్పుడూ ఫస్ట్‌ ప్రైజ్‌ గెలుచుకునేది.

చూడగానే.. కుట్టగలను!

నాకు గ్రాహ్య శక్తి ఎక్కువ. ఎంత కఠినమైన డిజైన్‌ అయినా సరే.. ఒక్కసారి చూడగానే అచ్చం దానిలాగే కుట్టగలను. అంతేకాదు.. శరీరాకృతికి తగినట్లుగా డ్రస్‌ డిజైన్‌, సూటయ్యే రంగునూ అంచనా వేయగలను. అలా ఫ్యాషన్‌ పత్రికలు, సినిమా పాటల్లో హీరోయిన్లు వేసుకునే దుస్తుల్ని రెప్లికేట్‌ చేస్తూ పాప కోసం బోలెడన్ని డ్రస్సులు కుట్టేదాన్ని. అవి చూసి ఇరుగుపొరుగు వాళ్లు తమకూ అలాంటివి కావాలని అడిగేవారు. అలా వాళ్ల కోసమూ కుట్టడం ప్రారంభించా. క్రమంగా ఆర్డర్లు పెరగడంతో తొలుత ఆరుగురిని పనిలో చేర్చుకున్నా. వాళ్లకు శిక్షణ ఇచ్చి.. నాకొచ్చిన ఆర్డర్స్‌ పూర్తిచేసి పంపించేదాన్ని. ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌, క్రాఫ్ట్‌, ఎంబ్రాయిడరీ.. ఇలా నాకొచ్చిన డిజైనింగ్‌ నైపుణ్యాల్ని వాళ్లకు నేర్పుతూ.. వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ముందుకు సాగాను. అలా 2016లో ‘CHURPS Trends’ పేరుతో నగరంలోనే ఓ బొతిక్‌ ప్రారంభించాను. ఇటీవలే మరో స్టోర్‌ తెరిచాను.

‘కాంబో’లతో పేరు ప్రఖ్యాతులు!

వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా కస్టమైజ్‌డ్‌ దుస్తుల్ని డిజైన్‌ చేయడం మా ప్రత్యేకత! అందులోనూ ‘కాంబో (కాంబినేషన్స్‌)’లను డిజైన్‌ చేస్తూ మరింతమందికి దగ్గరయ్యాను. ప్రస్తుతం మా వద్ద.. పిల్లల నుంచి పెద్దల దాకా, క్యాజువల్‌ నుంచి అకేషనల్‌ దాకా.. అన్ని రకాల దుస్తులు రూపొందుతున్నాయి. లెహెంగాలు, బ్రైడల్‌ వేర్‌, షేర్వాణీ, ధోతీ-కుర్తీ.. ఇలా ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగంలో ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి డిజైనర్‌ వేర్‌ మా వద్ద లభ్యమవుతోంది. ఇక కాంబోల విషయానికొస్తే.. తల్లీ-కూతురు/తల్లీ-కొడుకు, అన్నా చెల్లి/అక్కా తమ్ముడు, అక్కచెల్లెళ్లు, భార్య-భర్త, పెళ్లి కూతురు-పెళ్లికొడుకు, బర్త్‌డే కాంబోస్‌, ఫ్యామిలీ కాంబోస్‌, మెటర్నిటీ వేర్‌.. ఇలా సందర్భాన్ని బట్టి దుస్తులు డిజైన్‌ చేసిస్తున్నాం. ఇక పెళ్లిళ్లకైతే.. నిశ్చితార్థం, హల్దీ, మెహెందీ, బ్రైడల్‌ వేర్‌, రిసెప్షన్‌.. ఇలా అన్ని వేడుకలకు సంబంధించిన దుస్తుల్ని థీమ్‌ని బట్టి డిజైన్‌ చేసిస్తాం. అంతేకాదు.. పెళ్లి థీమ్‌ని బట్టి అడ్డుతెరల్నీ ప్రత్యేకంగా తయారుచేసిస్తున్నాం. ఇలా కాంబినేషన్సే కాకుండా.. నేను సొంతంగా కొన్ని డిజైనర్‌ దుస్తుల్ని రూపొందించి.. సెలబ్రిటీలతో ఫొటోషూట్స్‌ చేయిస్తుంటా. ఇలా వీటన్నింటికీ డిజైన్‌ను బట్టి.. మగ్గం, ఎంబ్రాయిడరీ, జర్దోసీ-మగ్గం, మగ్గం-మిర్రర్‌ వర్క్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌.. వంటి నైపుణ్యాలతో హంగులద్దుతున్నా. ప్రస్తుతం స్థానికంగానే కాదు.. యూఎస్‌, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్‌.. వంటి దేశాల నుంచీ ఆర్డర్లొస్తున్నాయి.

సెలబ్రిటీ డిజైనర్‌గా..!

సామాన్యులకే కాదు.. నా పనితనం నచ్చి గత కొన్నేళ్లుగా సెలబ్రిటీల నుంచీ ఆర్డర్లు అందుకుంటున్నా. సీరియల్‌ నటీనటులకు, టీవీ షోలు, ఈవెంట్ల కోసమూ కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తున్నా. అలా జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీలోని ఆర్టిస్టులకు కొన్ని దుస్తులు రూపొందించాను. పలు సీరియల్స్‌కూ కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశాను. బుల్లితెర నటీమణులు భానుశ్రీ, కావ్య, ప్రేమి విశ్వనాథ్‌, ఆషికా పదుకొణెలతో పాటు.. యాంకర్లు శ్యామల, మంజూష కోసమూ దుస్తులు రూపొందించా. ఇలా బుల్లితెర పైనే కాదు.. వెండితెర కోసమూ పనిచేశా. ‘బిహైండ్‌ సమ్‌వన్‌’ అనే సినిమాలోని పాటలకు గాను ఆ చిత్ర హీరోయిన్‌ నివీక్ష కోసం కొన్ని కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశాను. ‘అనుభవించు రాజా’ ఫేమ్‌ శ్రావణి నిక్కి కూడా తన ఫొటోషూట్స్‌, ఈవెంట్స్‌ కోసం తరచూ మమ్మల్ని సంప్రదిస్తుంటుంది. ఇటీవలే హెబ్బా పటేల్‌ కూడా మా వద్ద కొన్ని దుస్తులు డిజైన్‌ చేయించుకుంది. వీటితో పాటు కొలాబొరేషన్‌ షూట్స్‌కీ డ్రస్సులు రూపొందిస్తుంటా.

నైపుణ్యాల్ని పంచుతూ..!

కేవలం దుస్తులు రూపొందించడమే కాదు.. ఔత్సాహికులకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో మెలకువలూ నేర్పుతున్నా. ఈ క్రమంలో ఫ్యాషన్ డిజైనింగ్‌, బొతిక్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నా. మిర్రర్‌ వర్క్‌, కచ్‌ వర్క్‌, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌, క్రాఫ్ట్‌ వర్క్‌.. వంటి నైపుణ్యాలు నేర్పుతున్నా. మూడు నెలల కోర్సులో భాగంగా ప్రాథమిక విషయాలు మొదలు.. సరికొత్త ట్రెండ్స్‌ వరకూ.. అన్ని మెలకువలూ నేర్పుతున్నా. అలాగే కొంతమంది ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్థులూ ఇంటర్న్‌షిప్‌ కోసం నా దగ్గరికి వస్తుంటారు. దుస్తులు డిజైన్‌ చేసే క్రమంలో వాళ్ల ఐడియాలను కూడా పరిగణనలోకి తీసుకుంటా. మరోవైపు ఆన్‌లైన్‌లో ప్రత్యేక తరగతులు, యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా ఫ్యాషన్‌ పాఠాలూ చెబుతున్నా. భవిష్యత్తులో ఫ్రాంఛైజీ అవకాశాలు కల్పిస్తూ, మరిన్ని బ్రాంచులు తెరవాలన్న ఆలోచన ఉంది. అలాగే త్వరలోనే వెబ్‌సైట్‌ కూడా ప్రారంభించబోతున్నా.

ఇష్టంతో పని చేస్తే..!

బొతిక్ నిర్వహణతో పాటు సందర్భాన్ని బట్టి వృద్ధాశ్రమాలకు దుస్తులు అందించడం, అనాథాశ్రమంలో పెరిగిన పిల్లలకు పదో తరగతి పూర్తయ్యాక ఉచితంగా కుట్టు మిషన్‌, ఎంబ్రాయిడరీ వర్క్స్‌, డిజైనింగ్‌లలో శిక్షణ ఇవ్వడం.. వంటివి చేస్తుంటాను. అలాగే కొవిడ్‌ సమయంలో మాస్కులు కుట్టి ఉచితంగా పంపిణీ చేశాను.

ఇక ఆఖరుగా ఒక్క మాట.. ప్రతి ఒక్కరిలోనూ ఒక తపన ఉంటుంది. అదేంటో తెలుసుకోగలిగితే మన అంతిమ లక్ష్యమేంటో మనకు అవగతమవుతుంది. ఏ రంగాన్ని ఎంచుకున్నా.. దానిపై కనీస అవగాహన ఉండాలి. నైపుణ్యాల్ని పెంచుకుంటూ పోవడం, కష్టపడే తత్వం, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం.. వంటి లక్షణాలు మనల్ని విజయతీరాలకు చేర్చుతాయి. ఇష్టంతో పని చేయడం, సమయపాలన పాటించడం వల్ల ఇంటిని-పనిని బ్యాలన్స్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్